ఓటీటీల్లో యాడ్స్ గోల.. అసలు సమస్య ఎక్కడ?
ఒకప్పుడు కేబుల్ టీవీల్లో ప్రతీ ఐదు నిమిషాలకు వచ్చే యాడ్స్ చూడలేకే జనాలు ఓటీటీల వైపు షిఫ్ట్ అయ్యారు.
By: M Prashanth | 1 July 2026 10:54 AM ISTఒకప్పుడు కేబుల్ టీవీల్లో ప్రతీ ఐదు నిమిషాలకు వచ్చే యాడ్స్ చూడలేకే జనాలు ఓటీటీల వైపు షిఫ్ట్ అయ్యారు. ప్రశాంతంగా నచ్చిన సినిమాను, సిరీస్ ని ఎలాంటి బ్రేక్స్ లేకుండా చూడొచ్చని నెలనెలా ప్రీమియం అమౌంట్ కట్టడం స్టార్ట్ చేశారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. అమెజాన్ ప్రైమ్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు కూడా సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్లకు యాడ్స్ చూపించడం మొదలుపెట్టాయి. దీంతో చాలా దేశాల్లో యూజర్లు విసిగిపోయి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.
అసలు ఓటీటీలు ఇలా కస్టమర్ల జేబులకు చిల్లు పెడుతూ యాడ్స్ వైపు మళ్ళడం వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీని వెనుక ఉన్న ఫైనాన్షియల్ యాంగిల్ చూస్తే అసలు మ్యాటర్ అర్థమవుతుంది. ప్రస్తుతం ఓటీటీల మధ్య కాంపిటీషన్ విపరీతంగా పెరిగిపోయింది. ఒకరిని మించి మరొకరు భారీ బడ్జెట్ తో ఒరిజినల్ సిరీస్ లు, క్రేజీ సినిమాల డిజిటల్ రైట్స్ కొంటున్నారు.
వందల కోట్లు పెట్టి కంటెంట్ తయారు చేయడం ప్రొడక్షన్ పరంగా వాళ్లకు భారీ ఖర్చుతో కూడుకున్న పని. కేవలం యూజర్లు కట్టే నెలవారీ సబ్స్క్రిప్షన్ అమౌంట్ తో ఈ భారీ బడ్జెట్ ఖర్చులు వెనక్కి రావడం లేదు. దాంతో ఈ నష్టాలను కవర్ చేసుకోవడానికి ఓటీటీలు యాడ్స్ చూపించడమే సేఫ్ రూట్ అని ఫిక్స్ అయిపోయాయి. ఇలాంటి టైమ్ లో నెట్‌ఫ్లిక్స్ స్ట్రాటజీని కూడా గమనించాలి. గ్లోబల్ మార్కెట్ లో నెట్‌ఫ్లిక్స్ కొన్ని దేశాల్లో తక్కువ ధరకే యాడ్స్ ఉండే ప్లాన్స్ తెచ్చిన మాట నిజమే. కానీ ఇండియాలో మాత్రం ఇప్పటివరకు ఎలాంటి యాడ్స్ లేకుండా ప్యూర్ ఎంటర్టైన్మెంట్ ఇస్తూ తమ బ్రాండ్ వాల్యూని కాపాడుకుంటున్నారు
మిగతా ఓటీటీలు సబ్స్క్రిప్షన్ రేట్లు పెంచుతూ, మధ్యలో యాడ్స్ తో విసిగిస్తుంటే, నెట్‌ఫ్లిక్స్ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రీమియం ఎక్స్పీరియన్స్ ఇవ్వడం దానికదే బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అవుతుంది. యాడ్స్ గోల నచ్చని యూజర్స్ అంతా మెల్లగా నెట్‌ఫ్లిక్స్ వైపు షిఫ్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అమెజాన్ లాంటి ప్లాట్‌ఫామ్స్ అదనంగా డబ్బులు కడితేనే యాడ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ ఇస్తామని రూల్స్ పెట్టడం కస్టమర్ల సైకాలజీతో ఆడుకోవడమే. బేసిక్ ప్లాన్ లో బలవంతంగా యాడ్స్ నెట్టేసి, అవి వద్దనుకుంటే ఎక్స్ట్రా బాదడం అనేది యూజర్లను ఇబ్బంది పెట్టే విషయమే.
దీనివల్ల లాభాల కంటే కస్టమర్లలో నెగిటివిటీ పెరిగే ఛాన్స్ ఉంది. మరికొందరు యూజర్లు విసుగు వచ్చి అకౌంట్స్ కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నారు. మరోవైపు చూస్తే, ఓటీటీల ఖర్చులు కూడా రోజురోజుకూ పెరుగుతున్నాయి. గ్లోబల్ ఆడియన్స్ ని సాటిస్ఫై చేయాలంటే విజువల్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండాలి. ఆ క్వాలిటీ కోసం పెట్టే పెట్టుబడికి, కస్టమర్ ఇచ్చే చిన్న మొత్తానికి ఎక్కడా సింక్ అవ్వడం లేదు. అందుకే కంపెనీలు ఇలాంటి నయా దందాలకు తెరతీస్తున్నాయి. కంటెంట్ కాస్ట్ పెరగడం నిజమే అయినా, దాన్ని కస్టమర్ల మీద రుద్దడం ఎంతవరకు కరెక్ట్ అనేది అసలు ప్రశ్న.
