విమర్శించిన వారికి 'పరమ్ సుందరి' ఝలక్
`పరమ్ సుందరి` కేరళ సంస్కృతిని తెరపై ఆవిష్కరించనుంది. తుషార్ జలోటా దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 29న విడుదల కానుంది.
By: Sivaji Kontham | 24 Aug 2025 11:08 PM ISTదిల్లీకి చెందిన అబ్బాయి, కేరళకు చెందిన అమ్మాయి మధ్య ప్రేమ కథతో రూపొందించిన చిత్రం -పరమ్ సుందరి. క్రాస్ కల్చర్ నేపథ్యంలో ప్రయోగాత్మకంగా రూపొందించిన ఈ చిత్రంలో దిల్లీ అబ్బాయిగా సిద్ధార్థ్ మల్హోత్రా నటించగా, కేరళ అమ్మాయిగా జాన్వీ కపూర్ నటించింది. అయితే ఒక ఉత్తరాది అమ్మాయి మలయాళీ యువతిగా నటించడం కొందరికి రుచించలేదు. ట్రైలర్ విడుదలైన తర్వాత జాన్వీ ఎంపికను కొందరు తప్పు పట్టారు. కేరళ యువతిగా జాన్వీ భాష, యాస, వేషం ప్రతిదీ విమర్శలకు తావిచ్చాయి.
మలయాళ నటి-గాయని పవిత్ర మీనన్.. కంటెంట్ సృష్టికర్త స్టెఫీ ఈ సినిమాలో మలయాళ యువతి పాత్రకు జాన్వీని ఎంపిక చేయడాన్ని తప్పు పట్టారు. అయితే తాను ఈ పాత్రను ఎంపిక చేసుకోవడానికి కారణమేమిటో జాన్వీకపూర్ తనదైన శైలిలో వివరించారు. ``నేను మలయాళీని కాదు.. నా తల్లి కూడా మలయాళీ కాదు.. నా పాత్ర సగం తమిళమ్మాయి..సగం మలయాళీ. ఆ భూభాగం, ఆ సంస్కృతి అంటే నాకు ఎప్పుడూ చాలా ఆసక్తి ఉంది. నేను మలయాళ సినిమాకు పెద్ద అభిమానిని. కాబట్టి ఇది చాలా సరదాగా సాగే, ఆసక్తికరమైన కథ అని నేను అనుకుంటున్నాను. దానిలో భాగమైనందుకు చాలా సంతోషంగా, కృతజ్ఞతతో ఉన్నాను``అని తెలిపారు.
`పరమ్ సుందరి` కేరళ సంస్కృతిని తెరపై ఆవిష్కరించనుంది. తుషార్ జలోటా దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 29న విడుదల కానుంది. ఈ సినిమాలో కేరళ సుందరిగా నటించిన జాన్వీ కపూర్.. మోహన్ లాల్, రజనీకాంత్, అల్లు అర్జున్, యష్ లాంటి స్టార్ల రిఫరెన్సులతో డైలాగ్ చెప్పడం ఆసక్తిని కలిగించింది. మలయాళీ యువతిగా ట్రాన్స్ ఫర్మేషన్ కోసం జాన్వీ తీవ్రంగానే శ్రమించింది. సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వితో పాటు ఈ చిత్రంలో రాజీవ్ ఖండేల్వాల్, ఆకాష్ దహియా కూడా కీలక పాత్రలు పోషించారు. తనపై వస్తున్న అన్ని విమర్శలకు తెరపై తన అద్భుత నటనతో జాన్వీ కపూర్ సరైన సమాధానం ఇవ్వాల్సి ఉంది.
