పారామౌంట్ - వార్నర్ బ్రదర్స్ మెగా డీల్!
దాంతో హాలీవుడ్ చరిత్రలోనే అత్యంత భారీ మీడియా విలీన ప్రక్రియ తుది దశకు చేరుకుంది.
By: Srikanth Kontham | 22 Sept 2026 7:00 PM ISTపారామౌంట్ స్మార్ట్/స్కైడాన్స్, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీల $110 బిలియన్ల (సుమారు $108.4 బిలియన్ల) చారిత్రాత్మక విలీనానికి ఉన్న ప్రధాన ప్రతిబంధకాలు తొలగిపోయాయి. ఈ విలీనాన్ని అడ్డుకోవాలని భావించిన కాలిఫోర్నియా సహా పలు అమెరికా రాష్ట్రాలు దాఖలు చేసిన న్యాయపరమైన దావాలను ఉపసంహరించుకోవడానికి పరస్పర ఒప్పందం (సెటిల్‌మెంట్) కుదిరింది. దాంతో హాలీవుడ్ చరిత్రలోనే అత్యంత భారీ మీడియా విలీన ప్రక్రియ తుది దశకు చేరుకుంది.
ఈ ఒప్పందాన్ని నిరోధించేందుకు కాలిఫోర్నియా అటార్నీ జనరల్ నేతృత్వంలో 12 రాష్ట్రాల అటార్నీ జనరల్స్, రైటర్స్ గిల్డ్ యూనియన్ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. అయితే ఇటీవలి చర్చల ఫలితంగా కాలిఫోర్నియాతో పాటు మాసాచుసెట్స్, న్యూయార్క్, కనెక్టికట్, మిన్నెసోటా వంటి కీలక రాష్ట్రాల న్యాయవాదులు సుదీర్ఘంగా చర్చించి ఒప్పందానికి వచ్చారు. కాలిఫోర్నియా పక్కకు తప్పుకున్న నేపథ్యంలో ఒంటరిగా న్యాయపోరాటం కొనసాగించడం భారీ ఖర్చుతో కూడుకున్న విషయమని భావించిన మిగిలిన రాష్ట్రాలు కూడా సెటిల్‌మెంట్‌కు సమ్మతించాయి.
ఈ సెటిల్‌మెంట్ ఒప్పందంలో భాగంగా పారామౌంట్ సంస్థ కొన్ని కఠిన నిబంధనలకు అంగీకరించింది. ప్రతీ ఏటా థియేటర్లలో కనీసం 30 చిత్రాలను విడుదల చేయాలని స్పష్టం చేశారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైతే, తగ్గినా ప్రతీ సినిమాకు $30 మిలియన్ల భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా నిబంధనలు పాటించకపోతే పల్ప్ ఫిక్షన్ వంటి ప్రాచుర్యం పొందిన చిత్రాలను నిర్మించిన మిరామాక్స్ స్టూడియోలో ఉన్న తన వాటాను కూడా విక్రయించాల్సి వస్తుంది.
ఈ న్యాయపరమైన చర్చల ఫలితంగా వార్తా రంగంలో స్వతంత్రతను కాపాడేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. విలీనం పూర్తయిన తర్వాత కూడా సిబిఎస్ , సిఎన్ఎన్ వంటి ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థలకు స్వతంత్ర ఎడిటోరియల్ బోర్డులను ఏర్పాటు చేసేందుకు పారామౌంట్ సమ్మతించింది. దీనివల్ల వార్తా ప్రసారాలలో పక్షపాతం లేని స్వయంప్రతిపత్తి కొనసాగుతుందని రాష్ట్రాలు స్పష్టం చేశాయి.
ఈ సెటిల్‌మెంట్ ఒప్పందం పూర్తిస్థాయిలో అమలులోకి వస్తే పారామౌంట్‌కు భారీ ఆర్థిక ఊరట లభించనుంది. విలీన ప్రక్రియ ఆలస్యమైనందుకు అక్టోబర్ 1వ తేదీ నుండి రోజుకు $7 మిలియన్ల చొప్పున వార్నర్ బ్రదర్స్‌కు చెల్లించాల్సిన లేట్ ఫీజు (అపరాధ రుసుము) నుండి పారామౌంట్‌కు మినహాయింపు లభిస్తుంది. వచ్చే ఏడాది మార్చిలో జరగాల్సిన కోర్టు విచారణల కంటే ముందే వివాదం సమసిపోవడం కంపెనీకి కలిసొచ్చిన అంశం.
గత ఫిబ్రవరిలో దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ను దాటి పారామౌంట్ ఈ కొనుగోలు ఆఫర్‌ను సొంతం చేసుకుంది. ఈ విలీనం ద్వారా హాలీవుడ్‌లోని రెండు అతిపెద్ద చలనచిత్ర స్టూడియోలు, రెండు ప్రధాన ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు , భారీ కేబుల్ టీవీ నెట్‌వర్క్‌లు ఒకే గొడుగు కిందకు రానున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 70 కి పైగా ప్రాంతాల నియంత్రణ సంస్థలు ఇప్పటికే విలీనానికి ఆమోదం తెలిపాయి.
