పబ్లిసిటీ కోసం పాస్టర్ పాట్లు.. సీన్ లోకి పోలీసుల ఎంట్రీతో అడ్డంగా బుక్!
అల్లూరి జిల్లా పాడేరులో పాస్టర్ అభినయ్ దర్శన్ పై దాడి కేసులో పోలీసులు ఊహించని ట్విస్టు ఇచ్చారు.
By: Tupaki Political Desk | 20 May 2026 4:26 PM ISTఅల్లూరి జిల్లా పాడేరులో పాస్టర్ అభినయ్ దర్శన్ పై దాడి కేసులో పోలీసులు ఊహించని ట్విస్టు ఇచ్చారు. తనను ఏజెన్సీ వదిలి వెళ్లిపోవాలని మతోన్మాదులు బెదిరిపిస్తున్నారని కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్న పాస్టర్ అభినవ్ దర్శన్ మంగళవారం తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంటూ మరో వీడియో పెట్టాడు. అంతేకాకుండా తీవ్రగాయాలు అయ్యాయని, చికిత్స కోసం ఆస్పత్రిలో చేరుతున్నానని ఆ వీడియోలో వెల్లడించాడు. మతాలకు సంబంధించిన సున్నితమైన అంశం కావడంతో పోలీసులు వెంటనే రియాక్టు అయ్యారు. ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా వెనువెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించగా, సంచలన విషయాలు వెలుగుచూశాయి.
కడప జిల్లాకు చెందిన అభినవ్ దర్శన్ జనవరిలో అల్లూరి జిల్లాకు వచ్చాడని చెబుతున్నారు. పాస్టర్ గా స్థానికులతో పరిచయాలు పెంచుకున్న అతడు కొద్దిరోజులు ఏజెన్సీలో పాదయాత్ర చేశాడు. తర్వాత భరోసా పార్టీని ప్రారంభించాడు. ప్రస్తుతం అల్లూరి ఏజెన్సీలోని గూడెంకొత్తవీధి మండలం మొండిగెడ్డ పంచాయతీలోని నీరుతోటపాలెంలో నివసిస్తున్నాడు. అయితే ఏజెన్సీలో మత ప్రచారం చేస్తున్న అభినవ్ దర్శన్ ను గుర్తు తెలియని వ్యక్తులు బెదిరిస్తున్నారని 10 రోజుల క్రితం సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడని చెబుతున్నారు. ఏజెన్సీ వదిలి వెళ్లిపోవాలని కొందరు ఫోన్ లో బెదిరించారని ఆడియో రికార్డును పోస్టు చేశాడు. దీంతో ఏజెన్సీలో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారిందని అంటున్నారు.
ఈ పరిస్థితుల్లో మంగళవారం సాయంత్రం పాస్టర్ అభినవ్ దర్శన్ పై కొందరు దుండగులు దాడి చేసినట్లు, ఆ దాడిలో అభినవ్ తీవ్రంగా గాయపడగా, కొందరు మహిళలు ఏడుస్తూ పాస్టర్ ను రక్షించాలని ప్రాధేయపడినట్లు వీడియోలు బయటకు వచ్చాయని అంటున్నారు. అంతేకాకుండా దాడిలో గాయపడ్డానని అభినవ్ ఓ ఆస్పత్రిలో చేరాడని చెబుతున్నారు. దీంతో పోలీసులు ఆస్పత్రికి వెళ్లి విచారణ ప్రారంభించగా, అసలు గుట్టురట్టు అయిందని అంటున్నారు. దాడిపై ముందుగా అభినవ్ దర్శన్ అనుచరులను విచారించగా, అభినవ్ తనపై తానే దాడి జరిగేలా ప్లాన్ చేసినట్లు వారు వెల్లడించారని పోలీసులు చెబుతున్నారు. గిరిజనులలో సానుభూతి, ప్రచారం కోసం పాస్టర్ అభినవ్ దర్శన్ ఇలా ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు.
తనపై దాడికి ముగ్గురు వ్యక్తులను నియమించుకున్న అభినవ్ దర్శన్ ఏవిధంగా ఎప్పుడు, ఎక్కడ దాడి చేయాలో ముందుగా వారికి వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ ద్వారా తెలియజేశాడని పోలీసుల విచారణలో వెల్లైందని అంటున్నారు. దాడి సమయంలో కారులో అభినయ్ తోపాటు ముగ్గురు అనుచరులు కూడా ఉన్నారు. వీరు ముగ్గురు దాడి ఘటనను వీడియోలో చిత్రీకరించి ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్టు చేయాలని ప్లాన్ చేసుకున్నట్లు చెబుతున్నారు. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడటంతో అభినవ్, అతడి అనుచరులను అరెస్టు చేసినట్లు పోలీసులు ప్రకటించారు.
