Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా అంటే ఏళ్ల తరబడి తీయాలా?

పాన్ ఇండియా సినిమా అనగానే కనీసం రెండేళ్లు షూటింగ్ చేయాలి, వందల రోజులు సెట్స్ మీదే గడపాలి అనే టాక్ ఇండస్ట్రీలో కామన్ అయిపోయింది.

By:  M Prashanth   |   16 Aug 2026 12:00 PM IST
పాన్ ఇండియా అంటే ఏళ్ల తరబడి తీయాలా?
X

పాన్ ఇండియా సినిమా అనగానే కనీసం రెండేళ్లు షూటింగ్ చేయాలి, వందల రోజులు సెట్స్ మీదే గడపాలి అనే టాక్ ఇండస్ట్రీలో కామన్ అయిపోయింది. స్టార్ హీరోల డేట్స్ మ్యాచ్ చేయడం, భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తీయడం, వీఎఫ్ఎక్స్ కు టైమ్ కేటాయించడం లాంటివి నిజమే అయినా.. సినిమా పెద్దది కాబట్టి షూటింగ్ కూడా అంతులేకుండా సాగాల్సిందే అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. ప్రాజెక్ట్ స్కేల్ ఎంత పెద్దదైనా దాన్ని నిలబెట్టేది పక్కా ప్లానింగే.

ఈ విషయంలో 'కాంతార చాప్టర్ 1' మేకర్స్ ను ఆదర్శంగా తీసుకోవచ్చు. ఈ సినిమాలో దాదాపు మూడు వేల వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్నాయని మేకర్స్ చెప్పారు. అయినా సరే షూటింగ్ మొదలైనప్పటి నుంచి రిలీజ్ వరకు కేవలం 18 నెలల్లోనే సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చారు. ముందుగానే పక్కాగా ప్రీ ప్రొడక్షన్ చేసుకోవడం వల్లే ఇది సాధ్యమైంది. గ్రాఫిక్స్ ఎక్కువ ఉన్నంత మాత్రాన సినిమా లేట్ అవ్వాలని రూల్ లేదని వీళ్లు ప్రూవ్ చేశారు.

ఇక ప్రభాస్ 'స్పిరిట్' కోసం డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఇంకో కొత్త స్టైల్ ఫాలో అవుతున్నాడు. ఒక షెడ్యూల్ పూర్తి చేసిన వెంటనే గ్యాప్ లేకుండా ఇంకోటి మొదలు పెట్టకుండా.. మధ్యలో కరెక్ట్ గా నెల రోజులు బ్రేక్ తీసుకుంటున్నాడని టాక్ వినిపిస్తోంది. ఆ గ్యాప్ లో అప్పటివరకు తీసిన రష్ చూసుకుని నెక్స్ట్ షెడ్యూల్ కు ప్లాన్ చేసుకుంటున్నాడు. బయట నుంచి చూసేవాళ్లకు షూటింగ్ స్లోగా అవుతోందని అనిపించినా, అది వాళ్ల ప్లాన్ లో భాగమే కాబట్టి ఎలాంటి ఇబ్బందీ లేదు.

భారీ బడ్జెట్ సినిమాలకు ఇప్పుడు ఇలాంటి లెక్కలే చాలా అవసరం. హీరో డేట్స్ ఇచ్చాడని హడావుడిగా షూటింగ్ మొదలుపెట్టి, తీరా సెట్స్ కు వెళ్లాక కథలో మార్పులు చేయడం చాలా ఖరీదైన పని. కోట్లు ఖర్చు పెట్టి సెట్స్ వేశాక సీన్స్ మారుస్తూ కూర్చుంటే ప్రొడక్షన్ కు తడిసి మోపెడవుతుంది. సినిమా ఎంత భారీగా ప్లాన్ చేస్తే ప్రీ ప్రొడక్షన్ కూడా అంత స్ట్రాంగ్ గా ఉండాలి.

షూటింగ్ స్పాట్ కు వెళ్లాక సమస్యలకు పరిష్కారాలు వెతకడం మొదలైతే వర్కింగ్ డేస్ తో పాటు బడ్జెట్ కూడా అమాంతం పెరిగిపోతుంది. ప్లానింగ్ లేకుండా రోజులు పెంచడమే ఇండస్ట్రీలో చాలా సినిమాలకు అసలు ప్రాబ్లమ్ గా మారింది. అందుకే పాన్ ఇండియా సినిమా గొప్పతనం ఏళ్ల తరబడి షూట్ చేశారన్న దాంట్లో లేదు. అనుకున్న విజన్ ను ప్లాన్ చేసుకున్న టైమ్ లో స్క్రీన్ మీదకు తీసుకురావడమే అసలైన సక్సెస్.

తక్కువ రోజుల్లో తీయడమే గొప్ప అని చెప్పలేం కానీ, పక్కా ప్లానింగ్ తో వెళ్లడమే కరెక్ట్ పద్ధతి. ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సినిమాల స్కేల్ భారీగా పెరిగింది. దానికి తగ్గట్టే మేకర్స్ ప్లానింగ్ కూడా పెరగాలి. లేదంటే పాన్ ఇండియా అనే ట్యాగ్ సినిమా రేంజ్ ను పెంచడం పక్కన పెడితే.. నిర్మాతలకు ఫైనాన్షియల్ గా పెద్ద బరువుగా మారుతుంది.