Begin typing your search above and press return to search.

కంటెంట్ లేని క‌థ‌ల‌తో హీరోల‌కు ముప్పే!

ఒక‌ ప్రాజెక్ట్ కోసం మూడు నాలుగు ఏళ్లు కేటాయించినప్పుడు ఆ సినిమా స్క్రిప్ట్ ఏమాత్రం సందేహంగా ఉన్నా? హీరోల విలువైన సమయం పూర్తిగా వృథా అయినట్లే.

By:  Srikanth Kontham   |   1 Sept 2026 7:00 PM IST
కంటెంట్ లేని క‌థ‌ల‌తో హీరోల‌కు ముప్పే!
X

పాన్ ఇండియా సంస్కృతి పెరిగిన తర్వాత సినిమా రూపకల్పనకు పట్టే సమయం అనూహ్యంగా పెరిగింది. ఒకప్పుడు ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసే అగ్ర కథానాయకులు ఇప్పుడు ఒక్కో ప్రాజెక్ట్ కోసం రెండేళ్ల నుంచి నాలుగేళ్ల సమయాన్ని కేటాయిస్తున్నారు. అయితే ఎంతటి భారీ బడ్జెట్ ఉన్నా? ఎంత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినా? సినిమాకు ప్రాణమైన బలమైన కంటెంట్ లేకపోతే ఆ సుదీర్ఘ ప్రయాణం తీవ్రమైన ప్రమాదంలో పడుతుందనడంలో సందేహం లేదు. హీరో కెరీర్‌లో అత్యంత విలువైనది వారి ప్రైమ్ టైమ్. ఒక‌ ప్రాజెక్ట్ కోసం మూడు నాలుగు ఏళ్లు కేటాయించినప్పుడు ఆ సినిమా స్క్రిప్ట్ ఏమాత్రం సందేహంగా ఉన్నా? హీరోల విలువైన సమయం పూర్తిగా వృథా అయినట్లే.

విజువల్ గ్రాండ్‌నెస్, భారీ యాక్షన్ సీక్వెన్సులు లేదా దర్శకుడి మార్కెట్ క్రేజ్‌ను మాత్రమే నమ్ముకుని కథలో లోపాలను విస్మరిస్తే అది అంతిమంగా నటుడి కెరీర్ గ్రాఫ్‌పై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

ఈ తరహా సుదీర్ఘ నిర్మాణాల వల్ల జరిగే నష్టం సమయానికే పరిమితం కాదు. ఏళ్ల తరబడి ఒకే రకమైన గెటప్, ఒకే పాత్రలో జీవించడం వల్ల హీరోల సృజనాత్మకత దెబ్బతింటుంది. దీంతో ఇతర వైవిధ్యమైన కథలను అంగీకరించే అవకాశాలను కోల్పోతారు. మూడేళ్ల కాలంలో మూడు భిన్నమైన సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించే అవకాశాన్ని వదులుకుని ఒకే సినిమాపై జూదం ఆడటం బాక్సాఫీస్ పరంగా పెద్ద రిస్క్ అనే చెప్పాలి.

అలాగే ఏళ్ల తరబడి వేచి చూసిన అభిమానుల్లో సాధారణ ప్రేక్షకుల్లో ఆ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. ఆ రేంజ్ అంచనాలను అందుకోవాలంటే కథలో బలమైన భావోద్వేగాలు, పక్కా కథనం ఉండటం అనివార్యం. తీరా థియేటర్లోకి వెళ్లాక‌ కంటెంట్ నిరాశపరిచి ఆ విఫల భారం హీరో ఇమేజ్‌ను, తదుపరి సినిమాల మార్కెట్‌ను తీవ్రంగా దెబ్బతీస్తుంది. 'గేమ్ ఛేంజ‌ర్', 'టాక్సిక్' ఫ‌లితాలే అందుకు ఉదాహ‌ర‌ణ‌. దీంతో ప్ర‌స్తుతం పాన్ ఇండ‌దియా సినిమాలు చేస్తోన్న ద‌ర్శ‌కుల‌కు ఈ ర‌క‌మైన టెన్ష‌న్ ప‌ట్టుకుంది. ఏళ్ల‌కు ఏళ్లు చేస్తున్నాం? ఒక‌వేళ సినిమా ఫ‌లితం తేడాగా వ‌స్తే ప‌రిస్థితి ఏంటి? అన్న ఆందోళ‌న లోలోపల వ్య‌క్త‌మ‌వుతోంది.

అంతిమంగా పాన్-ఇండియా ప్రాజెక్టుల మోజులో పడి ఏళ్లకు ఏళ్లు సమయాన్ని కేటాయించే ముందు అగ్ర కథానాయకులు స్క్రిప్ట్ బలంపై పునరాలోచించాల్సిన అవసరం ఏర్పడింది. కథలో దమ్ముంటే ఎన్ని ఏళ్లయినా ప్రేక్షకులు ఆదరిస్తారు. కానీ కంటెంట్ లేని కథల కోసం సంవ‌త్స‌రాలు వెచ్చించ‌డం నటుడి సమయానికి, నిర్మాతల బడ్జెట్‌కు కోలుకోలేని నష్టాన్ని మిగులుస్తుందన్న‌ది అంతే వాస్త‌వం.