పాన్ ఇండియా ట్రెండ్ ఎంత పని చేసింది!
ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు సినిమా కథల తీరు తెన్నులు మారిపోయాయి. పాన్ ఇండియా ట్రెండ్ వేగం పుంజుకుంది.
By: Sivaji Kontham | 14 Sept 2025 7:00 AM ISTఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు సినిమా కథల తీరు తెన్నులు మారిపోయాయి. పాన్ ఇండియా ట్రెండ్ వేగం పుంజుకుంది. ఏదో ఒక భాషలో ఆడితే సరిపోదు, అన్ని భాషల్లోను సినిమా విడుదలై సక్సెస్ సాధించాలి. అప్పుడే పాన్ ఇండియా రీచ్ ఉన్నట్టు. ఈ సమయంలో క్రాస్ ఓవర్ కల్చర్ పై కథలు పెరుగడానికి ఇది కారణమవుతోంది.
ఒక ఉత్తరాది అమ్మాయి, దక్షిణాది అబ్బాయి ప్రేమ కథ లేదా ముంబై అండర్ వరల్డ్ తో ముడిపడిన దక్షిణాది యువకుడి కథ లేదా అంతర్జాతీయంగా పరిచయం ఉన్న క్రీడాకారుడి కథ, వీటన్నిటికీ మించి పాన్ వరల్డ్ కి కనక్టయ్యే ప్రశాంత్ నీల్ బ్రాండెడ్ కథలు, మాఫియా కథలు, స్పై యూనివర్శ్ కథల అవసరం పడుతోంది.
రాజమౌళి లాంటి దర్శకుడు ఇటీవల కేవలం పాన్ ఇండియా లేదా పాన్ వరల్డ్ లక్ష్యంగా మాత్రమే కథలు వండుతున్నారు. అతడితో జట్టు కట్టే చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి స్టార్లు పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం మహేష్ కూడా రాజమౌళితో కలిసి ఇదే దారిలో ఉన్నాడు. తదుపరి రాజమౌళి తో అల్లు అర్జున్ కి ఛాన్సుంటుందేమో! ప్రశాంత్ నీల్, సుకుమార్ కూడా పాన్ ఇండియా రేసులో ఆటాడుతున్నారు. వీళ్ల కోసం పాన్ ఇండియా స్టార్ల అవసరం పెరిగింది.
అయితే పాన్ ఇండియా ప్రయత్నాలు చేస్తున్న యువహీరోలు, యువదర్శకులకు టాలీవుడ్ లో కొదవేమీ లేదు. నిఖిల్, అడివి శేష్, తేజ సజ్జా లాంటి నేటితరం స్టార్లు కూడా పాన్ ఇండియాలో నిరూపించుకుంటున్నారు. ఇప్పుడు నేచురల్ స్టార్ నాని, విజయ్ దేవరకొండ కూడా పాన్ ఇండియా మార్కెట్లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు. పై ఐదుగురితో సినిమాలు తీసే దర్శకులు కూడా పాన్ ఇండియా రీచ్ కోసం ఒత్తిడిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. టాలీవుడ్ నుంచి అరడజను పైగా హీరోలు పాన్ ఇండియా మార్కెట్ లో ఇమేజ్ పెంచుకోవడంతో దర్శకనిర్మాతలు ఆ దిశగా మాత్రమే ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది.
ఇప్పుడు పాత రోజుల్లో వచ్చిన మాస్ కమర్షియల్ కథలకు కాలం చెల్లింది. అవే కథల్ని రిపీట్ చేస్తే ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. థియేటర్లకు కదల్చడం చాలా కష్టంగా మారింది. బిగోపాల్, వినాయక్, వైట్ల శకం ముగిసింది. మారిన ట్రెండ్ కి అనుగుణంగా ఆలోచించే ప్రశాంత్ వర్మ, చందు మొండేటి, కార్తీక్ ఘట్టమనేని లాంటి దర్శకుల కాలం మొదలైంది. రాజమౌళి, ప్రశాంత్ నీల్, సుకుమార్ రేంజు కాకపోయినా, వీళ్లకు సరైన బడ్జెట్లు అందించి పాన్ ఇండియా వంటకాలు చేయమంటే సత్తా చాటగలరు. అయితే అనీల్ రావిపూడి, బోయపాటి లాంటి దర్శకుల నుంచి మాస్ యాక్షన్ సినిమాలు, కామెడీలు కూడా స్థానిక భాషలో వర్కవుటవుతున్నాయి. కానీ చాలా మంది యువదర్శకులు పాన్ ఇండియా అప్పీల్ కోసమే పాకులాడటం ట్రెండ్. దీనికి కారణం ఓటీటీల్లో వైవిధ్యమైన కంటెంట్ కి ప్రజలు బ్రహ్మరథం పడుతుండటమే. సౌతిండియాలో మారిన సినిమా కథలు, హీరోల ఆలోచనలు, దర్శకుల మైండ్ సెట్ గురించి విశ్లేషిస్తే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి.
