మూవీ రికార్డులను ఓటీటీ ఒప్పందం అడ్డుకుంటోందా?
ఈ ఏడాది తెలుగులో అత్యంత ఆదరణ పొందిన సినిమాల్లో 'ఇరుముడి' ఒకటి. నైజాంలో ఏకంగా రూ.95 కోట్ల గ్రాస్ వసూలు చేసి రికార్డుల దిశగా దూసుకెళ్లింది.
By: Madhu Reddy | 19 Sept 2026 10:00 PM ISTసినిమా థియేటర్లలో ఎంత పెద్ద హిట్ అయినా, మైలురాళ్లను చేరుకోవడంలో ఓటీటీ ఒప్పందాలు ఇప్పుడు ప్రధాన అడ్డంకిగా మారుతున్నాయా? ఇటీవల బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించిన 'ఇరుముడి' చిత్రం నైజాంలో రూ.100 కోట్ల గ్రాస్ మార్కును సాధించలేకపోవడానికి కారణం ఇదేనని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. కేవలం రూ.95 కోట్ల వద్దే ఆగిపోయిన ఈ సినిమా ఓటీటీలోకి త్వరగా రావడం వల్లే ఆ అరుదైన రికార్డును మిస్ చేసుకుంది. అసలు ఓటీటీల ప్రభావం సినిమాల లాంగ్ రన్ పై ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
'ఇరుముడి' మిస్ చేసుకున్న అరుదైన రికార్డు:
ఈ ఏడాది తెలుగులో అత్యంత ఆదరణ పొందిన సినిమాల్లో 'ఇరుముడి' ఒకటి. నైజాంలో ఏకంగా రూ.95 కోట్ల గ్రాస్ వసూలు చేసి రికార్డుల దిశగా దూసుకెళ్లింది. అయితే రూ.100 కోట్ల మైలురాయిని అందుకోవడానికి మరో రూ.5 కోట్లు మాత్రమే కావాల్సిన సమయంలో సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఇక దీంతో థియేటర్లకు వెళ్లే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోయి, ఆ అరుదైన మైలురాయిని సినిమా చేజార్చుకోవాల్సి వచ్చింది.
4 వారాల ఒప్పందాలు - తగ్గుతున్న లాంగ్-రన్:
ఒకప్పుడు సినిమాలు థియేటర్లలో 50 రోజులు, 100 రోజులు ఆడుతూ లాంగ్ రన్ రికార్డులు క్రియేట్ చేసేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు పెద్ద హీరోల సినిమాలు సైతం విడుదలైన 4 వారాల్లోనే ఓటీటీ వేదికలపై స్ట్రీమింగ్ అయ్యేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఇక దీనివల్ల రెండు మూడు వారాలకే థియేటర్లలో సినిమాల రన్ ముగిసిపోతోంది.
ప్రేక్షకుల్లో మారిన ఆలోచన విధానం:
ఓటీటీ రిలీజ్‌లు త్వరగా ఉండటం వల్ల ప్రేక్షకుల ఆలోచనా విధానంలో కూడా మార్పు వచ్చింది. ఒకవేళ సినిమాకు మొదటి రోజే మిశ్రమ స్పందన వస్తే, సామాన్య ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడానికి ఇష్టపడటం లేదు. "ఎలాగూ నెల రోజుల్లో ఓటీటీలోకి వచ్చేస్తుంది కదా, ఇంట్లోనే హాయిగా చూసుకోవచ్చు" అని ఆగిపోతున్నారు.
డిస్ట్రిబ్యూటర్లకు తప్పని నష్టాలు:
ఈ ధోరణి వల్ల యావరేజ్ లేదా బిలో యావరేజ్ సినిమాలకు రావాల్సిన మినిమం కలెక్షన్లు కూడా బాక్సాఫీస్ దగ్గర రావడం లేదు. సినిమాలు రికార్డులు సాధించడం అటుంచితే, అసలు పెట్టిన పెట్టుబడి కూడా రాక డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇక నిర్మాతలు మాత్రం తమ బడ్జెట్ రికవరీ కోసం ఈ త్వరిత ఓటీటీ ఒప్పందాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు అన్న వాదన వుంది.
ఎగ్జిబిటర్ల డిమాండ్:
ఈ సమస్య నుంచి థియేట్రికల్ బిజినెస్‌ను కాపాడుకోవడానికి సౌత్ ఇండియన్ ఎగ్జిబిటర్లు ఒక కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. సినిమా థియేటర్లలో విడుదలయ్యాక కనీసం 8 వారాల వరకు ఎలాంటి ఓటీటీలోనూ స్ట్రీమింగ్ చేయకూడదని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక దీనివల్ల ప్రేక్షకులు మళ్లీ థియేటర్లకు వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
పరిశ్రమ మనుగడకు ఓటీటీ సంస్థలు ఇచ్చే డిజిటల్ రైట్స్ నిధులు ఎంత అవసరమో, థియేటర్ల లాంగ్-రన్ కూడా అంతే ముఖ్యం. ఇక నిర్మాతలు ఓటీటీ ఆదాయంతో పాటు థియేట్రికల్ కలెక్షన్లను కూడా దృష్టిలో ఉంచుకుని సరైన సమయానికి డిజిటల్ రిలీజ్ ప్లాన్ చేస్తేనే సినిమాలకు రావాల్సిన రికార్డులు, కలెక్షన్లు పూర్తిగా దక్కుతాయి అంటున్నారు విశ్లేషకులు..
