యూత్‌కు జాగ్రత్తలు నూరిపోసిన సీనియర్ నటుడు!
జెన్ జీ యువతని ఉద్దేశించి ఈ మధ్య కాలంలో పేమస్ వ్యక్తులు మాట్లాడుతోన్న తీరు అంతకంతకు ఆకట్టు కుంటుంది.
By: Srikanth Kontham | 30 Aug 2026 7:00 AM ISTజెన్ జీ యువతని ఉద్దేశించి ఈ మధ్య కాలంలో పేమస్ వ్యక్తులు మాట్లాడుతోన్న తీరు అంతకంతకు ఆకట్టు కుంటుంది. యువత విషయాలో మేథా వర్గమంతా ఎవరి అభిప్రాయాలు వారో ఓపెన్ గా పంచుకుంటున్నారు. ఇటీవలే కంగనా రనౌత్ యువతని ఉద్దేశించి కొన్ని విమర్శలు చేసి వివాదాలు ఎదుర్కుంది. తనని తాను జెనీ బీగా ప్రకటించుకుని యువతని మరింత రెచ్చగొట్టింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ సీనియర్ నటుడు, మాజీ లోక్‌సభ ఎంపీ పరేష్ రావల్ నేటి తరం యువతపై తనదైన శైలిలో స్పందించారు.
నవతరం ఆవేశం, ఉత్సాహంతో నిండి ఉందని వారు అడుగులు వేసేటప్పుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిం చాలని పిలుపునిచ్చారు.నేటి యూత్‌పై దేశానికి ఎన్నో ఆశలు ఉన్నాయని కానీ బాహ్య ప్రభావాలకు లోనై దారి తప్పకుండా స్వతంత్రంగా ఆలోచించాలని హితవు పలికారు. యువత నడిపిన అనేక విప్లవాలు .. ఉద్యమాలు ప్రతికూల ప్రభావాల కారణంగా దారితప్పడం లేదా ఆగిపోవడం భారతదేశ చరిత్రలో చూశామని రావల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. సమాజంలో ముందుకు సాగే క్రమంలో ప్రతి ఒక్కరూ ఒక క్షణం ఆగి ఆత్మపరిశీలన చేసుకోవడం ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు.
ఇతరుల ప్రభావానికి లోనై తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే పర్యవసానాలు తప్పుగా మారతాయని అందుకే నవతరం విచక్షణతో వ్యవహరించాలని సూచించారు. దేశంలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు రావాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. కేవలం పాఠ్యాంశాల పరిమిత విద్య కాకుండా సమాజ నిర్మాణానికి తోడ్పడే దృక్పథం పెంపొందాలన్నారు. ఇందుకోసం ఉపాధ్యాయులు, విద్యార్థులు , తల్లిదండ్రులు ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని సూచించారు.
నీట్-యుజి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారాన్ని ఉదాహరణగా ప్రస్తావిస్తూ.. అక్రమ మార్గాల్లో ప్రశ్నాపత్రాలు కొనుగోలు చేయడానికి తల్లిదండ్రులే డబ్బు అందిస్తుంటారని.. ఇలాంటి అక్రమ చర్యలను తల్లిదండ్రులు ఎంతమాత్రం ప్రోత్సహించకూడదని వ్యాఖ్యా నిం చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పరేష్ వ్యాఖ్యలపై అంతా పాజిటివ్ గా స్పందిస్తున్నారు. యువతని ఉద్దేశించి మంచి వ్యాఖ్యలు చేసారని కొనియా డుతున్నారు. ఉడుకు రక్తంతో ఉండే యువతని మరింత రెచ్చగొట్టే వ్యాఖ్యలు కంటే వారు మనసును తాకే వ్యాఖ్యలతో మెప్పించగలమని మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అలాగే పరేష్ రావల్ తన సినిమా విశేషాలను కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. `హేరా ఫేరి` సిరీస్‌లో తాను పోషించిన ఐకానిక్ క్యారెక్టర్ బాబు భయ్యా (బాబు రావు గణపత్‌రావ్ ఆప్టే)లో ప్రముఖ కార్టూనిస్ట్ ఆర్.కె. లక్ష్మణ్ కామన్ మ్యాన్ ప్రతిరూపాన్ని చూశానని తెలిపారు. అయితే ఒక నటుడిగా ఒకే తరహా మూస పాత్రలకు పరిమితం కావడం తనకు ఊపిరి ఆడనట్లు అనిపిస్తుందని ఓపెన్‌గా చెప్పారు. బాబు భయ్యా వంటి పాపులర్ పాత్రలను సైతం కొత్త తరహా కథల్లోకి తీసుకెళ్లి విభిన్నంగా చూపిస్తే ప్రేక్షకులు మరింతగా ఆస్వాదిస్తారని అభిప్రాయపడ్డారు.
డిజిటల్ ట్రెండ్‌పై కూడా పరేష్ స్పందించారు. మంచి స్క్రిప్ట్ లభిస్తే ఓటీటీ చిత్రాల్లో నటించడానికి సిద్దంగా ఉన్నానన్నారు. కంటెంట్ బలంగా ఉంటే మాధ్యమంతో సంబంధం లేకుండా నటనకు ప్రాధాన్యం ఇస్తానని స్పష్టం చేశారు. సినిమా రంగమైనా? సమాజమైనా? మార్పును ఆహ్వానిస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
