హీరోల పారితోషికానికి ఓటీటీ కత్తెర
నిజానికి, ఇప్పుడు ఓటీటీ సంస్థలు స్టార్ హీరోల కన్నా కూడా యూనిక్ కంటెంట్ ఉన్న చిన్న సినిమాలపైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నాయి.
By: M Prashanth | 9 Oct 2025 10:20 AM ISTసౌత్ ఇండియన్ సినీ పరిశ్రమలో ఇప్పుడు ఓ పెద్ద చాలెంజ్ మొదలైనట్లు టాక్ వినిపిస్తోంది. ఒకప్పుడు నిర్మాతల జేబులు నింపిన ఓటీటీ డీల్స్, ఇప్పుడు వారికి పెనుభారంగా మారుతున్నాయి. ముఖ్యంగా, మార్కెట్‌ను పూర్తిగా శాసించే స్టార్ హీరోల రెమ్యునరేషన్ విషయంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అడ్డం తిరుగుతున్నాయి. స్టార్ పవర్ ఉన్నా సరే, భారీ రేట్లు చెల్లించడానికి అవి అస్సలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు.
గత ఐదేళ్లలో ఓటీటీ ఎఫెక్ట్ వల్ల మన ఇండస్ట్రీలో సినిమా బడ్జెట్‌లు, హీరోల పారితోషికాలు డబుల్ అయ్యాయి. ఓటీటీ రైట్స్ అమ్ముకుంటే చాలు, రిజల్ట్‌తో సంబంధం లేకుండా బడ్జెట్ రికవరీ అవుతుందనే ధీమాతోనే ఈ పెరుగుదల కొనసాగింది. కానీ, ఇప్పుడు నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్ స్టార్ వంటి పెద్ద సంస్థలు తమ పాత డీల్స్‌ను రద్దు చేసి, కొత్త కఠిన నిబంధనలు తీసుకొస్తున్నాయి.
నిజానికి, ఇప్పుడు ఓటీటీ సంస్థలు స్టార్ హీరోల కన్నా కూడా యూనిక్ కంటెంట్ ఉన్న చిన్న సినిమాలపైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నాయి. దీనికి కారణం.. పెద్ద సినిమాలు థియేటర్లలో ఫెయిల్ అయితే, వాటికి భారీగా చెల్లించిన డబ్బు వృథా అవుతోంది. అందుకే, అడ్వాన్స్ డీల్స్ పూర్తిగా ఆపేసి, కేవలం 2024లో ఇచ్చిన రేట్ల కంటే 50% తక్కువకే కొనుగోలు చేస్తామంటున్నాయి. దీనివల్ల పెద్ద హీరోల సినిమాల బడ్జెట్ రికవరీ కష్టమై, అది వారి పారితోషికంపై ప్రభావం చూపించడం ఖాయం.
ఈ మార్పులన్నీ చిన్న సినిమాలకు మొదట్లో ఊరటనిచ్చినా, ఇప్పుడు వారికి కూడా ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. ఇకపై ఓటీటీలో అమ్ముకోవాలంటే, సినిమా రిలీజైన తొలి 25 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ తప్పనిసరిగా సర్టిఫైడ్ CA ద్వారానే ఇవ్వాలనే కొత్త రూల్ వచ్చింది. సోషల్ మీడియా లేదా ఫ్యాన్స్ ఇచ్చే లెక్కలకు నో చెప్పింది. ఇంకో షాకింగ్ రూల్ ఏమిటంటే, అనుకున్న కలెక్షన్ల కంటే తక్కువ వస్తే, డీల్ మొత్తాన్ని తగ్గించుకునే అధికారం ఓటీటీకి ఉంటుంది.
అంతేకాదు, గతంలో మాదిరిగా ఫుల్ పేమెంట్ వెంటనే ఇవ్వకుండా, సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన 60 రోజుల తర్వాతే ఫైనల్ సెటిల్‌మెంట్ చేస్తామని చెబుతున్నాయి. దీంతో ప్రొడ్యూసర్‌కు డబ్బు కోసం వెయిటింగ్ టైం పెరిగింది.
మొత్తంగా, ఈ కొత్త ఓటీటీ గేమ్‌ప్లాన్ ఇండస్ట్రీలో ఒక హాట్ డిస్కషన్ గా మారింది. ఈ మార్పుల వల్ల సినిమా బడ్జెట్‌లు అదుపులోకి వస్తాయా లేదా నిర్మాతలు పాత బకాయిలతో, కొత్త రూల్స్‌తో ఇబ్బంది పడతారా అనేది చూడాలి. ఓటీటీ మార్కెట్ తగ్గుతుందంటే, దాని ప్రభావం కచ్చితంగా హీరోల రెమ్యునరేషన్లపైనే మొదట పడుతుంది.
