పాకిస్తాన్ మంత్రికి సెగ: 'దురంధర్ 3' తీస్తానంటూ సవాల్!
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో `దురంధర్` ఫ్రాంచైజీ సృష్టిస్తున్న ప్రభంజనం అంతా ఇంతా కాదు.
By: Sivaji Kontham | 28 March 2026 11:47 PM ISTభారతీయ చలనచిత్ర పరిశ్రమలో `దురంధర్` ఫ్రాంచైజీ సృష్టిస్తున్న ప్రభంజనం అంతా ఇంతా కాదు. రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన `దురంధర్: ది రివెంజ్` కేవలం తొమ్మిది రోజుల్లోనే రూ. 1000 కోట్లు కొల్లగొట్టి రూ. 1500 కోట్ల మార్కు వైపు దూసుకుపోతోంది. అయితే ఈ సినిమా విజయం పాకిస్తాన్‌లోని కొందరు రాజకీయ నాయకులకు కంటగింపుగా మారింది. ముఖ్యంగా ఈ చిత్రంలో రాకేష్ బేడీ పోషించిన జమీల్ జమాలి పాత్ర తననే ఉద్దేశించి తీశారని భావిస్తున్న పాకిస్తానీ ఎంపీ నబిల్ గబోల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
సినిమాలో జమీల్ జమాలి పాత్రను హాస్యాస్పదంగా చూపడమే కాకుండా.. క్లైమాక్స్‌లో అతడిని ఇండియన్ ఏజెంట్‌గా చూపడంపై నబిల్ గబోల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 2007లో లియారీ ప్రాంతానికి తాను ఎంఎన్‌ఏ (మెంబర్ ఆఫ్ నేషనల్ అసెంబ్లీ)గా ఉన్నానని.. తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఈ పాత్రను మలిచారని ఆయన మండిపడుతున్నారు. భారతీయులు నేరుగా పాకిస్తాన్‌తో యుద్ధం చేయలేక.. ఇలా సినిమాల ద్వారా తమ అక్కసు వెళ్లగక్కుతున్నారని ఆయన విమర్శలు గుప్పించారు.
భారతీయ సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ట్రోలింగ్‌కు సమాధానంగా నబిల్ గబోల్ ఒక సంచలన ప్రకటన చేశారు. తానే స్వయంగా ఒక సినిమా తీసి భారత్‌కు బుద్ధి చెబుతానని దానికి `దురంధర్ 3` అని పేరు పెడతానని వ్యాఖ్యానించారు. అయితే.. అతడి వ్యాఖ్యలపై స్పందించిన నెటిజనులు సరదాగా ``కాపీరైట్ సమస్యలు వస్తాయేమో!`` అంటూ ఆటపట్టిస్తున్నారు. అయితే అతడు తన సినిమాకు `లియారీ కా గబ్బర్` అని పేరు పెడతానని.. అందులో వాస్తవాలను చూపిస్తానని మంత్రివర్యులు చెప్పుకు రావడం విశేషం.
నిజానికి `దురంధర్` అనేది ఆదిత్య ధర్ సృష్టించిన ఒక సక్సెస్‌ఫుల్ బ్రాండ్. ఒక పాకిస్తానీ రాజకీయ నాయకుడు ఆ టైటిల్‌ను వాడాలనుకోవడం హాస్యాస్పదం. అతడు నిజంగానే సినిమా తీస్తాడా? అంటూ ఇప్పుడు ప్రజలు నవ్వుకుంటున్నారు. ఒకవేళ ఆయన నిజంగానే `దురంధర్ 3` అనే టైటిల్ తో సినిమా తీయాలనుకుంటే అంతర్జాతీయ స్థాయిలో భారీ కాపీరైట్ చట్టాల చిక్కుల్లో పడటం ఖాయం. ఆదిత్య ధర్.. చిత్ర నిర్మాణ సంస్థ ఈ విషయంలో ఎంత కఠినంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ప్రస్తుతానికి నబిల్ గబోల్ వ్యాఖ్యలు కేవలం పబ్లిసిటీ స్టంట్‌లాగే కనిపిస్తున్నాయి. `దురంధర్` సిరీస్ సాధిస్తున్న వందల కోట్ల వసూళ్లు ప్రపంచవ్యాప్త గుర్తింపు చూసి ఓర్వలేక ఆయన ఇలాంటి వింత సవాళ్లు విసురుతున్నారని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. ఏదేమైనా ఒక సినిమా పాకిస్తాన్ రాజకీయ వర్గాల్లో ఈ స్థాయి ప్రకంపనలు సృష్టించడం ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
