ఇద్దరు తెలుగు నటులను వరించిన 'పద్మశ్రీ'
అవును.. ఇద్దరు తెలుగు నటులను పద్మశ్రీ వరించింది. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నటుడు మురళి మోహన్ లను పద్మశ్రీ వరించింది.
By: Sivaji Kontham | 26 Jan 2026 9:00 AM ISTఅవును.. ఇద్దరు తెలుగు నటులను పద్మశ్రీ వరించింది. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నటుడు మురళి మోహన్ లను పద్మశ్రీ వరించింది. ఆ ఇద్దరినీ కేంద్రం నియమించిన పద్మ అవార్డుల జూరీ కమిటీ ఎంపిక చేయడం సముచితమైనదని అభిప్రాయం ఫిలింసర్కిల్స్ లో వినిపిస్తోంది.
నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ దాదాపు 200 చిత్రాల్లో తనదైన అద్భుత నటనతో ఆకట్టుకున్నారు. నటకిరీటికి తెలుగులో గొప్ప పేరుంది. అతడు తన హాస్యంతో చికిత్స చేయగలడు. మురళి మోహన్ సీనియర్ నటుడిగా, నిర్మాతగా, బిజినెస్‌మేన్ గా, రాజకీయ నాయకుడిగాను సుప్రసిద్ధులు.. అందుకే ఇది తెలుగు చలనచిత్ర పరిశ్రమకు నిజంగా గర్వకారణమైన క్షణం. గణతంత్ర దినోత్సవం (26 జనవరి 2026) సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాలలో దిగ్గజ నటులు రాజేంద్ర ప్రసాద్ , మురళీ మోహన్ పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికవ్వడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
వీరిద్దరికీ పద్మశ్రీ దక్కడం వెనుక ఉన్న ముఖ్య కారణాలు పరిశీలిస్తే.. కామెడీని ఒక కళగా మార్చి, దానికి `గౌరవాన్ని` తీసుకొచ్చిన నటుడు రాజేంద్ర ప్రసాద్. కేవలం నవ్వించడమే కాకుండా ఎమోషన్ ని పండించగలిగే అరుదైన నటుడిగా రాజేంద్రుడికి గుర్తింపు ఉంది. ఆయన నటించిన ఎర్రమందారం, ఆ నలుగురు, మేడం, టామీ వంటి సినిమాలతో తనలోని అద్భుతమైన నటుడిని ప్రపంచానికి పరిచయం చేశారు. గత 45 ఏళ్లుగా 200లకు పైగా చిత్రాల్లో నటించిన రాజేంద్రుని నిరంతర సేవలకు గుర్తింపుగా కేంద్రం ఈ పద్మశ్రీని ప్రకటించింది. కామెడీ హీరోగా ఒక వెలుగు వెలిగిన ఆయనకు ఈ పురస్కారం చాలా కాలం క్రితమే రావాల్సి ఉందని, కాస్త ఆలస్యమైందని కూడా అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
టాలీవుడ్ వెటరన్ నటులలో మురళి మోహన్ ప్రస్థానం అసాధారణమైనది. ఆయన కుటుంబ కథా చిత్రాలతో నటనకు గౌరవం పెంచిన నటుడు. మురళీ మోహన్ కేవలం నటుడిగానే కాకుండా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా, సక్సెస్‌ఫుల్ బిజినెస్‌మెన్‌గా నిరూపించిన బహుముఖ ప్రజ్ఞాశాలి. దశాబ్ధాల సినీ ప్రస్థానంలో 350కి పైగా సినిమాల్లో నటించి, తనకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవప్రదమైన ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. `జయభేరి` సంస్థ ద్వారా ఎన్నో అద్భుతమైన సినిమాలను నిర్మించారు.
సినిమాల ద్వారానే కాకుండా, రాజకీయ, సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొంటారు. సినీ పరిశ్రమలో అత్యంత గౌరవనీయమైన వ్యక్తులలో ఒకరైన ఆయనకు పద్మశ్రీ దక్కడం సముచిత గౌరవం.
తెలుగు రాష్ట్రాల నుంచి ఇతర విజేతలు (2026) వివరాల్లోకి వెళితే, ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 11 మందికి పద్మశ్రీ పురస్కారాలు లభించాయి. విజేతలలో ముఖ్యమైన వారు:
*గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (మరణానంతరం): అన్నమయ్య సంకీర్తనలకు ప్రాణం పోసిన గాయకుడు.
*వెంపటి కుటుంబ శాస్త్రి: సాహిత్యం మరియు విద్యా రంగంలో చేసిన కృషికి.
*దీపికా రెడ్డి: కూచిపూడి నృత్య కళాకారిణి.
*డాక్టర్ నోరి దత్తాత్రేయుడు: ప్రసిద్ధ క్యాన్సర్ వైద్యుడు (వీరికి పద్మ భూషణ్ లభించింది).
*ఇదే ప్రకటనలో బాలీవుడ్ లెజెండరీ నటుడు ధర్మేంద్రకు మరణానంతరం పద్మ విభూషణ్, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టికి పద్మ భూషణ్ పురస్కారాలను కేంద్రం ప్రకటించింది.
