Begin typing your search above and press return to search.

టాప్ డైరెక్టర్ల తదుపరి చిత్రాలపై సస్పెన్స్!

రాజమౌళి, సుకుమార్, సందీప్ రెడ్డి వంగా వంటి స్టార్ డైరెక్టర్లు ఒక సినిమాను పూర్తి చేసే వరకు వేరొక ప్రాజెక్టును పట్టాలెక్కించే ఆలోచన చేయడం లేదు.

By:  Srikanth Kontham   |   5 July 2026 10:55 AM IST
టాప్ డైరెక్టర్ల తదుపరి చిత్రాలపై సస్పెన్స్!
X

పరిశ్రమలో పాన్-ఇండియా సినిమాల జోరు పెరగడంతో అగ్ర దర్శకుల పనితీరులో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. భారీ బడ్జెట్లు, వందల కోట్ల వ్యాపారం , గ్లోబల్ ఆడియన్స్‌ను ఆకట్టుకోవాలనే లక్ష్యంతో దర్శకులు ఒకే ప్రాజెక్టుపై పూర్తి దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయా ద‌ర్శ‌కులు తదుపరి చిత్రాల వివరాలను ప్రకటించడానికి ఆసక్తి చూపడం లేదు. ఇది సినీ ప్రేక్షకులలో పెద్ద ఎత్తున సస్పెన్స్‌ను రేకెత్తిస్తోంది. రాజమౌళి, సుకుమార్, సందీప్ రెడ్డి వంగా వంటి స్టార్ డైరెక్టర్లు ఒక సినిమాను పూర్తి చేసే వరకు వేరొక ప్రాజెక్టును పట్టాలెక్కించే ఆలోచన చేయడం లేదు.

ప్రస్తుతం రాజమౌళి ..మహేష్ తో `వారణాసి` చిత్రంలో బిజీగా ఉన్నారు. అన్ని ప‌నులు పూర్తి చేసుకుని ఈ చిత్రం 2027 ఏప్రిల్‌లో విడుదల కానుంది. అటుపై రాజ‌మౌళి ఎవరితో? పని చేస్తారనేది ఇప్పటికీ ఓ మిస్టరీగానే ఉంది.. ఇలాంటి స్థితిలోనే మ‌రికొంత మంది అగ్ర దర్శకులు కూడా ఉన్నారు. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో `డ్రాగన్` తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్రాజెక్టును 2027 జూన్‌లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత నీల్ తన సొంత యూనివర్స్‌ను విస్తరిస్తారా లేదా కొత్త కథతో ముందుకు వస్తారా అనే దానిపై స్పష్టత లేదు.

అలాగే అట్లీ - అల్లు అర్జున్‌తో `రాకా` తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే ఈ సినిమాను 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని చూస్తున్నారు. అప్పటి వరకు వారి తదుపరి ప్రయాణం ఎలా ఉండబోతుందో? అంచనా వేయడం కూడా సాధ్య ప‌డ‌టం లేదు. సందీప్ రెడ్డి వంగా విషయానికి వస్తే ఆయన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ `స్పిరిట్` 2027 మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై ఉన్న భారీ అంచనాల నేపథ్యంలో వంగ‌ తర్వాతి అడుగును చాలా జాగ్రత్తగా వేస్తారు. హీరో ఎంపిక అన్న‌ది అంత సుల‌భంగా జ‌ర‌గ‌దు. క‌థ విష‌యంలోనూ వంగా క‌స‌ర‌త్తు అలాగే ఉంటుంది.

మొన్న‌టి వ‌ర‌కూ ఇదే బాట‌లో త్రివిక్ర‌మ్ కూడా క‌నిపించారు. ఆద‌ర్శ కుటుంబం త‌ర్వాత గురూజీ హీరో బ‌న్నీ అవుతాడా? తార‌క్ అవుతాడా? అనే స‌స్పెన్స్ ఉండేది. కానీ తాజాగా తార‌క్ తోనే సినిమా ఉంటుంద‌ని అధికారికంగా క్లారిటీ ఇచ్చేసారు. ఇలాంటి క్లారిటీ మిగిలిన ద‌ర్శ‌కుల నుంచి రావడానికి చాలా స‌మ‌యం ప‌డుతుంది.

పాన్-ఇండియా ట్రెండ్ కారణంగా దర్శకులపై ఒత్తిడి కూడా పెరిగింది. ఒకప్పుడు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండే దర్శకులు ఇప్పుడు కనీసం రెండు లేదా మూడేళ్లకు ఒక సినిమాను మాత్రమే అందిస్తున్నారు. భారీ సెట్టింగులు, విజువల్ ఎఫెక్ట్స్, స్క్రిప్టింగ్ కోసం వెచ్చిస్తున్న సమయం పెరగడమే దీనికి ప్రధాన కారణం. సుదీర్ఘంగా వేచి ఉండటం ప్రేక్షకులకు కొంత నిరుత్సాహాన్ని కలిగించినప్పటికీ క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదనే వారి నిర్ణయం పరిశ్రమకు సానుకూల పరిణామమే.

అగ్ర దర్శకులంతా ప్రస్తుత ప్రాజెక్టులనే పెద్ద పరీక్ష గా భావిస్తున్నారు. ఈ చిత్రాల ఫలితాల ఆధారంగానే తదుపరి నిర్ణయాలను తీసుకోనున్నారు. ఏది ఏమైనా? టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు స్టార్ హీరోల అభిమానులు తమ అభిమాన దర్శకుడు తదుపరి ఎవరిని డైరెక్ట్ చేస్తారా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినీ పరిశ్రమలో ఈ తరహా నిశ్శబ్దం రాబోయే కాలంలో మరిన్ని సంచలన ప్రకటనలకు దారితీస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.