పెళ్లి తర్వాత వీకైన బ్యూటీ!
ఒకప్పుడు పెళ్లైతే హీరోయిన్ల కెరీర్ అయిపోయినట్లే భావించేవారు. కానీ కాలం మారింది. పెళ్లికాని భామల కంటే పెళ్లైన తారలకే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎక్కువ అవకాశాలు వస్తున్న సంగతి తెలిసిందే.
By: Srikanth Kontham | 12 Aug 2026 6:00 AM ISTఒకప్పుడు పెళ్లైతే హీరోయిన్ల కెరీర్ అయిపోయినట్లే భావించేవారు. కానీ కాలం మారింది. పెళ్లికాని భామల కంటే పెళ్లైన తారలకే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎక్కువ అవకాశాలు వస్తున్న సంగతి తెలిసిందే. నయనతార, దీపికా పదుకొనే, కరీనా కపూర్, సమంత, కీర్తి సురేష్ వంటి ఎంతోమంది భామలు వివాహం తర్వాత కూడా తమ జోరును కొనసాగిస్తూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. పెళ్లి అనేది వారి విజయానికి ఎప్పుడూ అడ్డు రాలేదు సరికదా మరింత పరిణతి చెందిన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే ఇదే సూత్రం అందరికీ వర్తించదు అనడానికి బాలీవుడ్ నటి పరిణితి చోప్రా ఉదాహరణగా నిలుస్తోంది.
మిగతా హీరోయిన్లంతా పెళ్లి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‌తో మరింత బిజీ అవుతుంటే పరిణితి మాత్రం కొత్త అవకాశాలు అందుకోవడంలో వెనుకబడిపోయింది. కెరీర్ పరంగా అమ్మడి జోరు కొంతమేర మందగించింది. స్టార్ హీరోల సరసన వరుస ప్రాజెక్ట్‌లతో దూసుకుపోవాల్సిన తరుణంలో సొగసరి కెరీర్ గ్రాఫ్ ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘవ్ చద్దాతో వివాహం తర్వాత పరిణితి చోప్రా వ్యక్తిగత జీవితంలో స్థిరపడ్డారు. వివాహ బంధంలోకి అడుగుపెట్టిన బ్యూటీ అటు పర్సనల్ లైఫ్‌ను, ఇటు ప్రొఫెషనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే పెళ్లి తర్వాత ఆమె పూర్తిస్థాయిలో సినిమాలపై దృష్టి పెట్టలేకపోయారనే టాక్ వినిపిస్తోంది. వ్యక్తిగత ప్రాధాన్యతలు మారడం కూడా కెరీర్‌పై కొంత ప్రభావం చూపిందనేది విశ్లేషకుల మాట. 2023 -24 మధ్య కాలంలో పరిణితి చోప్రా కేవలం రెండే రెండు సినిమాలలో నటించారు. అందులో ఒకటి కోర్ట్ రూమ్ డ్రామా కాగా, మరొకటి పంజాబీ చిత్రం. భారీ బడ్జెట్ చిత్రాలు లేదా పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ల జోలికి వెళ్లకుండా పరిమితమైన సినిమాలే ఎంచుకున్నారు. ప్రేక్షకులను అలరించే కంటెంట్ ఓరియంటెడ్ రోల్స్ చేసినా? బాక్సాఫీస్ వద్ద ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో సంచలనాలు సృష్టించలేకపోయాయి.
బాలీవుడ్‌లో పోటీ పెరిగిన తరుణంలో గ్యాప్ వస్తే వెనకబడిపోవడం సహజం. పెళ్లి తర్వాత కొంతకాలం సినిమాలకు దూరం కావడం ..సెలెక్టివ్‌గా సినిమాలు చేయడం వల్ల రేసులో వెనుకపడ్డారన్ని కొంత వాస్తవమైతే? అవకాశాలు అందుకోవడం లో విఫలమవుతున్నారు? అన్నది మరికొంత వాస్తవం. అగ్ర నిర్మాతలు, స్టార్ డైరెక్టర్ల నుంచి ఆమెకు పిలుపులు కరువయ్యాయనే మాట బలంగా వినిపిస్తోంది. వరుస విజయాలు లేకపోవడం కూడా మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నది అంతే వాస్తవం.
మొత్తంగా పెళ్లి తర్వాత టాలీవుడ్, బాలీవుడ్‌లలో చాలామంది భామలు అదరగొడుతున్నా? పరిణితి చోప్రా విషయంలో మాత్రం సీన్ రివర్స్ అయింది. ప్రస్తుతం ఆమె కెరీర్‌ను మళ్ళీ గాడిలో పెట్టేందుకు సరైన స్క్రిప్ట్‌ల కోసం ఎదురు చూస్తున్నారు. భవిష్యత్తులో పరిణితి ఎలాంటి రీఎంట్రీ ఇస్తారనేది చూడాలి.
