పాన్ ఇండియా పేరిట సౌత్ సినిమాల ఐడెంటిటీ మాయమవుతోందా?
ఒక ప్రాంతీయ భాషలో రూపొందిన సినిమా దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుని, భాషలకు అతీతంగా భారీ విజయాలు సాధించగలదని ఆ సినిమా నిరూపించింది.
By: Sravani Lakshmi Srungarapu | 29 Jun 2026 3:06 PM ISTఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే దేశవ్యాప్తంగా ఎక్కువ మంది గుర్తుకు వచ్చేది బాలీవుడ్ మాత్రమే. హిందీ సినిమాలే ఇండియన్ సినిమా ప్రతినిధులుగా భావించే పరిస్థితి ఉండేది. కానీ గత దశాబ్దంలో ఆ ఈక్వేషన్ పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి తర్వాత ఇండియన్ సినిమాలో పాన్ ఇండియా అనే భావనకు కొత్త రూపు వచ్చింది. ఒక ప్రాంతీయ భాషలో రూపొందిన సినిమా దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుని, భాషలకు అతీతంగా భారీ విజయాలు సాధించగలదని ఆ సినిమా నిరూపించింది.
ఆ తర్వాత కేజీఎఫ్, పుష్ప, ఆర్ఆర్ఆర్, కాంతార, కల్కి 2898 ఏడీ వంటి సినిమాలు ఈ మార్పును మరింత బలపరిచాయి. ఇవి కేవలం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడమే కాదు, దేశవ్యాప్తంగా ప్రేక్షకుల అభిరుచినే మార్చేశాయి. ముఖ్యంగా హిందీ ఆడియన్స్ ఈ సినిమాలను విపరీతంగా ఆదరించడానికి ప్రధాన కారణం ఆ సినిమాల్లో కథ చెప్పే విధానం. భారీ స్థాయిలో చూపించిన హీరో ఎలివేషన్స్, ఎమోషన్స్ కు పెద్దపీట వేసిన కథనం, మాస్ యాక్షన్ సీక్వెన్స్‌లు, ఆడియన్స్ ను థియేటర్‌లో ఉత్సాహపరిచే మోమెంట్స్ కొత్త అనుభూతిని అందించాయి. చాలా కాలంగా హిందీ ప్రేక్షకులు మిస్ అయిన కమర్షియల్ థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఈ సినిమాలు తిరిగి తీసుకొచ్చాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో రీసెంట్ గా కొన్ని హిందీ మీడియా సంస్థలు పుష్ప మరియు కేజీఎఫ్ లాంటి ఫ్రాంచైజీలను బాలీవుడ్ ఫ్రాంచైజీలుగా ప్రస్తావించడం కొత్త చర్చకు దారితీసింది. దీంతో దేశవ్యాప్తంగా సక్సెస్ అందుకున్న ప్రతి ఫ్రాంచైజ్ సినిమా బాలీవుడ్ పరిధిలోకే వస్తుందా? లేక ఆ సినిమా రూపొందిన పరిశ్రమకే గుర్తింపు దక్కాలా? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
వాస్తవానికి పాన్ ఇండియా అంటే హిందీ సినిమా కాదు. పాన్ ఇండియా అంటే దేశంలోని అన్ని భాషల ప్రేక్షకులను చేరుకునే సినిమా అని మాత్రమే అర్థం. తెలుగు, కన్నడ, తమిళం లేదా మలయాళంలో రూపొందిన సినిమా హిందీలో డబ్ అయి దేశవ్యాప్తంగా సక్సెస్ సాధించినంత మాత్రాన అది బాలీవుడ్ సినిమా అయిపోదు. అదే విధంగా ఒక హిందీ సినిమా దక్షిణాది రాష్ట్రాల్లో విజయం సాధిస్తే అది సౌత్ సినిమా కాదు. పాన్ ఇండియా అనేది మార్కెట్ పరిధిని సూచించే పదమే తప్ప, సినిమా మూలాన్ని మార్చే నిర్వచనం కాదని నెటిజన్లు అభిప్రాయపడుతూ, కెజిఎఫ్, పుష్ప ఫ్రాంచైజ్ లను తమ సినిమాలని భావిస్తున్న బాలీవుడ్ మీడియాపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
సౌత్ సినిమాలు సాధించిన విజయాలు భారతీయ సినిమాకు కొత్త దిశ చూపించాయనడంలో సందేహం లేదు. అందుకే వాటి సక్సెస్‌లను సరైన పరిశ్రమకు ఆపాదించాల్సిన అవసరం ఉందని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. దేశవ్యాప్తంగా ఆదరణ పొందడం ఒక విషయం అయితే, ఆ విజయానికి పునాది వేసిన పరిశ్రమకు తగిన గుర్తింపు ఇవ్వడం మరో ముఖ్యమైన విషయం. భారతీయ సినిమా పరిణామాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ రెండింటి మధ్య ఉన్న తేడాను గుర్తించడం కూడా చాలా అవసరం.
