నేడు ఘనంగా పద్మ అవార్డుల రెండో విడత ప్రధానోత్సవం.. జాబితా ఇదే!
ఈ సాయంత్రం జరిగే రెండో విడత (సివిల్ ఇన్వెస్టిచర్) వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మొత్తం 65 మంది ప్రముఖులకు ఈ అవార్డులను అందించనున్నారు.
By: Madhu Reddy | 23 Jun 2026 2:34 PM ISTదేశంలోనే అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డుల ప్రధానోత్సవం దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా జరగనుంది. ఈ సాయంత్రం జరిగే రెండో విడత (సివిల్ ఇన్వెస్టిచర్) వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మొత్తం 65 మంది ప్రముఖులకు ఈ అవార్డులను అందించనున్నారు. ఇందులో సినిమా, క్రీడలు, సంగీత రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు ఎందరో రియల్ హీరోలు కూడా ఉన్నారు.
ఈ విడతలో 65 మందికి పురస్కారాలు:
రాష్ట్రపతి భవన్‌లోని గణతంత్ర మండపంలో జరిగే ఈ ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డుల ప్రధానం జరుగుతుంది. ఈ రెండో విడతలో మొత్తం 65 పద్మ అవార్డులను బహూకరిస్తారు. వీటిలో 2 పద్మ విభూషణ్, ఏడు పద్మ భూషణ్, 56 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. గత నెల మే లో జరిగిన మొదటి విడత వేడుకలో ఇప్పటికే 66 మందికి అవార్డులు అందించిన సంగతి తెలిసిందే.
అవార్డులు అందుకోనున్న ప్రముఖులు వీళ్లే:
ఈరోజు అవార్డులు అందుకునే వారిలో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సెలబ్రిటీలు ఉన్నారు. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, ప్రముఖ గాయని అల్కా యాగ్నిక్, టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృత్‌రాజ్ పద్మభూషణ్ పురస్కారాలు అందుకోనున్నారు. అలాగే, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, హాకీ ప్లేయర్ సవితా పునియా పద్మశ్రీ అవార్డులను రాష్ట్రపతి చేతుల మీదుగా స్వీకరించనున్నారు. ఇక వీరితో పాటు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కేటీ థామస్ పద్మవిభూషణ్ అందుకోనున్నారు.
2026 పద్మ అవార్డుల హైలైట్స్:
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మొత్తం 131 పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ జాబితాలో 5 పద్మ విభూషణ్, 13 పద్మ భూషణ్, 113 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. ఇక ఈసారి అవార్డుల జాబితాలో 19 మంది మహిళలు ఉండగా.. సమాజం కోసం విశేష సేవలు అందించి కన్నుమూసిన 16 మందికి మరణానంతరం ఈ పురస్కారాలను ప్రకటిస్తూ గౌరవించారు.
ఇక వివిధ రంగాల్లో విశేషంగా రాణించిన వారికి ఈ పురస్కారాలు అందించారు. ఒక పక్క మమ్ముట్టి, రోహిత్ శర్మ లాంటి స్టార్స్.. మరోపక్క గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం, విద్యను అందిస్తున్న ఎందరో రియల్ హీరోలు ఒకే వేదికపై ఈ అత్యున్నత పురస్కారాలు అందుకోవడం దేశానికే గర్వకారణం.
