ఓటీటీ షార్ట్ విండోస్ ట్రెండ్‌పై ఇండస్ట్రీ యుద్ధం చేయాల్సిందే!
చలనచిత్ర పరిశ్రమలో తొలి వారం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడం అత్యంత కీలకమైందే. ఒకప్పటిలా 50 రోజులు..100 రోజులు థియేటర్లో సినిమా ఆడే పరిస్థితి లేదు.
By: Srikanth Kontham | 3 Oct 2026 7:00 AM ISTచలనచిత్ర పరిశ్రమలో తొలి వారం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడం అత్యంత కీలకమైందే. ఒకప్పటిలా 50 రోజులు..100 రోజులు థియేటర్లో సినిమా ఆడే పరిస్థితి లేదు. కాబట్టి రిలీజ్ సమయంలోనే వీలైనన్ని ఎక్కువ థియేటర్లో రిలీజ్ చేసి పెట్టుబడి సహా లాభాలు రాబాట్టాలన్నది ప్లాన్. కానీ ఇలా అన్ని సినిమాలకు..అన్ని వేళలా సాధ్య పడదన్నది అంతే వాస్తవం. ఏ సినిమా అయితే నెమ్మదిగా ప్రారంభమవుతుందో? ఆ చిత్రానికి మంచి మౌత్ టాక్ తోడైతే రెండు..మూడు వారాల్లో కూడా సినిమాలు పుంజుకుంటున్నాయి. అయితే ఇలా సినిమా నిలదొక్కు కోవడానికి లభించే వెసులుబాటు క్రమంగా కనుమరుగైపోతుందా? అన్న వాదన బలంగా తెరపైకి వస్తోంది.
ఈ దుస్థితికి ప్రధాన కారణం థియేట్రికల్ విడుదలకు- ఓటీటీ స్ట్రీమింగ్‌కు మధ్య ఉన్న గ్యాప్ వేగంగా తగ్గిపోవడమే. కేవలం నాలుగు వారాల డిజిటల్ విండో వ్యవధి అనేది తెలుగు పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. సినిమాలు డిజిటల్ మాధ్యమాల్లోకి వెళ్లే ముందు థియేటర్లలో సరైన రన్ దక్కించుకోవాలని ఎగ్జిబిటర్లు, ఇతర వర్గాలు గట్టిగా కోరుతున్నా? అనూహ్య మార్పు థియేట్రికల్ బిజినెస్‌ను తీవ్రంగా దెబ్బతీస్తోంది.
ఈ షార్ట్ విండోస్ విధానం వల్ల మొదటి రోజే భారీ వసూళ్లు సాధించలేని కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాల పరిస్థితి దయనీయంగా మారుతోంది. రివ్యూలు, మౌత్ టాక్ , రిపీట్ ఆడియన్స్ పై ఆధారపడి మెల్లగా పుంజుకోవాల్సిన చిత్రాలకు తగిన సమయం దొరకడం లేదు. సినిమా కొన్ని వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తుందని ప్రేక్షకుడికి ముందే తెలిసినప్పుడు, థియేటర్ టికెట్ ఖర్చు పెట్టి వెళ్లే కంటే కొద్ది రోజులు వేచి చూద్దాం అనే ధోరణి పెరుగుతోంది.
మరోవైపు నిర్మాతలు పెట్టుబడులను తిరిగి రాబట్టుకోవడానికి డిజిటల్ డీల్స్‌పై ఆధారపడాల్సి వస్తోంది. అయితే ఈ ధోరణి ఇలాగే కొనసాగితే థియేట్రికల్ బిజినెస్ పూర్తిగా తొలి రోజుల వసూళ్లపైనే ఆధారపడే ఫ్రంట్-లోడెడ్ వ్యవస్థగా మారిపోతుంది. ఓటీటీల కోసం ప్రేక్షకులు వేచి చూస్తారనే భయం కంటే మంచి సినిమా నెమ్మదిగా కోలుకోవడానికి కూడా అవకాశాలు లేకుండా పోతుండటమే ఇండస్ట్రీని కలవరపెడుతున్న అసలు సమస్య.
ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో చిత్ర పరిశ్రమకు పెద్ద ప్రమాదమే పొంచి ఉంది. ఓటీటీల జోరును అణచివేయకపోతే నిర్మాతల మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. ఈ విషయంలో తెలుగు చిత్ర పరిశ్రమలోని నిర్మాతలందరూ ఒకే తాటిపైకి వచ్చి కఠినమైన నిర్ణయాలు తీసుకోకపోతే కష్టం. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు సినిమాలను శాసించే స్థాయికి వెళ్లకూడదు. సినిమానే ఓటీటీని శాసించేలా నిర్మాతలు తమ సత్తాను చాటాల్సిన సమయం ఆసన్నమైంది.
ఓటీటీల చేతిలో నిర్మాతలు కీలుబొమ్మలుగా మారకూడదంటే కేవలం సినిమాలు తెరకెక్కించడం మాత్రమే ముఖ్యం కాదు. ఆ చిత్రాన్ని థియేటర్లలో అత్యంత బలంగా విడుదల చేసే సత్తా ఓటీటీలో సినిమా ఎప్పుడు స్ట్రీమ్ కావాలనే డిసైడ్ చేసే గుండెధైర్యం నిర్మాతకు ఉండాలి. పరిశ్రమను నిలబెట్టే ఆ ఆర్థిక శక్తి, ఆత్మగౌరవం మళ్లీ నిర్మాత చేతికే వచ్చేలా పటిష్టమైన విధానాలు రావాలి. అప్పుడే సినిమా బతుకుతుంది. థియేటర్ వ్యవస్థ మనుగడ సాగిస్తుంది.
