Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా సక్సెస్ ఉన్నా? అంతా చ‌ప్ప‌గానే!

`కె.జి.ఎఫ్` వంటి సంచలన చిత్రంతో శ్రీనిధి శెట్టి పాన్ ఇండియాలో గుర్తింపు పొందింది. ఆ సినిమా సాధించిన విజయం అమ్మ‌డికి వచ్చిన క్రేజ్ ఊహించనిది.

By:  Srikanth Kontham   |   11 July 2026 3:04 PM IST
పాన్ ఇండియా సక్సెస్ ఉన్నా? అంతా చ‌ప్ప‌గానే!
X

పాన్ ఇండియా చిత్రాలు నటి కెరీర్‌ను రాత్రికి రాత్రే మలుపు తిప్పగలవు. భారీ బడ్జెట్ సినిమాల్లో నటించడం, వందల కోట్ల వసూళ్లు సాధించడం వల్ల క్రేజ్ దేశవ్యాప్తంగా వ్యాపిస్తుంది. అయితే అదృష్టం తలుపు తట్టినా? ఆ తర్వాత సరైన అవకాశాలను అందిపుచ్చుకోవడంలో కొందరు ప్రతిభావంతులైన హీరోయిన్లు ఇబ్బందులు పడుతున్నారు. భారీ విజ‌యాలు సాధించినా? ఆ స్థాయి స్టార్‌డమ్‌ను నిలబెట్టుకోవడంలో ..ప్రాజెక్టులను ఎంపిక చేసుకోవడంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లు ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి.

`కె.జి.ఎఫ్` వంటి సంచలన చిత్రంతో శ్రీనిధి శెట్టి పాన్ ఇండియాలో గుర్తింపు పొందింది. ఆ సినిమా సాధించిన విజయం అమ్మ‌డికి వచ్చిన క్రేజ్ ఊహించనిది. ఆ తర్వాత స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతుందని అంతా భావించారు. కానీ ఎంచుకున్న చిత్రాలు ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయాయి. కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేయడం ..సరైన బ్యానర్ల నుండి ఆఫర్లు రాకపోవడం వంటి కారణాల వల్ల శ్రీనిధి కెరీర్ ఊపందుకోలేదు. భారీ సక్సెస్ ఉన్నా? దాన్ని నిలబెట్టుకోవడం ఎంత కష్టమో శ్రీనిధి కెరీర్ ఉదాహరణగా చెప్పొచ్చు. అయితే కొంత కాలం నీరిక్ష‌ణ అనంత‌రం అమ్మ‌డు మ‌ళ్లీ ఇప్పుడిప్పుడే కొత్త అవ‌కాశాల‌తో బిజీ అవుతోంది.

`సప్త సాగరాలు దాటి`, `కాంతార2`వంటి చిత్రాల‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రుక్మిణి వసంత్ నటనతో ఆకట్టుకుంది. ఆ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మెప్పించడంతో మంచి క్రేజ్ లభించింది. సహజమైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నా? ఆ తర్వాత రావాల్సిన స్థాయిలో అగ్రశ్రేణి అవకాశాలు రాలేదు. ముఖ్యంగా కమర్షియల్ సినిమాల్లో తనకంటూ ఓ స్థానాన్ని సుస్థిరం చేసుకునే ప్రయత్నంలో అమ్మ‌డికి సరైన ప్రాజెక్టుల కొరత వేధిస్తున్నట్లు క‌నిపించింది. ఆ ఫేజ్ ను దాట‌డానికి చాలా స‌మ‌యం ప‌ట్టింది. ప్ర‌స్తుతం తార‌క్ స‌ర‌స‌న డ్రాగ‌న్ లో న‌టిస్తోంది. డైరెక్ట‌ర్ క‌న్న‌డిగి కావ‌డంతో? అమ్మ‌డికి లిప్ట్ ఇచ్చే ఓ ప్ర‌య‌త్నం చేస్తున్నాడు.

బాలీవుడ్ న‌టి సారా అర్జున్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు పొందింది. `పొన్నియిన్ సెల్వన్` వంటి భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులో నటించి అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రతిభ ఉన్నా? కథానాయికగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకోవడంలో వెనుక‌బ‌డింది. కథల ఎంపికలో విభిన్నంగా ఉన్నా? కమర్షియల్ పరంగా తనను తాను నిరూపించుకోవడానికి సారా మరింత సమయం తీసుకుంది. అయితే `ధురంధ‌ర్` విజ‌యంతో మంచి పేరొచ్చింది. కానీ ఇప్ప‌టికీ కొత్త అవ‌కాశాలు అందుకోవ‌డంలో మాత్రం వెనుక‌బ‌డే ఉంది. ఇలాంటి విజ‌యం త‌ర్వాత బ్యాక్ టూ బ్యాక్ ప్రాజెక్ట్ లు ప్ర‌క‌టించాలి. కానీ సారా నుంచి ఆ ఊపు ఎక్క‌డా క‌నిపించ‌లేదు.

ఈ భామ‌లంతా ఎదుర్కొంటున్న పరిస్థితికి కారణం పాన్ ఇండియా సినిమాల తర్వాత ఏర్ప‌డే భారీ అంచనాలు. ఒక్క భారీ హిట్ తర్వాత ప్రేక్షకులతో పాటు నిర్మాతల్లో మళ్ళీ అదే స్థాయి విజయాన్ని ఆశిస్తారు. ఈ ఒత్తిడిలో కొందరు తప్పుడు కథలను ఎంచుకోవడం .. అగ్ర హీరోల సరసన నటించే అవకాశాలు తక్కువగా రావడం వల్ల వెనుకబడుతున్నారు. గ్లామర్ ..నటన రెండింటినీ సమతుల్యం చేసుకునే క్రమంలో సరైన బ్రేక్ కోసం వేచి చూడక తప్పడం లేదు. ఆ ర‌కంగా ఈ భామ‌లందరికీ పాన్ ఇండియా విజ‌యం త‌ర్వాత కొత్త అవ‌కాశాల‌కు చాలా స‌మ‌యం ప‌టింది.