పరువు నష్టం.. 10 కోట్లకు దావా వేసిన పలాష్ ముచ్చల్
సెలబ్రిటీల మీద ఇలాంటి ఆరోపణలు చేయడం వల్ల వారి కెరీర్ , బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందని పలాష్ తరపు న్యాయవాదులు పేర్కొన్నారు.
By: Sivaji Kontham | 25 Jan 2026 1:00 PM ISTమ్యూజిక్ కంపోజర్, దర్శకుడు పలాష్ ముచ్చల్ క్రికెటర్ స్మృతి మందన ఒకరి నుంచి ఒకరు విడిపోయిన సంగతి తెలిసిందే. పెళ్లి క్యాన్సిల్ అయిన తర్వాత ఆ ఇద్దరూ ఎవరికి వారు కెరీర్‌పై దృష్టి సారించారు. కానీ ఈ పెళ్లి అనంతర వివాదాలు మీడియా హెడ్ లైన్స్‌లోకొస్తున్నాయి. తాజా పరిణామం ప్రకారం.. విజ్ఞాన్ మానే అనే వ్యక్తిపై పలాష్ ముచ్చల్ రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేయడం ఇప్పుడు పరిశ్రమలో సంచలనంగా మారింది.
ఈ వివాదానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..ఇదివరకూ విజ్ఞాన్ మానే తన సహచరుడైన పలాష్ ముచ్చల్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఓ సినిమా కోసం పని చేస్తున్నప్పుడు పలాష్ తనను మోసం చేశారని, తన ఐడియాలను, తన పనిని తప్పుడు పద్ధతిలో వాడుకున్నారని సోషల్ మీడియాలలో ఆరోపించారు. అంతేకాదు స్మృతి మందనతో పెళ్లి ఆగిపోవడానికి మరొక మహిళతో పలాష్ సంబంధమే కారణమని కూడా విజ్ఞాన్ ఆరోపించాడు.
అయితే ఈ ఆరోపణలు తన ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని, ఎటువంటి ఆధారాలు లేకుండా తనపై బురద చల్లుతున్నారని పలాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వ్యక్తిగత, వృత్తిపరమైన గౌరవానికి భంగం కలిగించినందుకు గాను విజ్ఞాన్ మానే రూ.10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ కోర్టులో పరువు నష్టం దావా వేశారు.
సెలబ్రిటీల మీద ఇలాంటి ఆరోపణలు చేయడం వల్ల వారి కెరీర్ , బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందని పలాష్ తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. దావా వేయడానికి ముందే పలాష్ తరపున నోటీసులు పంపినట్లు సమాచారం. కానీ అవతలి వ్యక్తి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా ఇలాంటి కేసుల్లో ఆరోపణలు చేసిన వ్యక్తి తన దగ్గర ఉన్న ఆధారాలను కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆధారాలు లేకపోతే పలాష్‌కు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉంది.
ఆధారాలున్నాయి అంటూ..
అయితే పలాష్ ముచ్చల్ రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేసిన తర్వాత విజ్ఞాన్ మానే తన వైపు వాదనను మరింత బలంగా వినిపిస్తున్నారు. అతడు తాజా మీడియా ఇంటర్వ్యూలో పలాష్ ముచ్చల్ తనను రూ.40 లక్షల వరకు మోసం చేశాడని విజ్ఞాన్ మానే ఆరోపిస్తున్నారు. `నజ్రియా` అనే సినిమా కోసం పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని, అలాగే సినిమాలో పాత్ర కూడా ఇస్తానని పలాష్ నమ్మించాడని ఆయన చెప్పారు. కానీ సినిమా పూర్తి కాలేదని, తన డబ్బు అడిగితే పలాష్ తన నంబర్ బ్లాక్ చేశాడని సాంగ్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విజ్ఞాన్ మానే కేవలం డబ్బు గురించే కాకుండా పలాష్ వ్యక్తిగత జీవితంపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.
క్రికెటర్ స్మృతి మంధానతో పలాష్ పెళ్లి క్యాన్సిల్ అవ్వడానికి కారణం అతడి తప్పుడు సంబంధమే కారణమని ఆయన పేర్కొన్నారు. 2025 నవంబర్ 23న జరిగిన వివాహ వేడుకల్లో పలాష్ వేరొక మహిళతో బెడ్ పై `రెడ్ హ్యాండెడ్`గా దొరికిపోయాడని, ఆ సమయంలో భారత మహిళా క్రికెటర్లు అతడిని కొట్టారని కూడా విజ్ఞాన్ మానే ఆరోపించారు. పలాష్ కుటుంబ సభ్యులు తనను భయపెడుతున్నారని, సినిమా విడుదల కావాలంటే మరిన్ని నిధులు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని విజ్ఞాన్ మానే ఆరోపిస్తున్నారు.
తాను చేసిన ప్రతి ఆరోపణకు తన వద్ద చాట్స్ , ఫోన్ రికార్డింగ్స్ సాక్ష్యాలుగా ఉన్నాయని, వాటిని పోలీసులకు, మీడియాకు సమర్పించడానికి సిద్ధంగా ఉన్నానని పలాష్ ధీమా వ్యక్తం చేశారు.
