Begin typing your search above and press return to search.

'పల్లబురుసు' మూవీ రివ్యూ

ఇటీవలే తన కొడుకు అఖిల్ అక్కినేని హీరోగా లెనిన్ రూపంలో మంచి హిట్ ఇచ్చిన ఆయన.. ఇప్పుడు ఎపిక్ స్టూడియోస్ అనే మరో సంస్థతో కలిసి 'పల్లబురుసు' అనే ప్రయోగాత్మక చిత్రాన్ని నిర్మించారు.

By:  Prakash Chimmala   |   16 Aug 2026 11:12 PM IST
పల్లబురుసు మూవీ రివ్యూ
X

'పల్లబురుసు' మూవీ రివ్యూ

నటీనటులు: సుధాకర్ రెడ్డి - మురళీధర్ గౌడ్ - ప్రజ్వల్ యడ్మా - గోమతి తదితరులు

సంగీతం: పవన్ సీహెచ్

ఛాయాగ్రహణం: వినోద్ బంగారి

నిర్మాణం: అన్నపూర్ణ స్టూడియోస్ - ఎపిక్ స్టూడియోస్

రచన - దర్శకత్వం: ఉదయ్ చౌహాన్

సీనియర్ హీరో అక్కినేని నాగార్జున ఈ మధ్య నిర్మాతగా దూకుడు చూపిస్తున్నారు. ఇటీవలే తన కొడుకు అఖిల్ అక్కినేని హీరోగా లెనిన్ రూపంలో మంచి హిట్ ఇచ్చిన ఆయన.. ఇప్పుడు ఎపిక్ స్టూడియోస్ అనే మరో సంస్థతో కలిసి 'పల్లబురుసు' అనే ప్రయోగాత్మక చిత్రాన్ని నిర్మించారు. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కథా కమామిషు ఏంటో చూద్దాం.

కథ: శంభు (సుధాకర్ రెడ్డి) తెలంగాణలోని ఒక పల్లెటూరికి చెందిన వృద్ధుడు. తన కొడుకు తిరుపతి (మురళీధర్ గౌడ్) వేరుపడి ఒంటరి జీవితం గడుపుతుంటాడాయన. తిరుపతి తన బాగోగులు చూడకపోగా, మనవరాలి పెళ్లికి కూడా పిలవకపోవడంతో కలత చెందిన శంభు కొడుకు మీద కోర్టుకెక్కుతాడు. తనకి తిరుపతి పళ్ళబురుసు (టూత్ బ్రష్) కొనివ్వలేదని శంభు కోర్టులో చెప్పడంతో అందరూ అవాక్కవుతారు. ఇంతకీ ఈ పళ్ళబురుసు కథేంటి.. శంభు కొడుకు మీద కేసు పెట్టడంలో ఆంతర్యమేంటి.. ఈ కేసు ఎలాంటి మలుపులు తిరిగి చివరికి ఎలా ముగిసింది అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ: మూడేళ్ల ముందు బ‌లగం అనే చిన్న చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రేపిన సంచ‌ల‌నం అంతా ఇంతా కాదు. తెలంగాణ ప‌ల్లెటూరి ఆత్మ‌ను ప‌ట్టుకుని వేణు యెల్దండి అద్భుత‌మైన క‌థ‌న నైపుణ్యంతో ప్రేక్ష‌కులను క‌దిలించేశాడు. ఐతే ఆ సినిమా స్ఫూర్తితో.. ఆ త‌ర‌హా క‌థ‌లు మ‌రిన్ని తెర‌కెక్కాయి కానీ.. ఆ మ్యాజిక్ ను మాత్రం రిపీట్ చేయ‌లేకపోయాయి. బ‌ల‌గం క‌థ‌లో కీ రోల్ చేసిన‌ సుధాకర్ రెడ్డినే ముఖ్య పాత్ర‌లో పెట్టి గ‌త ఏడాది బాపు అనే సినిమా తీశారు. ఇప్పుడు మ‌ళ్లీ అదే నటుడితో ప‌ళ్ళ‌బురుసు చేశారు. ఈ న‌టుడికి సూట‌య్యే పాత్ర‌.. మంచి పాయింట్ అయితే తీసుకుంటున్నారు కానీ.. బ‌ల‌గంలో మాదిరి ఎమోష‌న్ మాత్రం రాబ‌ట్ట‌లేక‌పోతున్నారు. ప‌ళ్ళ‌బురుసు ట్రైల‌ర్ చూసి ఏదో ఊహించుకుంటాం కానీ.. చిన్న పాయింటు ప‌ట్టుకుని విప‌రీతంగా సాగ‌దీసి.. సిల్లీ సీన్ల‌తో ప్రేక్ష‌కుల స‌హ‌నానికి ప‌రీక్ష పెట్టే సినిమా ఇది.

