మీడియా- వినోదరంగంలో 11లక్షల కోట్ల సంపదల మెర్జింగ్ డీల్ సంచలనం
ఈ భారీ విలీనం వల్ల స్థానిక వినోద రంగానికి , మీడియా ఉనికికి ఎటువంటి భంగం వాటిల్లకుండా ఉండేందుకు పారామౌంట్ సంస్థ పలు చట్టబద్ధమైన హామీలను బ్రిటన్ ప్రభుత్వానికి సమర్పించింది.
By: Sivaji Kontham | 8 Aug 2026 9:23 AM ISTపారామౌంట్ స్కైడాన్స్ -వార్నర్ బ్రదర్స్ మధ్య చోటుచేసుకున్న 10,56,630 కోట్ల (111 బిలియన్ డాలర్ల) భారీ విలీన ఒప్పందానికి బ్రిటన్ ప్రభుత్వం తుది ఆమోదం తెలిపింది. పోటీ - ప్రజా ప్రయోజనాల కోణంలో బ్రిటన్ కాంపిటీషన్ అండ్ మార్కెట్స్ అథారిటీ (సీఎంఏ) ఈ ఒప్పందాన్ని సుదీర్ఘంగా సమీక్షించింది. మీడియా రష్యా లేదా ఏకస్వామ్యం ఏర్పడే అవకాశం లేదని నిర్ధారించుకున్న అనంతరమే యుకే సాంస్కృతిక శాఖ ఈ మెగా డీల్‌కు సంబంధించి ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయడం లేదని అధికారికంగా స్పష్టం చేసింది.
ఈ భారీ విలీనం వల్ల స్థానిక వినోద రంగానికి , మీడియా ఉనికికి ఎటువంటి భంగం వాటిల్లకుండా ఉండేందుకు పారామౌంట్ సంస్థ పలు చట్టబద్ధమైన హామీలను బ్రిటన్ ప్రభుత్వానికి సమర్పించింది. ముఖ్యంగా లీనియర్ ఛానళ్లు మన రోజువారీ జీవితంలో టీవీల్లో చూసే సాంప్రదాయ లేదా సాధారణ టీవీ ఛానళ్లను ఆన్-డిమాండ్ స్ట్రీమింగ్ సర్వీసులతో కలపకుండా స్వతంత్ర సంపాదకీయ హోదాను కలిగి ఉండేలా కొత్త నియమాలు, నిబంధనలు రూపొందించారు. దీనితో పాటు యుకేలో అందుబాటులో ఉండే వివిధ బ్రాడ్‌కాస్టింగ్ సేవలు వినియోగదారులకు యథాతథంగా లభిస్తాయని పారామౌంట్ స్పష్టం చేసింది.
చిన్నారుల వినోద సేవలు, వార్తా కథనాల విషయాల్లో పారామౌంట్ ప్రత్యేకమైన హామీలు ఇచ్చింది. నికెలోడియన్, కార్టూన్ నెట్‌వర్క్ వంటి ప్రసిద్ధ కిడ్స్ ఛానళ్లు తమ ప్రత్యేక స్వభావాన్ని కాపాడుకోవడమే కాకుండా.. బ్రిటన్‌కు చెందిన స్థానిక చిన్నారుల కంటెంట్‌ను తయారుచేయడానికి నిధులను కేటాయిస్తాయని వెల్లడించారు. అలాగే ఛానల్ 5 న్యూస్ సంపాదకీయ స్వేచ్ఛను కొనసాగిస్తూ.. సిబిఎస్ న్యూస్ , సిఎన్‌ఎన్ (CNN) ఇంటర్నేషనల్ నుండి దీని మార్గదర్శకాలను పూర్తిగా వేరుగా ఉంచనున్నట్లు ప్రకటించారు.
ఈ ఒప్పందం ద్వారా యుకేలోని పబ్లిక్ సర్వీస్ బ్రాడ్‌కాస్టర్ హోదాను ఛానల్ 5 నిలబెట్టుకోనుంది. అంతేకాదు పారామౌంట్ పెట్టుబడులు పెట్టే విధానాన్ని సమీక్షిస్తూ పిల్లల కార్యక్రమాలు సహా ఒరిజినల్ డ్రామాలకు పట్టంగడతామని... క్వాలిటీ న్యూస్ అందించేందుకు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడతామని కూడా హామీలు ఇచ్చింది. వార్తా సంస్థల ఆర్కైవ్‌లను ఇతర లైసెన్స్‌దారులకు యథావిధిగా అందుబాటులో ఉంచడం ద్వారా వార్తా సమాచార ప్రాప్యతను కూడా సురక్షితం చేశారు. ఈ నిర్ణయం బ్రిటన్ మీడియా రంగానికి పెద్ద ఎత్తున ఆర్థిక లబ్ధిని చేకూరుస్తుందని భావిస్తున్నారు.
బ్రిటన్ నియంత్రణ సంస్థల ఆమోదాన్ని పారామౌంట్ సంస్థ తమ అమెరికా చట్టపరమైన పోరాటానికి అనుకూలంగా మలుచుకుంది. అమెరికాలోని కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బోంటా .. 11 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ కూటమి మార్చి 2027లో ఈ విలీనంపై దాఖలు చేసిన యాంటీట్రస్ట్ పిటిషన్‌లోని మార్కెట్ నిర్వచనాలు తప్పుదారి పట్టించేలా ఉన్నాయని... యుకే ప్రభుత్వ నిర్ణయం తమ వాదనకు బలమిస్తోందని పారామౌంట్ వ్యాఖ్యానించింది.
