త్రిష ఫైర్ అవ్వడంతో సీన్ రివర్స్!
మైక్రోఫోన్ ముందు మాట్లాడినంత మాత్రాన అది తెలివైన మాట అయిపోదని, కేవలం సౌండ్ మాత్రమే పెరుగుతుందని త్రిష గట్టిగా బదులివ్వడం గమనార్హం.
By: M Prashanth | 10 March 2026 1:31 PM ISTగలాట్టా అవార్డ్స్ వేదికగా నటి త్రిషపై నటుడు, దర్శకుడు పార్థిబన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపాయి. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని పార్థిబన్ వివరణ ఇస్తూ ఒక వీడియో విడుదల చేశారు. అయితే జరిగిన తప్పుపై పశ్చాత్తాపం చూపకుండా ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నారని నెటిజన్లు ఆయనపై మండిపడుతున్నారు.
మైక్రోఫోన్ ముందు మాట్లాడినంత మాత్రాన అది తెలివైన మాట అయిపోదని, కేవలం సౌండ్ మాత్రమే పెరుగుతుందని త్రిష గట్టిగా బదులివ్వడం గమనార్హం. అసలు ఏం జరిగిందంటే, అవార్డు వేడుకలో త్రిష ఫోటో స్క్రీన్‌పై కనిపించినప్పుడు ఆమె పోషించిన 'కుందవై' పాత్రను ఉద్దేశించి పార్థిబన్ ఒక కామెంట్ చేశారు. "సమస్యలు రాకుండా ఉండాలంటే కుందవైని ఇంట్లోనే కూర్చోబెట్టాలి" అనే అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు.
విజయ్ రాజకీయ ఎదుగుదల, త్రిషతో ముడిపెడుతూ వస్తున్న కొన్ని యూట్యూబ్ వీడియోల ప్రభావంతోనే తాను ఆవేదనతో అలా అన్నానని పార్థిబన్ చెప్పుకొచ్చారు. కానీ ఒక స్టార్ హీరోయిన్‌ను ఉద్దేశించి వేదికపై అలా మాట్లాడటం ఏమాత్రం సమంజసం కాదని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. స్టేజ్ దిగిన వెంటనే తన స్నేహితుడు ఒకరు ఆ వ్యాఖ్యల గురించి హెచ్చరించడంతో, పార్థిబన్ వెంటనే నిర్వాహకులను కలిసి ఆ క్లిప్‌ను తొలగించమని కోరారు.
కానీ దురదృష్టవశాత్తు మరుసటి రోజు ఉదయానికే ఆ వీడియో సోషల్ మీడియాలో లీక్ అయ్యి వైరల్ అయ్యింది. మహిళా దినోత్సవం సందర్భంగా ఒక వీడియో రికార్డ్ చేసి తన విచారాన్ని వ్యక్తం చేయాలని భావించినా, సాంకేతిక కారణాల వల్ల అది ఆలస్యమైందని ఆయన వివరించారు. ఈ లోపే త్రిష సోషల్ మీడియాలో స్పందించడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. పార్థిబన్ వివరణ ఇస్తూ.. త్రిష ఫోటోను స్క్రీన్‌పై ప్రదర్శించమని ఎవరో కావాలనే నిర్వాహకులను కోరారని ఆమె చేసిన పోస్ట్ చూసి తాను చాలా బాధపడ్డానని అన్నారు.
ఒకవేళ త్రిష అప్పటికే ఈ విషయంపై అంత ఘాటుగా స్పందించిందని తనకు ముందే తెలిసి ఉంటే, తాను వివరణ ఇస్తూ ఆ వీడియోను విడుదల చేసేవాడిని కాదని పార్థిబన్ పేర్కొన్నారు. తన మాటల వెనుక ఎటువంటి దురుద్దేశం లేదని ఆయన సమర్థించుకున్నా, త్రిష ఫ్యాన్స్ మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ వివాదం కోలీవుడ్ లో హాట్ టాపిక్‌గా మారింది. పార్థిబన్ మాత్రం తన వివరణతో ఈ గొడవను సద్దుమణిగించే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ వివరణతోనైనా ఈ వివాదానికి ముగింపు పడుతుందో లేదో చూడాలి.
