ఒక తరం మూల్యం చెల్లించింది.. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు!
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా తల్లి అయిన తర్వాత మళ్లీ పూర్తిస్థాయిలో కెరీర్‌పై దృష్టి సారించిన సంగతి తెలిసిందే.
By: Srikanth Kontham | 11 Sept 2026 1:00 PM ISTబాలీవుడ్ నటి పరిణీతి చోప్రా తల్లి అయిన తర్వాత మళ్లీ పూర్తిస్థాయిలో కెరీర్‌పై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ముంబైలో జరిగిన ట్‌ఫ్లిక్స్ సిరీస్ `షక్` ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో అమ్మడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరిణీతి తల్లి అయిన తర్వాత కూడా నటీమణులు వృత్తిని కొనసాగించడానికి సినీ పరిశ్రమ ..ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణే ప్రధాన కారణమన్నారు. ఒకప్పుడు కథానాయికలు పెళ్లి చేసుకుని తల్లులు కాగానే కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాల్సిన పరిస్థితి ఉండేదని గుర్తుచేశారు. ఒక తరం నటీమణులు నాటి ప్రేక్షకులు .. పరిశ్రమ ఆలోచనా విధానం వల్ల కెరీర్‌ను త్యాగం చేసి పెద్ద మూల్యాన్నే చెల్లించాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు.
అయితే ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారిపోయిందని.. వర్తమాన కాలంలో పరిశ్రమలో ఎంతో సానుకూల మార్పు వచ్చిందన్నారు. తాజా ప్రాజెక్టులకు సంబంధించి దర్శక, రచయితలు కూడా తను తల్లి అయ్యాననే విషయాన్ని ప్రతికూల అంశంగా చూడలేదన్నారు. మాతృత్వాన్ని అనుభవించినంత మాత్రాన కెరీర్ ముగిసిపోదని.. ఇప్పుడు ప్రేక్షకులు కూడా తల్లులైన కథానాయికలను ఎంతో ఆదరిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు.
సహచర నటీమణులైన ఆలియా భట్, దీపికా పడుకోణె, సోదరి ప్రియాంకా చోప్రాలను ఈ సందర్భంగా పరిణీతి ప్రత్యేకంగా కొనియాడారు. వీరంతా మాతృత్వాన్ని ఆస్వాదిస్తూనే అంతర్జాతీయ స్థాయిలో ..భారతీయ సినిమాలో విజయవంతంగా కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తున్నారని గుర్తు చేశారు. తల్లి అయిన తర్వాత కూడా నిలకడగా పనిచేస్తూ నటిగా మరింత నాణ్యమైన చిత్రాలు చేయడం ద్వారా నయా ట్రెండ్‌ను వారు సాధారణమైనదిగా మార్చేశారని పరిణితి అభిప్రాయపడ్డారు.
సినిమా రంగంలో వచ్చే మార్పులు ఎప్పుడైనా ప్రేక్షకుల డిమాండ్‌పైనే ఆధారపడి ఉంటాయన్నారు.ప్రేక్షకులు తల్లులైన హీరోయిన్లను కాన్సెల్ చేయకపోవడం వల్లే రచయితలు, దర్శకులు వారికి తగిన విధంగా మంచి కథలను సిద్ధం చేయగలుగుతున్నారన్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు తమ తరం నటీమణులు తల్లులుగా మారుతూనే నటనలోనూ అంతకంటే మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నారన్నారు.
పరిణీతి చోప్రా నటిస్తోన్న నూతన సిరీస్ `షక్` విషయానికొస్తే ఇదొక మిస్టరీ థ్రిల్లర్. అందులో అమ్మడు తప్పిపోయిన బిడ్డను వెతికే తల్లి పాత్రలో కనిపిస్తున్నారు. రెన్సిల్ డిసిల్వా - సిద్ధార్థ్ పి. మల్హోత్రా రూపొందించిన సిరీస్‌లో సోనీ రజ్దాన్, అనూప్ సోని, జెన్నిఫర్ వింగ్ గెట్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పరిణితి చోప్రా ఓటీటీ డెబ్యూ ఇదే కావడం విశేషం.
