కోలీవుడ్ 'సంక్రాంతి' హీరో.. సరైన నిర్ణయమేనా?
శివ కార్తికేయన్ హీరోగా, సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన పరాశక్తి సినిమా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.
By: M Prashanth | 23 Dec 2025 11:29 PM IST2026 సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద బీభత్సమైన పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. ఏకంగా ఐదు తెలుగు స్ట్రయిట్ సినిమాలతోపాటు రెండు తమిళ డబ్బింగ్ చిత్రాలు సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. దీంతో ఏం జరుగుతుందోనని ఆసక్తిగా మారింది. థియేటర్స్ విషయంలో కచ్చితంగా ఇబ్బందులు ఎదురయ్యేలా పరిస్థితి కనిపిస్తుంది.
అయితే కోలీవుడ్ హీరోలు జన నాయగన్ తో విజయ్.. పరాశక్తితో శివకార్తికేయన్.. సంక్రాంతి కానుకగా థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు. అందులో ఇప్పుడు శివకార్తికేయన్ తన చిత్రం పరాశక్తి రిలీజ్ డేట్ ను ముందుకు తెచ్చినట్లు సమాచారం. త్వరలో అఫీషియల్ గా అనౌన్స్ కూడా చేయనున్నారట.
శివ కార్తికేయన్ హీరోగా, సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన పరాశక్తి సినిమా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని జనవరి 10న విడుదల చేయాలని మేకర్స్ తాజాగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసి సాంగ్స్ ను అన్నింటినీ రిలీజ్ చేశారు.
ఇప్పుడు రిలీజ్ డేట్ మార్పు సరైన వ్యూహమేనని భావిస్తోంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. జనవరి 10న జన నాయగన్ కూడా విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయినప్పటికీ పరాశక్తి మేకర్స్.. ఆ క్లాష్ ను పెద్దగా పట్టించుకోవడం లేదని, తమ సినిమానూ అప్పుడే తేవాలని పిక్స్ అయ్యారట.
సంక్రాంతి అంటే జనవరి 13 లేదా 14కి రిలీజ్ చేస్తామంటే.. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు దొరకడం దాదాపు అసాధ్యంగా మారుతుంది. ఈసారి సంక్రాంతికి తెలుగు బాక్సాఫీస్ ఓవర్ లోడెడ్ గా ఉంది. చిరంజీవి, ప్రభాస్, రవితేజ వంటి స్టార్ హీరోల సినిమాలతో పాటు శర్వానంద్, నవీన్ పోలిశెట్టి తదితర హీరోల చిత్రాలు కూడా అదే సమయంలో విడుదలకు సిద్ధమవుతున్నాయి.
ఇప్పటికే ఆయా చిత్రాల డిస్ట్రిబ్యూషన్ డీల్స్ లాక్ అయ్యాయి. ప్రధాన థియేటర్లు, మల్టీప్లెక్సులు అన్నీ తెలుగు సినిమాలకే కేటాయించే పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో తమిళ సినిమాలకు తెలుగులో సరైన స్క్రీన్లు దొరకడం కష్టమవుతోంది. ఒకప్పుడు పెద్ద తమిళ హీరోల సినిమాల కోసం తెలుగు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఆసక్తి చూపేవారు.
కానీ ప్రస్తుతం పరిస్థితి మారిందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పరాశక్తి చిత్రాన్ని ముందుగా విడుదల చేయడం ద్వారా తెలుగు మార్కెట్ లో కనీస స్థాయిలో అయినా స్క్రీన్లు దక్కించుకోవచ్చనే ఆలోచనతో మేకర్స్ ప్రీ పోన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతికి ముందు విడుదలైతే, పండగ రష్ కు ముందు కొంత లాభం పొందవచ్చన్న అంచనాతో జనవరి 10 తేదీని ఫిక్స్ చేసినట్లు సమాచారం.