ప‌ళ్ళ‌బురుసు క‌థ న‌డిచేది ద‌శాబ్దాల కింద‌టి కాలంలో కాదు.. వ‌ర్త‌మానంలోనే. మ‌రి ఈ రోజుల్లో ప‌ల్లెటూళ్ల‌లో టూత్ బ్ర‌ష్ దొర‌క‌ని ప‌రిస్థితులు ఎక్క‌డైనా ఉన్నాయా? కానీ ఈ సినిమాలో త‌న కొడుకు బ్ర‌ష్ కొనివ్వ‌లేదని తండ్రి కోర్టుకెక్క‌తాడు మరి. క‌థ పూర్తిగా దాని మీదే న‌డ‌వ‌క‌పోయినా స‌రే.. టైటిల్ అలా పెట్టిన‌పుడు.. క‌థ‌లో ఆ పాయింట్ కీల‌కం అయిన‌పుడు.. లాజిక్ క‌థ ప‌రంగా లాజిక్ స‌రిగా ఉండేలా చూసుకోవాల్సింది. అక్క‌డే అడుగు త‌డ‌బ‌డ‌డంతో ఈ క‌థ‌కు అర్థం లేకుండా పోయిన ప‌రిస్థితి. పోనీ మిగ‌తా క‌థ‌నైనా స‌రిగ్గా న‌డిపించారా అంటే అదీ లేదు. తండ్రి త‌న మీద కేసు వేశాడంటే ముందు కొడుకు ఏం చేస్తాడు? త‌ండ్రి ద‌గ్గ‌రికి వెళ్లి మాట్లాడే ప్ర‌య‌త్నం చేస్తాడు. కానీ ఇందులో కొడుకు మాత్రం అస‌లే ఆర్థిక ఇబ్బందులున్నా స‌రే ఖ‌ర్చు పెట్టుకుని కోర్టులో పోరాటానికి రెడీ అవుతాడు. అక్క‌డ పంచాయితీ అయ్యాక తండ్రితో మాట క‌లిపే ప్ర‌య‌త్నం చేస్తాడు. అక్క‌డ కూడా ఇద్ద‌రి మ‌ధ్య సంభాష‌ణ స‌రిగా ఉండ‌దు. కోర్టులో కేసు న‌డ‌వాలి అంటే అందుకు త‌గ్గ అనివార్య ప‌రిస్థితులు తెర‌పైన క‌నిపిస్తేనే ప్రేక్ష‌కుడు క‌థ‌తో క‌నెక్ట్ అవుతాడు కానీ.. బ‌లవంతంగా కేసు న‌డిచిన‌ట్లు చూపిస్తే అది అస‌హ‌జంగా ఉండి అస‌హ‌నానికే దారి తీస్తుంది.

