Begin typing your search above and press return to search.

తాజ్‌మ‌హ‌ల్ గోపురం నుంచి శివుడు.. వివాదంపై ప‌రేష్ వివ‌ర‌ణ‌

తాజ్ మ‌హ‌ల్ గోపురం తొల‌గించాక‌ అక్క‌డ ప‌ర‌మ‌శివుని గుడి ప్ర‌త్య‌క్ష‌మయ్యేలా ఓ పోస్ట‌ర్ ని విడుద‌ల చేయ‌గా, దానిపై తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి.

By:  Sivaji Kontham   |   1 Oct 2025 12:22 PM IST
తాజ్‌మ‌హ‌ల్ గోపురం నుంచి శివుడు.. వివాదంపై ప‌రేష్ వివ‌ర‌ణ‌
X

ప‌రేష్ రావ‌ల్ న‌టించిన `ది తాజ్ స్టోరి` పోస్ట‌ర్ వివాదాన్ని మోసుకొచ్చింది. తాజ్ మ‌హ‌ల్ గోపురం తొల‌గించాక‌ అక్క‌డ ప‌ర‌మ‌శివుని గుడి ప్ర‌త్య‌క్ష‌మయ్యేలా ఓ పోస్ట‌ర్ ని విడుద‌ల చేయ‌గా, దానిపై తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. చారిత్ర‌క క‌థాంశంతో ముడిప‌డిన ఈ సినిమా పోస్ట‌ర్ వివాదం సోష‌ల్ మీడియాలో పెద్ద చ‌ర్చ‌గా మారింది. పోస్ట‌ర్ విడుద‌ల‌య్యాక‌, చాలా మంది నెటిజ‌నులు ప‌రేష్ రావ‌ల్ పై అనుచిత వ్యాఖ్య‌లు చేస్తున్నారు.

అయితే సీనియ‌ర్ న‌టుడు పరేష్ రావల్ దీనిపై వివ‌ర‌ణ ఇస్తూ, సోషల్ మీడియాలో ఒక నోట్ రాసారు. ద‌య‌చేసి కొన్ని విష‌యాల్ని మీరు గ‌మ‌నించాలి. ఈ చిత్రం ఎటువంటి మతపరమైన విషయాలను చర్చించదు అని తెలిపారు. ``ఈ సినిమాలో మ‌త‌ప‌ర‌మైన అంశాల‌కు చోటు లేదు. తాజ్ మహల్ లోపల శివాలయం ఉందని కూడా చెప్పలేద``ని స్పష్టం చేశారు. ఇది కేవలం చారిత్రక వాస్తవాలను చూపించే ప్ర‌య‌త్నం. దయచేసి సినిమా చూసి మీ సొంత‌ అభిప్రాయాన్ని ఏర్పరచుకోవాలని అభ్యర్థిస్తున్నాము`` అని నిర్మాత‌ల‌ త‌ర‌పున అత‌డు అభ్య‌ర్థించాడు.

అయితే ప‌రేష్ రావ‌ల్ వ్యాఖ్య‌ల‌ను చాలా మంది ఎగ‌తాళి చేసారు. ఇప్పుడు భారతీయ సినిమా జోకర్ `తాజ్ మహల్` నుండి శివుడు బయటకు వస్తున్నట్లు చూపించే ట్రైలర్‌ను విడుదల చేస్తున్నాడు... అని ఒక నెటిజ‌న్ రాసారు.

నాలుగ‌వ‌ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని చెప్పుకునే దేశం ప్రచారం, ఫాంటసీలో మునిగిపోయింది.. ప్రచారం కూడా సిగ్గుపడుతుంది అని ఒక వ్య‌క్తి సోష‌ల్ మీడియాలో రాసారు. ఈ సినిమా మీరు ఇన్నేళ్లలో సంపాదించిన మొత్తం ఖ్యాతిని నాశనం చేస్తుందని ఒక‌రు ప‌రేష్ ని హెచ్చ‌రించారు.

చ‌రిత్ర పాఠాల్లో అంద‌రికీ తెలిసిన తాజ్ మ‌హ‌ల్ స్మారక చిహ్నం గోపురం నుండి శివుడు ఎలా బయటకు వస్తున్నాడనేదానిని కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. అయితే అన్ని ప్ర‌శ్న‌ల‌కు కోర్ట్ రూమ్ డ్రామాలో స‌మాధానం దొరుకుతుంద‌ని ప‌రేష్ చెబుతున్నాడు. చారిత్ర‌క నేప‌థ్యంతో వ‌స్తున్న ఈ సినిమా పోస్ట‌ర్, టీజ‌ర్ తో ఆస‌క్తిని పెంచింది.

పరేష్ ప్రస్తుతం కెరీర్ ప‌రంగా బిజీ బిజీగా ఉన్నారు. మాడాక్ హారర్ కామెడీ యూనివర్స్‌లో తదుపరి భాగం థామాలో న‌టించాడు. ది తాజ్ స్టోరి, థామ త‌ర్వాత ప‌లు చిత్రాల‌కు సంత‌కాలు చేసార‌ని కూడా తెలిసింది.