శివ కార్తికేయన్ కి షాక్.. పరాశక్తి బ్యాన్ చేయాలంటూ డిమాండ్!
ఈమధ్యకాలంలో కొన్ని సినిమాలలో రాజకీయ నాయకుల ప్రస్తావన అప్పుడప్పుడు వివాదాలకు దారితీస్తోంది.
By: Madhu Reddy | 13 Jan 2026 3:09 PM ISTఈమధ్యకాలంలో కొన్ని సినిమాలలో రాజకీయ నాయకుల ప్రస్తావన అప్పుడప్పుడు వివాదాలకు దారితీస్తోంది. అంతేకాదు ఆ సినిమాలను బ్యాన్ చేయాలి అంటూ సోషల్ మీడియాలో డిమాండ్లు కూడా వెల్లువెత్తుతుంటాయి.. ఈ క్రమంలోనే ఈ సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఒక హీరో సినిమాను ఇప్పుడు బ్యాన్ చేయాలి అంటూ సోషల్ మీడియాలో డిమాండ్లు రావడం సంచలనంగా మారింది. అసలు విషయంలోకి వెళ్తే.. శివ కార్తికేయన్ హీరోగా.. సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన చిత్రం పరాశక్తి. శ్రీలీల ఇందులో హీరోయిన్ గా నటించింది.
కోలీవుడ్ లో పొంగల్ బరిలో నిలిచిన ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ రోజు నుంచే వివాదాలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. టైటిల్ తర్వాత టీజర్, ట్రైలర్ ఇప్పుడు సినిమా.. నిజానికి ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమాతో సక్సెస్ కొట్టాలని చూసిన శివ కార్తికేయన్ కి ఈ సినిమా ఇప్పుడు భారీ నిరాశను మిగిల్చింది అనే వార్తలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ సినిమా 1960లలో విద్యార్థి ఉద్యమం, హిందీ వ్యతిరేక నిరసనల నేపథ్యంలోనే ఈ పరాశక్తి సినిమా తెరకెక్కింది. జనవరి 10న థియేటర్లలోకి వచ్చింది. పైగా సెన్సార్ బోర్డు కూడా ఈ సినిమాకు 23 కట్స్ విధించింది. అయితే అలాంటి మార్పులు చేర్పులు చేసిన తర్వాత కూడా ఇంకా కాంగ్రెస్ ను వక్రీకరిస్తూ తీసిన సన్నివేశాలు చాలా ఉన్నాయి అని, వెంటనే వాటిని డిలీట్ చేయాలని తమిళనాడు యూత్ కాంగ్రెస్ డిమాండ్ చేశారు.
ఈ మేరకు తమిళనాడు యూత్ కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షుడు అరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. "పరాశక్తి సినిమాలో కాంగ్రెస్ నేతలను వక్రీకరించి చూపించారు. పోస్ట్ ఆఫీస్ ఫామ్స్ లో కేవలం హిందీని మాత్రమే అనుమతించారని తప్పుగా చూపించారు. కాంగ్రెస్ ను అప్రతిష్టపాలు చేయడానికి ఇలా చేశారు. 1965లో అన్ని రాష్ట్రాలలో పోస్ట్ ఆఫీస్ ఫారాలను కేవలం హిందీలోనే నింపాలని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా ఏ రోజు కూడా ప్రకటించలేదు. కాబట్టి ఉద్దేశపూర్వకంగానే సృష్టించిన పూర్తి కల్పిత కథ ఇది. తమిళ ప్రజలపై హిందీని రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ.. హీరో శివ కార్తికేయన్ మాజీ ప్రధాని ఇందిరాగాంధీని కలిసినట్లు ఇందులో చూపిస్తున్నారు.
సినిమాలో చెప్పినట్లు ఇందిరాగాంధీ 1965 ఫిబ్రవరి 12 కోయంబత్తూరు సందర్శనకు రాలేదు. ఇలా వక్రీకరిస్తూ చేసిన ఈ చిత్రాన్ని వెంటనే బ్యాన్ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యంగా తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం ఆధారంగా వచ్చిన ఈ సినిమాలో తమ పార్టీని నేతలను కించపరిచే సన్నివేశాలు చాలా ఉన్నాయి.. ముఖ్యంగా ఇందిరాగాంధీ సమక్షంలో రైలుకి నిప్పు పెట్టిన సన్నివేశం, క్లైమాక్స్లో లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, కే కామరాజు రియల్ ఫోటోలను చూపిస్తూ కొల్లాచీలో 200 మందికి పైగా తమిళనాడులో కాల్చి చంపినట్లు కాంగ్రెస్ ను తప్పుగా నిందిస్తున్నారు. ఇలాంటి సన్నివేశాలను వెంటనే తొలగించాలి. అలాగే క్షమాపణలు కూడా చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి దీనిపై చిత్ర బృందం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