కోర్టులో వాదోప‌వాదాలకు సంబంధించిన స‌న్నివేశాలు-డైలాగులు సైతం సైతం ఏమాత్రం ఆస‌క్తి లేకుండా.. సిల్లీగా సాగ‌డంతో ప‌ళ్ళ‌బురుసు చాలా ఫ్ర‌స్టేటింగ్ గా త‌యారైంది. ఒక‌దానికి ఇంకోదానికి క‌నెక్ష‌న్ లేన‌ట్లు స‌న్నివేశాలు వ‌చ్చి పోతుంటాయి త‌ప్ప‌.. ఎక్క‌డా ఒక ఫ్లో లేదు. ఇక ఈ సినిమాలో వృద్ధుల గ్యాంగ్ మీద న‌డిపిన అలెక్సా కామెడీ సీన్లు.. ఒక అబ్బాయి-అమ్మాయి మ‌ధ్య సాగే రొమాంటిక్ ట్రాక్ గురించి ఎంత త‌క్కువ చెప్పుకుంటే అంత మంచిది. అస‌లు క‌థే అంతంత‌మాత్రంగా సాగుతుంటే.. మ‌ధ్య‌లో ఈ స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల స‌హ‌నాన్ని మ‌రింత‌గా ప‌రీక్షిస్తాయి. ముగింపు స‌న్నివేశాలు బాగున్నా.. అక్క‌డ మంచి డైలాగులు ప‌డినా.. అప్ప‌టికే పుణ్య‌కాలం కాస్తా గ‌డిచిపోవ‌డంతో ప‌ళ్ళ‌బురుసు ఓవ‌రాల్ గా ఎలాంటి ఇంపాక్ట్ వేయ‌లేక‌పోయింది. ఈ సందేశాన్నివ్వ‌డానికి కోర్టు-కేసు అంటూ ఈ క‌థ‌ను సాగ‌దీయాలా అనే ఫీలింగ్ క‌లిగిస్తుంది సినిమా చివ‌రికి. క‌థాంశం- సందేశం బాగుండి... ట్రైల‌ర్ బాగా క‌ట్ చేసినంత మాత్రాన సినిమా బాగుంటుంద‌ని ఆశించ‌డానికి వీల్లేద‌నడానికి ప‌ళ్ళ‌బురుసు ఉదాహ‌ర‌ణ‌.

నటీనటులు: పళ్ళబురుసులో ఇద్దరు ప్రధాన నటులు బాగా చేశారు. తెలంగాణ పల్లెటూరిలో మధ్యతరగతి వ్యక్తి పాత్ర చెయ్యమంటే మురళీధర్ గౌడ్ కు అంతకంటే కావలసింది ఏముంది? అలవోకగా ఆ పాత్రను చేసుకుపోయారు. శంభు పాత్రలో సుధాకర్ రెడ్డి నటిస్తున్నట్లు అనిపించదు. అంతగా అందులో జీవించేశారు. నడక.. ఆహార్యం.. హావభావాలు అన్నీ నిజంగా ఒక పల్లెటూరి పెద్దాయన తరహాలోనే సంగతి. ప్రజ్వల్.. అతడికి జోడిగా నటించిన అమ్మాయి పర్వాలేదు. మురళీధర్ భార్యగా.. చెల్లిగా చేసిన ఆర్టిస్టులు ఆ పాత్రలకు బాగానే కుదిరారు. మిగతా నటీనటులు మామూలే.

సాంకేతిక వర్గం: పళ్ళబురుసులో నిర్మాణ విలువలు సోసోగా అనిపిస్తాయి. పల్లెటూరి కథల్లో ప్రొడక్షన్ వాల్యూస్ మీద ఎక్కువ అంచనాలు ఉండవు కానీ.. ఇందులో కొన్ని చోట్ల క్వాలిటీ విషయంలో రాజీ పడినట్లు అనిపిస్తుంది. సన్నివేశాల్లో బలం ఉంటే అంత పట్టింపు ఉండేది కాదు కానీ.. ఆ బలం లేకే ఈ లోటు కనిపిస్తుంది. లవ్ స్టోరీ ఫేమ్ పవన్ సీహెచ్ సంగీతం ఒక మోస్తరుగా సాగింది. పాటలు కథకు తగ్గట్లు సాగాయి. బీజీఎం ఓకే. వినోద్ బంగారి విజువల్స్ పర్వాలేదు. ఇక రచయిత - దర్శకుడు ఉదయ్ చౌహాన్ చెప్పాలనుకున్న పాయింట్.. ఇవ్వాలనుకున్న సందేశం బాగున్నా.. స్క్రిప్టు సరిగా రాసుకోకపోవడంతో.. ఊరికే సన్నివేశాలను పేర్చుకుంటూ పోవడంతో పళ్ళబురుసు ఒక మామూలు ప్రయత్నంగా మిగిలిపోయింది.

చివరగా: పళ్ళబురుసు.. అన్ని సినిమాలు బలగం అవ్వవు

రేటింగ్ -2/5