జాతీయ అవార్డుల్లో లాబీయింగ్ ఉంది: పరేష్ రావల్
అవార్డుల ప్రక్రియపై చాలా మంది చాలా రకాలుగా నిరాశను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అవార్డులు లాబీయింగ్ తో మాత్రమే సాధ్యమని కొందరు తీవ్రంగా విమర్శించారు.
By: Sivaji Kontham | 3 Nov 2025 7:58 PM ISTఅవార్డుల ప్రక్రియపై చాలా మంది చాలా రకాలుగా నిరాశను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అవార్డులు లాబీయింగ్ తో మాత్రమే సాధ్యమని కొందరు తీవ్రంగా విమర్శించారు. కేవలం ప్రయివేట్ అవార్డుల్లోనే కాదు.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే జాతీయ అవార్డుల్లోను లాబీయింగ్ జరుగుతోందని చాలా మంది నటీనటులు గతంలో ఆరోపించారు. కొందరు నటులు ట్రోఫీలను తిరిగి వెనక్కి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.
నిజానికి ఈ అవినీతి జాఢ్యం జాతీయ స్థాయిలోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలోను ఉన్నదే. ఆస్కార్ అవార్డుల్లోను లాబీయింగ్ లేనిదే ఏదీ పాజిబుల్ కాదన్న చర్చ చాలాకాలంగా ఉంది. జాతీయ అవార్డుల్లో లాబీయింగ్ గురించి చాలాసార్లు సీనియర్ నటుడు పరేష్ రావల్ తన నిరాశను వ్యక్తం చేసారు. 1993లో విడుదలైన `వో చోక్రి`లో తన నటనకు గాను ఉత్తమ సహాయ నటుడిగా పరేష్ జాతీయ అవార్డును గెలుచుకున్నారు. ఆ తర్వాత కూడా ఆయన పేరు చాలాసార్లు పరిశీలనల్లోకి వచ్చింది.
ఇప్పుడు మరోసారి జాతీయ అవార్డులు, ఆస్కార్ లలోను లాబీయింగ్ ఎలా జరుగుతుందో వాస్తవికత గురించి మాట్లాడారు. రాజ్ షమణితో పాడ్‌కాస్ట్‌లో పరేష్ రావల్ మాట్లాడుతూ.. జాతీయ అవార్డులు అంటే అపారమైన గౌరవం ఉన్నా కానీ, ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ ఉన్న ఇతర అవార్డు వేడుకల తరహాలోనే అవి లాబీయింగ్ నుండి పూర్తిగా విముక్తి పొందలేదని పరేష్ రావల్ వ్యాఖ్యానించారు.
అయితే జాతీయ అవార్డుల పంథా గురించి మాట్లాడుతూ.. ఇక్కడ లాబీయింగ్ ఉన్నా ఇతర అవార్డుల్లో ఉన్నంత దారుణంగా ఉండదని అన్నారు. జాతీయ అవార్డు దాని ఖ్యాతిని నిలబెట్టుకుంటుందని వ్యాఖ్యానించారు. పెద్ద పార్టీలు ఓటర్లను ఆకర్షిస్తారని, నెట్ వర్కింగ్ ప్రేరేపిస్తుందని కూడా పరేష్ రావల్ వివరించారు. ఇది ఆస్కార్ అవార్డుల్లోను ఉందని అన్నారు. తమ సినిమాల ప్రచారం సమయంలో, అకాడెమీ సభ్యులతో ఇంటరాక్షన్ లు వంటివి కూడా అవార్డులను ప్రభావితం చేస్తాయని పరేష్ రావల్ అన్నారు.
ప్రస్తుతం ఏదైనా అవార్డు పొందాలని భావిస్తున్నారా? అని ప్రశ్నించగా, తాను కలిసి పని చేసిన దర్శకరచయితల నుంచి నిజాయితీగా ప్రశంసలు దక్కితే చాలునని అన్నారు. ట్రోఫీలు లేదా ప్రజా ప్రశంసల కంటే సృజనాత్మక అంశాలలో కలిసి పని చేసే సహచరుల నుండి `నిజమైన గుర్తింపు` పొందాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే, పరేష్ రావల్ నటించిన `ది తాజ్ స్టోరి` ఇటీవల విడుదలైంది. ఈ సినిమా ఆరంభం నుంచి వివాదాల్లో నిలుస్తోంది. `ది తాజ్ స్టోరీ`లో పరేష్ టూరిస్ట్ గైడ్‌గా కనిపించారు. ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న నటించిన హారర్-కామెడీ థామాలోను పరేష్ నటించాడు. హేరా ఫేరీ 3, భూత్ బంగ్లా, వెల్‌కమ్ టు ది జంగిల్ చిత్రీకరణ దశలో ఉన్నాయి.
