ఆస్కార్ విషయంలోనూ కూడా లాబీయింగ్.. అలా చేస్తేనే అవార్డులకు విలువ..
సినీ ఇండస్ట్రీలో ఆస్కార్ కు మించిన అవార్డు మరొకటి లేదు. ఆస్కార్ అవార్డు దక్కిన సినిమా అంటే అది ఎంతో గొప్ప విషయం.
By: Sravani Lakshmi Srungarapu | 3 Nov 2025 10:00 PM ISTసినీ ఇండస్ట్రీలో ఆస్కార్ కు మించిన అవార్డు మరొకటి లేదు. ఆస్కార్ అవార్డు దక్కిన సినిమా అంటే అది ఎంతో గొప్ప విషయం. అలాంటి ఆస్కార్ అవార్డుల విషయంలో కూడా లాబీయింగ్ జరుగుతుందని ఎప్పట్నుంచో విమర్శలున్నాయి. ఎంతోమంది హాలీవుడ్ యాక్టర్లు ఈ విషయంలో ఆరోపణలు చేశారు. అకాడమీ అవార్డుల కమిటీ కొన్ని దేశాల విషయంలోనే సానుకూలంగా ఉంటుందని, మిగిలిన దేశాల్లో ఎంత గొప్ప సినిమాలొచ్చినా పట్టించుకోరని ఎంతోమంది ఎన్నో కామెంట్స్ చేశారు.
ఆస్కార్ అవార్డుల్లోనూ లాబీయింగ్ ఉంటుంది
ఇప్పుడదే విషయాన్ని ప్రముఖ ఇండియన్ నటుడు పరేష్ రావల్ అన్నారు. గొప్ప గొప్ప పురస్కారాల కంటే తనకు ఆడియన్స్ నుంచి, దర్శకనిర్మాతల నుంచి వచ్చే ప్రశంసలే ముఖ్యమని ఆయన అన్నారు. అందుకే తానెప్పుడూ పెద్దగా అవార్డులను ఆశించనని, నేషనల్ అవార్డుల విషయంలో కూడా లాబీయింగ్ జరిగే ఆస్కారం ఉందని పరేష్ రావల్ అన్నారు.
రాజకీయ పార్టీలతో కలిసి లాబీయింగ్
ఎప్పుడైనా అవార్డులు ఎలాంటి పక్షపాతం లేకుండా ఇస్తేనే వాటికి గౌరవం, మర్యాద పెరుగుతుందని, అవార్డుల విషయంలో కూడా లాబీయింగ్ చేస్తే వాటికి ఉన్న గౌరవం పోతుందని ఆయన చెప్పారు. నేషనల్ అవార్డులు, ఆస్కార్ అవార్డుల విషయంలో కూడా లాబీయింగ్ కు ఆస్కారం ఉంటుందని, కొన్ని పొలిటికల్ పార్టీలతో కలిసి చిత్ర యూనిట్లు ఈ లాబీయింగ్ చేస్తారని పరేష్ రావల్ పేర్కొన్నారు.
రెండుసార్లు నేషనల్ అవార్డు అందుకున్న పరేష్
ఇవన్నీ తెలుసు కాబట్టే తనకు అవార్డుల కంటే యాక్టింగ్ బావుందని అప్లాజ్ వస్తే చాలా ఆనందంగా అనిపిస్తుందని, ట్రోఫీలు, బిరుదులు కంటే ఆడియన్స్ నుంచి వచ్చే ప్రశంసలకే తన మనసులో ఎక్కువ స్థానం ఉంటుందని పరేష్ తెలిపారు. కాగా పరేష్ రావల్ కు సర్, వో ఛోకరీ సినిమాల్లోని నటనకు గానూ రెండు సార్లు ఉత్తమ సహాయనటుడిగా నేషనల్ అవార్డులు దక్కిన సంగతి తెలిసిందే.
