`పరమ్ సుందరి` ఈమె అయితే బావుండు!
జాన్వీ కపూర్ - సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా నటించిన `పరమ్ సుందరి` ఇటీవలే థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 3 Sept 2025 9:26 AM ISTజాన్వీ కపూర్ - సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా నటించిన `పరమ్ సుందరి` ఇటీవలే థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. కేరళ అమ్మాయి `పరమ్ సుందరి`తో ప్రేమలో పడే దిల్లీ అబ్బాయి(సిధ్) కథతో ఈ సినిమా రూపొందింది. క్రాస్ కల్చర్ నేపథ్యంలోని ఈ సినిమాలో ఒక ఉత్తరాది నటి మలయాళీ అమ్మాయిగా నటించడం చాలా మందికి నచ్చలేదు. జాన్వీ కపూర్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా ఇప్పటికీ జాన్వీపై నెటిజనులు రకరకాల కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. ట్రైలర్ రిలీజ్ తర్వాత కేరళ అమ్మాయిగా జాన్వీ కాకుండా ఒక దక్షిణాది హీరోయిన్ కి అవకాశం ఇవ్వాల్సింది! అంటూ చాలా మంది సూచించారు. కానీ జాన్వీ కపూర్ తనను తాను సమర్థించుకుంది. ఈ చిత్రంలో తాను సగం తమిళియన్, సగం మలయాళీగా కనిపిస్తానని తెలిపింది.
తాజాగా ఈ సినిమా నుంచి లీకైన ఓ క్లిప్‌లో మలయాళీ యువకథానాయిక, వింక్ గాళ్ ప్రియా ప్రకాష్ వారియర్ ప్రత్యక్షమైంది. ఒక సన్నివేశంలో రద్దీగా ఉన్న జనంలో సిద్ధార్థ్ మల్హోత్రా పక్కనే నడుచుకుంటూ వెళుతూ కనిపించింది ప్రియా ప్రకాష్. అంతగా ప్రాధాన్యతలేని అతిథి పాత్రలో కనిపించింది. కానీ దర్శకుడు తనను అలా చూపించడం నెటిజనులకు నచ్చలేదు. ఒకే ఒక్క వింక్ తో ఓవర్ నైట్ పాపులరైన ఈ బ్యూటీ `పరమ్ సుందరి`గా నటించి ఉంటే సినిమాకి పెద్ద ప్లస్ అయ్యేదని నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. జాన్వీ కపూర్ స్థానంలో ప్రియా ప్రకాష్ ని దర్శకనిర్మాతలు ఎంపిక చేసి ఉండాల్సిందని కూడా వ్యాఖ్యానిస్తున్నారు.
సరిపడేంత ప్రతిభ ఉన్నా ప్రియా ప్రకాష్ ని ప్రోత్సహించలేదని పరమ్ సుందరి మేకర్స్ ని కొందరు విమర్శించారు. అంతేకాదు.. ప్రియా ప్రకాష్ ఈ సినిమాలో నటించింది. తన పాత్ర హైలైట్ కాకుండా, సరిపడేంత నిడివి లేకుండా కట్ చేసారంటూ కొందరు కామెంట్ చేసారు. ప్రస్తుతం ఒరు ఆధార్ లవ్ నేపథ్య సంగీతంతో ఆకట్టుకుంటున్న ప్రియా ప్రకాష్ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది. ప్రియా ప్రకాష్ ప్రస్తుతం మలయాళం, తమిళం, హిందీ, తెలుగు చిత్రాలలో నటిస్తోంది. ఇటీవలే అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీలో ప్రత్యేక గీతంలో నర్తించింది. తదుపరి 3 మంకీస్, లవ్ హ్యాకర్స్ అనే రెండు హిందీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
