దక్షిణాది అమ్మాయిగా ఉత్తరాది బ్యూటీ దేనికి?
చెన్నై ఎక్స్‌ప్రెస్, టూ స్టేట్స్ లాంటి క్రాస్ కల్చర్ చిత్రాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాల మధ్య సాంస్కృతికంగా చాలా వ్యత్సాసం ఉంటుంది.
By: Sivaji Kontham | 14 Aug 2025 6:00 PM ISTచెన్నై ఎక్స్‌ప్రెస్, టూ స్టేట్స్ లాంటి క్రాస్ కల్చర్ చిత్రాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాల మధ్య సాంస్కృతికంగా చాలా వ్యత్సాసం ఉంటుంది. ఒక ప్రాంతం, ఒక భాష, యాస, వేషం ఇలా ఏ రకంగా చూసినా ప్రతిదీ చాలా వైవిధ్యంగా కనిపిస్తాయి.
దక్షిణాదిన లుంగీ పంచెలు, హాఫ్ శారీస్ ఫేమస్. కానీ ఉత్తరాదిన లెహంగాలు, దోతీలు ఫేమస్. ఇంకా వేషధారణలు కల్చర్ పరంగా చాలా తేడాలు ఉంటాయి. అందుకే ఇప్పుడు పరమ్ సుందరి ట్రైలర్ వీక్షించగానే నెటిజనులు దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జాన్వీ కపూర్ ఒక ఉత్తరాది అమ్మాయి అయి ఉండి, కేరళ యువతిగా నటించింది. సిద్ధార్థ్ దిల్లీ యువకుడిగా కనిపిస్తున్నాడు. ఆ ఇద్దరి మధ్యా ప్రేమాయణంలో గమ్మత్తయిన సంగతుల్ని తెరపై ఆవిష్కరిస్తున్నారు దర్శకనిర్మాతలు. దినేష్ విజన్ మడాక్ ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మించడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
కేరళ అమ్మాయి, దిల్లీ అబ్బాయి నిజమైన ప్రేమకథను రసరమ్యంగా తెరకెక్కించారని భావిస్తున్నా, ఇందులో పాత్రల చిత్రణపై నెటిజనులు విమర్శలు గుప్పించారు. కేరళ యువతిగా ఒక దక్షిణాది అమ్మాయికి అవకాశం కల్పించకుండా ఉత్తరాది బ్యూటీని ఎంపిక చేయడానికి కారణమేమిటో చెప్పాలని కొందరు అంటున్నారు. అలాగే సిద్ధార్థ్ మల్హోత్రా- జాన్వీ కపూర్ మధ్య వయసు వ్యత్యాసాన్ని ఎత్తి చూపుతున్నారు. అతడి నటనపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జాన్వీని దక్షిణాది అమ్మాయిగా లౌడర్ (అరుపులు) పాత్రలో చూపించారని విమర్శలొస్తున్నాయి. కొన్ని పాత కాలం వాసనలతో ట్రైలర్ ని తీర్చిదిద్దారని విమర్శిస్తున్నారు. లుంగీలు ధరించే దక్షిణాది కుర్రాళ్లను తెరపై చూపించడంలో ఉత్తరాది వ్యక్తుల అంతరార్థం ఏమిటో తెలియాలని విమర్శిస్తున్నారు. మొత్తానికి పరమ్ సుందరి ట్రైలర్ చాలా విమర్శలను కూడా ఎదుర్కొంటోంది. అన్నిటినీ అధిగమించి మడోక్ ఫిలింస్ మరో బంపర్ హిట్ కొడుతుందా? లేక రొటీన్ కంటెంట్ కారణంగా తిరస్కారానికి గురవుతుందా? అసలు ఏం జరగబోతోందో వేచి చూడాలి. క్రాస్ కల్చర్ జానర్ లో మునుపటి సినిమాలను గుర్తు చేయకపోతే ఈ సినిమా విజయం సాధించినట్టేనని కూడా విశ్లేషిస్తున్నారు.
