స్టార్ హీరో 40కోట్ల పరిహారం చెల్లించాలని నిర్మాత డిమాండ్
ఇటీవల అకస్మాత్తుగా భారతదేశంలో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్న ఒక ప్రముఖ హీరో, ఇంత క్రేజ్ రాక ముందు అంగీకరించిన ఓ భారీ చిత్రం నుంచి చివరి నిమిషంలో తప్పుకుని నిర్మాతలకు ఊహించని షాక్ నిచ్చాడు.
By: Sivaji Kontham | 10 Feb 2026 7:00 AM ISTఇటీవల అకస్మాత్తుగా భారతదేశంలో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్న ఒక ప్రముఖ హీరో, ఇంత క్రేజ్ రాక ముందు అంగీకరించిన ఓ భారీ చిత్రం నుంచి చివరి నిమిషంలో తప్పుకుని నిర్మాతలకు ఊహించని షాక్ నిచ్చాడు. దీంతో సదరు నిర్మాణ సంస్థ తమకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లిందని హీరోపై కోర్టును ఆశ్రయించడానికి సిద్ధమవ్వడం సంచలనంగా మారింది.
ఆ హీరోని నమ్ముకుని ఇప్పటికే ప్రీప్రొడక్షన్ పనుల కోసం చాలా ఖర్చు చేసాం. సెట్లు వేయడం కోసం అసాధారణ బడ్జెట్‌ని వెచ్చించాము. సెట్ల రూపకల్పనతో పాటు, టెక్నీషియన్లు, కాస్టింగ్ కోసం భారీగా అడ్వాన్సులు చెల్లించాము. ఉన్నట్టుండి సడెన్‌గా స్టార్ హీరో ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం వల్ల నిర్మాణ సంస్థకు తీవ్రమైన నష్టం వాటిల్లింది. అందుకే అతడు రూ.40 కోట్ల పరిహారం చెల్లించాలని కోర్టులో నిర్మాత పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. అయితే తమకు తుది స్క్రిప్టు నచ్చనప్పుడు సినిమాలో నటించమని బలవంతం చేసే హక్కు నిర్మాతకు ఉండదని సదరు స్టార్ హీరో వాదిస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ గొడవ చివరకు ఎటు దారి తీస్తుందో ఎవరూ ఇప్పుడే అంచనా వేయలేని స్థితి. అయితే గొడవ ముదరక ముందే దీనిని ఎలాగైనా సద్ధుమణిగేలా చేయాలని ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా (PGI) ప్రయత్నిస్తోందని తెలిసింది. హిందీ చిత్రసీమలో ఇది అతి పెద్ద ఆరని గొడవగా మారేందుకు ఆస్కారం ఉన్నందున నిర్మాతల గిల్డ్ వెంటనే ఇందులో జోక్యం చేసుకుని సఖ్యత కుదిర్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇటు అగ్ర హీరో, అటు అగ్ర నిర్మాణ సంస్థ మధ్య రాజీ లేని గొడవగా మారితే, కోర్టుల పరిధికి చేరుకుంటే ఇది ఇప్పట్లో తేలదు.
ప్రస్తుతానికి ఇరువైపులా ఎవరూ తగ్గడం లేదని తెలిసింది. ఇంకా తేలకపోతే కోర్టుకు వెళ్లేందుకు అవకాశం ఉంది. అయితే ఈ కేసులో ఎవరు నెగ్గేందుకు ఆస్కారం ఉందో ఎవరైనా ఊహించగలరా? స్క్రిప్టు నచ్చకపోవడం వల్లనే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నానని చెబుతున్న ఆ హీరో వెర్షన్ కరెక్టా? లేక అతడిని నమ్ముకుని కోట్లకు కోట్లు ఖర్చు చేసి నష్టపోయామని, అతడు పరిహారం చెల్లించాల్సిందేనని పట్టుబడుతున్న అగ్ర నిర్మాణ సంస్థ చేసినది తప్పు అని భావించాలా? అర్థం కాని పరిస్థితి.
