కోర్టుకు పలాష్ ముచ్చల్.. నెక్స్ట్ ఏంటి?
ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు, టీమిండియా క్రికెటర్ స్మృతి మంధాన మాజీ బాయ్ ఫ్రెండ్ పలాష్ ముచ్చల్ మరోసారి వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 27 Jan 2026 11:38 PM ISTప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు, టీమిండియా క్రికెటర్ స్మృతి మంధాన మాజీ బాయ్ ఫ్రెండ్ పలాష్ ముచ్చల్ మరోసారి వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. మరాఠీ నటుడు నిర్మాత విద్యాన్ మానే చేసిన మోసం ఆరోపణల కేసులో ఆయన తాజాగా కోర్టుకు హాజరయ్యారు. ఈ ఘటనతో వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది. న్యాయవాదుల బృందంతో కలిసి కోర్టుకు వచ్చిన పలాష్ ముచ్చల్, సాదాసీదా దుస్తుల్లో కనిపించారు.
తనపై వచ్చిన ఆరోపణలు, అలాగే క్రికెటర్ స్మృతి మంధానతో పెళ్లి రద్దు అంశంపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన స్పందించలేదు. విచారణ పూర్తయ్యాక పాపరాజీలను పట్టించుకోకుండా నేరుగా కారులో వెళ్లిపోయారు. అందుకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కోర్టు ఆవరణలో పలాష్ కనిపించిన వీడియోలు.. ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతున్నాయి.
అయితే తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని పలాష్ ముచ్చల్ ఇప్పటికే స్పష్టం చేశారు. తన ప్రతిష్ఠను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ విద్యాన్ మానేకు రూ.10 కోట్ల పరువు నష్టం నోటీసు పంపించారు. ఈ విషయాన్ని పలాష్ తన ఇన్ స్టాగ్రామ్ లో వెల్లడించారు. "నా ప్రతిష్ఠ, వ్యక్తిత్వాన్ని కించపరచేలా తప్పుడు ఆరోపణలు చేశారు. అందుకే నా న్యాయవాది శ్రేయాంశ్ మిథారే ద్వారా విద్యాన్ మానేకు రూ.10 కోట్ల డిఫమేషన్ నోటీసు పంపించాం" అని పలాష్ తన లీగల్ స్టేట్మెంట్ లో పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, విద్యాన్ మానే మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలాష్ తన నుంచి రూ.40 లక్షలు తీసుకుని మోసం చేశారని ఆయన ఆరోపించారు. అయితే ఇప్పటివరకు ఆ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదని పోలీసులు తెలిపారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. 2023 డిసెంబర్ 5న సాంగ్లీలో పలాష్ ముచ్చల్, విద్యాన్ మానేను కలిశారు. తాను నిర్మించబోయే నజారియా అనే సినిమా ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టాలని పలాష్ సూచించినట్లు మానే తెలిపారు.
ఓటీటీ విడుదల తర్వాత రూ.25 లక్షల పెట్టుబడిపై రూ.12 లక్షల లాభం వస్తుందని చెప్పినట్లు ఆరోపించారు. అలాగే సినిమాలో ఒక పాత్ర కూడా ఇస్తానని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత పలాష్ ను రెండు సార్లు కలిసిన మానే, 2025 మార్చి నాటికి మొత్తం రూ.40 లక్షలు ఇచ్చినట్లు ఫిర్యాదులో తెలిపారు. అయితే సినిమా ప్రాజెక్టు ముందుకు సాగకపోవడంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే ఎలాంటి స్పందన రాలేదని చెప్పారు. దీంతో పోలీసులను ఆశ్రయించడంతో పాటు, స్మృతి మంధానతో ఉన్న సంబంధంలో కూడా పలాష్ నమ్మకంగా వ్యవహరించలేదని ఆరోపించారు.
ఈ కేసులో కోర్టు విచారణ కొనసాగుతోంది. ఇరు పక్షాల వాదనలు సాగుతున్నాయి. పలాష్ పై వచ్చిన ఆరోపణలు నిజమా? లేక పరువు నష్టం కేసులో ఆయనకు న్యాయం జరుగుతుందా? అన్నది కోర్టు తీర్పుతో తేలనుంది. ప్రముఖ సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకున్న పలాష్ ముచ్చల్ వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితంపై వివాదం తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
