టాలీవుడ్‌లో రిలీజ్ పోస్ట్‌పోన్ కల్చర్‌పై బిగ్ డిబేట్
టాలీవుడ్‌లో ‘ఫౌజీ’, ‘విశ్వంభర’, ‘సంబరాల ఏటి గట్టు’ వంటి సినిమాల వాయిదాలపై చర్చ జరుగుతోంది. సరైన ప్రీ ప్రొడక్షన్ ప్లానింగ్ లేకపోవడం, పాన్ ఇండియా ఒత్తిడి వల్లే షూటింగ్ ఆలస్యమవుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రకటించిన రిలీజ్ డేట్లకు కట్టుబడకపోవడంతో ప్రేక్షకుల్లో నమ్మకం తగ్గుతోందని, మేకర్స్ సమయపాలన పాటించాలని అభిమానులు కోరుతున్నారు.
By: Sivaji Kontham | 28 Nov 2026 7:00 AM ISTటాలీవుడ్‌లో రిలీజ్ పోస్ట్‌పోన్ కల్చర్‌పై కొంతకాలంగా ఇండస్ట్రీ వర్గాల్లోనూ.. సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. `ఫౌజీ` చిత్రానికి విజువల్స్ క్వాలిటీ, గ్రాఫిక్స్ వంటి కారణాలు చెబుతుండగా.. `విశ్వంభర` పదేపదే వాయిదా పడటం వెనుక ఇతరత్రా కారణాలున్నాయనే ప్రచారం సాగుతోంది. వీటితో పాటు `సంబరాల ఏటి గట్టు` చిత్రం కూడా చెప్పిన తేదీకి రాకుండా ఆలస్యమవ్వడంపైనా చర్చ సాగుతోంది. ఇప్పటికే విడుదలైన `ప్యారడైజ్`, `ఆదర్శ కుటుంబం` చెప్పిన తేదీకి రాకుండా వాయిదాల పద్ధతిలో విడుదలయ్యాయనే విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
ఈ వాయిదాల పర్వానికి పక్కా ప్రీ-ప్రొడక్షన్ ప్లానింగ్ లేకపోవడమే ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. కేవలం ఒక చిన్న ఐడియాతో సెట్స్‌పైకి వెళ్లిపోవడం.. ఆ తర్వాత షూటింగ్ మధ్యలో స్క్రిప్ట్ మార్పులు చేయడం వల్లే అనవసర జాప్యం జరుగుతోందనే వాదన లేకపోలేదు. దీనికి తోడు `పాన్ ఇండియా` ఒత్తిడి కూడా ఈ ఆలస్యాలకు కారణమవుతోందని... మార్కెట్ పరిధిని పెంచుకునే క్రమంలో అదనపు హంగులు, మార్పులతో షెడ్యూల్స్ సాగదీస్తున్నారని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
హాలీవుడ్‌లో క్రిస్టోఫర్ నోలన్ వంటి దిగ్గజ దర్శకులు కూడా భారీ సినిమాలను 100-150 రోజుల్లో పూర్తి చేస్తుంటే... మన దగ్గర మాత్రం ఏళ్ల తరబడి షూటింగ్ చేస్తూ చివరికి విడుదల తేదీకి మూడు రోజుల ముందు వరకు కూడా పనులు పూర్తి చేయకపోవడంపై అభిమానులు మండిపడుతున్నారు. హీరోలు 50 నుంచి 100 కోట్ల వరకు పారితోషికాలు తీసుకుంటుండగా.. దర్శకులు 30- 45 కోట్ల వరకు అందుకుంటున్నా.. తాము ప్రకటించిన డేట్‌కు కట్టుబడి సినిమాను అందించాలనే టైమ్ సెన్స్- బాధ్యత లేకుండా పోయాయని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఒకవైపు సినిమాలు ఆలస్యమవుతూ.. ప్రకటించిన తేదీలకు కట్టుబడి ఉండకపోవడం వల్ల ప్రేక్షకుల్లో నమ్మకం సన్నగిల్లుతోందని విశ్లేషిస్తున్నారు. ముందే పక్కాగా స్క్రిప్ట్ లాక్ చేసి.. ప్రీ-ప్రొడక్షన్ పూర్తి చేసుకుని..చెప్పిన సమయానికి ప్రాజెక్టులను పూర్తి చేసే సంస్కృతి తిరిగి వస్తేనే నిర్మాతలకు ఆర్థిక భారం తగ్గుతుందని.. లేదంటే ప్రతి సినిమాకూ వాయిదాల గోల తప్పదని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఫౌజీ, విశ్వంభర, సంబరాల ఏటి గట్టు వంటి చిత్రాల వాయిదాలు, ఆలస్యాల నేపథ్యంలో టాలీవుడ్ పనితీరుపై మొదలైన ఈ బిగ్ డిబేట్ ఇండస్ట్రీలో సమయపాలన, ప్లానింగ్‌పై మరోసారి కొనసాగింపు చర్చలకు దారి తీస్తోంది. ఇప్పటికైనా మేకర్స్ షెడ్యూల్స్-రిలీజ్ డేట్ల విషయంలో మరింత క్రమశిక్షణతో వ్యవహరించాలని అభిమానులు కోరుతున్నారు.
