టాలీవుడ్ బడ్జెట్‌లను మార్చేసిన డిజిటల్ మార్కెట్!
కోవిడ్ మహమ్మారి తర్వాత ప్రపంచవ్యాప్తంగా వినోద రంగం స్వరూపమే మారిపోయింది. ముఖ్యంగా ఓటిటి ప్లాట్ ఫారమ్‌ల విస్తరణ ఊహించని స్థాయికి చేరుకుంది.
By: Srikanth Kontham | 11 Jun 2026 11:00 PM ISTకోవిడ్ మహమ్మారి తర్వాత ప్రపంచవ్యాప్తంగా వినోద రంగం స్వరూపమే మారిపోయింది. ముఖ్యంగా ఓటిటి ప్లాట్ ఫారమ్‌ల విస్తరణ ఊహించని స్థాయికి చేరుకుంది. థియేటర్లకు వెళ్లే పరిస్థితి లేని సమయంలో ప్రేక్షకులకు ఓటిటి ఏకైక ప్రత్యామ్నాయంగా మారింది. ఈ క్రేజ్‌ను గమనించిన డిజిటల్ సంస్థలు భారీ ధరలకు సినిమాల హక్కులను కొనుగోలు చేయడం ప్రారంభించాయి. ఈ డిజిటల్ విప్లవం సినిమా పరిశ్రమకు కొత్త ఆదాయ మార్గాలను తెరిచినప్పటికీ మరోవైపు చిత్ర నిర్మాణ వ్యయాన్ని భారీగా పెంచడానికి ప్రధాన కారణమైంది. ఓటిటి రైట్స్ రూపంలో ముందే భారీ ఆదాయం గ్యారెంటీ అనే నమ్మకంతో నిర్మాతలు వెనకాడకుండా ఖర్చు చేయడం మొదలుపెట్టారు.
దీని ప్రభావం నేరుగా హీరోలు, దర్శకుల రెమ్యునరేషన్లపై పడింది. తమ మార్కెట్ వాల్యూ పెరిగిందంటూ స్టార్స్ డిమాండ్ చేస్తున్న పారితోషికాలు సినిమా బడ్జెట్‌ను అమాంతం పెంచేస్తున్నాయి. గతంలో వంద కోట్ల బడ్జెట్ అంటే అదొక భారీ విజువల్ వండర్ లేదా పాన్ ఇండియా సినిమా అనే భావన ఉండేది. కానీ నేడు పరిస్థితి మారిపోయింది. కేవలం మీడియం రేంజ్ హీరోల సినిమాలకే వంద కోట్ల మార్కు దాటుతోంది. ఇక చిన్న సినిమాలు సైతం కనీస నాణ్యతతో నిర్మించాలన్నా 15 నుండి 20 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టక తప్పని పరిస్థితి ఏర్పడింది.
అయితే ఎల్లకాలం ఒకేలా ఉండదనే చందంగా ఓటిటి సంస్థలు ఇప్పుడు తమ వ్యూహాలను మార్చుకుంటున్నాయి. విచ్చలవిడిగా హక్కులను కొనుగోలు చేసిన సబ్‌స్క్రిప్షన్ ప్లాట్‌ఫారమ్‌లు.. ప్రస్తుతం లాభనష్టాల లెక్కలు చూసుకుంటున్నాయి. ఇందుకోసం తమ అంతర్గత నిబంధనలను, కొనుగోలు పాలసీలను తరచూ మారుస్తున్నాయి. థియేట్రికల్ రన్, వ్యూయర్‌షిప్ ఆధారంగానే రేట్లు చెల్లిస్తామనే షరతులు విధిస్తున్నాయి. ఈ మార్పుల వల్ల డిజిటల్ మార్కెట్‌లో ఒక్కసారిగా మందగమనం ఏర్పడింది. ఒకప్పుడు సినిమా మొదలవ్వకముందే జరిగిపోయే బిజినెస్ డీల్స్ ఇప్పుడు క్లైమాక్స్ దశకు వచ్చినా తెగడం లేదు.
డిజిటల్ హక్కుల వ్యాపారం సజావుగా సాగకపోవడంతో నిర్మాతలు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ముందస్తు బిజినెస్ డీల్స్ పూర్తికాకుండా ఆశించిన స్థాయిలో అడ్వాన్స్‌లు రాకుండా షూటింగ్ షెడ్యూల్స్‌ను ముందుకు తీసుకెళ్లడం మేకర్స్‌కు కష్టతరంగా మారుతోంది. బడ్జెట్ రికవరీపై స్పష్టత లేకపోవడంతో కీలకమైన షూటింగ్ ప్లాన్స్, చివరికి సినిమా విడుదల తేదీలను కూడా ఖరారు చేయలేక సతమతమవుతున్నారు. ఎంతటి క్రేజీ ప్రాజెక్ట్ అయినా, వెనుక డిజిటల్ సపోర్ట్ బలంగా లేకపోతే అడుగు ముందుకు వేయలేని అనిశ్చితి పరిశ్రమలో నెలకొంది.
ఈ డిజిటల్ మార్కెట్ సంక్షోభం కేవలం చిన్న, మధ్యతరహా చిత్రాలకే పరిమితం కాలేదు. టాలీవుడ్‌లో మోస్ట్ అవేటెడ్ చిత్రాలుగా ప్రచారం పొందుతున్న భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌లు సైతం ఈ ప్రభావానికి గురవుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. ఓటిటి డీల్స్‌లో వస్తున్న మార్పులు, వ్యాపార లావాదేవీల్లో నెలకొన్న జాప్యం వల్ల ఈ చిత్రాల ప్రణాళికలు కూడా ప్రభావితమవుతున్నాయి. ఎంతటి అగ్ర నటులు, దర్శకులు ఉన్నప్పటికీ ప్రస్తుత డిజిటల్ మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకుని బడ్జెట్‌ను మేనేజ్ చేయడం నిర్మాతలకు కత్తిమీద సాములా మారింది.
సినిమా ఆలస్యమవ్వడానికి వ్యాపారాలే కారణం కాదు. ప్రొడక్షన్ ప్లానింగ్ లోపాలు కూడా తోడవుతున్నాయి. వాస్తవానికి 50 రోజుల్లో పూర్తి కావాల్సిన షూటింగ్ షెడ్యూల్స్, వివిధ కారణాల వల్ల 100 రోజులకు పైగా సాగుతున్నాయి. షూటింగ్ రోజులు పెరిగే కొద్దీ నటీనటుల డేట్స్, రోజువారీ ప్రొడక్షన్ ఖర్చులు, సాంకేతిక నిపుణుల వేతనాలు డబుల్ అవుతాయి. దీనికి తోడు తెచ్చిన పెట్టుబడులపై వడ్డీల భారం పెరిగిపోతుంది. ఈ విధంగా కాలయాపన వల్ల పెరిగే బడ్జెట్ అంతిమంగా నిర్మాతలను కోలుకోలేని దెబ్బతీస్తోంది. ఓటిటి మార్కెట్ నమ్ముకుని బడ్జెట్ పెంచేసి తీరా షూటింగ్ ఆలస్యమైతే మార్కెట్ మందగిస్తే సినిమాను సేఫ్ జోన్‌కు తీసుకురావడం అసాధ్యంగా మారుతోంది.
