గీత గోవిందం మ్యాజిక్ ఎక్కడ ఆగింది?
చిన్నగా కనిపించిన ప్రేమకథను కుటుంబ ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించడం, ఎంటర్టైన్మెంట్ ను యాడ్ చేయడం పరశురామ్ ప్రత్యేకతగా నిలిచింది.
By: M Prashanth | 24 July 2026 6:00 AM ISTఒక సినిమా.. ఒక దర్శకుడి కెరీర్ ను ఒక్కసారిగా మార్చేస్తుంది. అదే సినిమా తర్వాత వచ్చే అంచనాలు మాత్రం అతడికి పెద్ద సవాల్ గా మారతాయి. టాలీవుడ్ లో ఇలాంటి జర్నీకి ఎగ్జాంపుల్ గా దర్శకుడు పరశురామ్ పేరు చెప్పుకోవచ్చు. గీత గోవిందం మూవీతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆ డైరెక్టర్.. ఆ తర్వాత అదే స్థాయి విజయాన్ని అందుకోవడానికి చేసిన ప్రయత్నాలు మాత్రం అనుకున్నంతగా సక్సెస్ అవ్వలేదు.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా తెరకెక్కిన గీత గోవిందం 2018లో విడుదలై సంచలన విజయం సాధించింది. చిన్నగా కనిపించిన ప్రేమకథను కుటుంబ ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించడం, ఎంటర్టైన్మెంట్ ను యాడ్ చేయడం పరశురామ్ ప్రత్యేకతగా నిలిచింది. ఆ సినిమాతో ఆయనకు దర్శకుడిగా భారీ డిమాండ్ వచ్చింది. స్టార్ హీరోలు కూడా ఆయనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపించే స్థాయికి వెళ్లారు.
అయితే ఒక భారీ విజయాన్ని అందుకున్న తర్వాత అదే స్థాయి మ్యాజిక్ ను మళ్లీ క్రియేట్ చేయడం ప్రతి దర్శకుడికీ అంత ఈజీ కాదు. పరశురామ్ విషయంలోనూ అదే జరిగింది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కించిన సర్కారు వారి పాటపై భారీ అంచనాలు ఉన్నా.. సినిమా ప్రేక్షకులను పూర్తిగా మెప్పించలేకపోయింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో వచ్చిన ఫ్యామిలీ స్టార్ కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు.
ఇక్కడే అసలు పరీక్ష మొదలైంది. గీత గోవిందం మూవీ తర్వాత పరశురామ్ నుంచి ఆడియన్స్ మరింత స్ట్రాంగ్ స్టోరీలను ఆశించారు. కానీ ఒక దర్శకుడికి విజయంతో పాటు అంచనాల భారం కూడా పెరుగుతుంది. గతంలో చిన్న కథతో ఆకట్టుకున్న దర్శకుడు.. స్టార్ హీరోలతో సినిమా చేసే సమయంలో అదే రేంజ్ లో స్టోరీ, స్కేల్, ఎమోషన్ ను బ్యాలెన్స్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది.
సినిమా ఇండస్ట్రీలో దర్శకుడి ప్రయాణం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒక హిట్ తో అవకాశాలు వరుసగా వస్తే.. కొన్ని డిజాస్టర్లు వచ్చిన తర్వాత మళ్లీ తనను తాను నిరూపించుకోవాల్సిన సమయం వస్తుంది. ప్రస్తుతం పరశురామ్ అలాంటి స్టేజ్ లోనే ఉన్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం ఆయన కొత్త సినిమా కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. గతంలో స్టార్ హీరోలతో కాంబినేషన్లు చర్చకు వచ్చినా.. ఇప్పుడు సరైన కథ, సరైన హీరో కాంబినేషన్ కోసం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
ఒకప్పుడు గీత గోవిందంతో తనలో ఉన్న టాలెంట్ ను నిరూపించిన పరశురామ్.. మరోసారి అదే రేంజ్ విజయాన్ని అందుకుంటారా అన్నదే ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో ఒక ఫ్లాప్ దర్శకుడి కెరీర్ ను ముగించదు.. కానీ ఒక కంబ్యాక్ హిట్ మాత్రం రేంజ్ ను మళ్లీ మార్చేస్తుంది. ఇప్పుడు పరశురామ్ ముందున్న టార్గెట్ కూడా అదే. గీత గోవిందం మ్యాజిక్ ను మరోసారి తెరపై చూపించి తన మార్క్ తిరిగి నిలబెట్టుకోవడమే. మరి ఇపప్టికే పలు వార్తలు వస్తున్నా.. నెక్స్ట్ ఎవరితో పరశురామ్ వర్క్ చేస్తారో అంతా వేచి చూడాలి.
