Begin typing your search above and press return to search.

సినిమా మేకింగ్‌నే మార్చేస్తున్న ఓటీటీ డీల్స్‌

ఏడాది క్రితం వరకు సినిమా ఇండస్ట్రీకి ఓటీటీ అనేది పెద్ద వరం అన్నట్లు ఉండేది.

By:  Ramesh Palla   |   9 Sept 2026 12:16 PM IST
సినిమా మేకింగ్‌నే మార్చేస్తున్న ఓటీటీ డీల్స్‌
X

ఏడాది క్రితం వరకు సినిమా ఇండస్ట్రీకి ఓటీటీ అనేది పెద్ద వరం అన్నట్లు ఉండేది. పెద్ద హీరోల, మీడియం రేంజ్ హీరోల సినిమాల బడ్జెట్‌ల్లో దాదాపు సగానికి పైగా ఓటీటీ రైట్స్ ద్వారా వచ్చేవి. కొన్ని సినిమాలకు పెట్టిన బడ్జెట్‌ మొత్తం ఓటీటీ రైట్స్‌ను అమ్మడం ద్వారా వచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఓటీటీ రైట్స్‌కు భారీ రేటు పలుకుతూ ఉండటంతో హీరోలకు నిర్మాతలు పారితోషికం భారీగా పెంచి ఇవ్వడం జరిగింది. హీరోల డిమాండ్‌ను బట్టి ఓటీటీ సంస్థలు సినిమాలను కొనుగోలు చేసిన నేపథ్యంలో వారి పారితోషికాల్లో అనూహ్యమైన మార్పులు వచ్చాయి. ఒక వైపు థియేటర్‌ మార్కెట్‌ భారీగా తగ్గినా ఓటీటీలపై నమ్మకంతో నిర్మాతలు పెద్ద ఎత్తున ఖర్చు చేసి, హీరోలకు భారీ పారితోషికం ఇచ్చి సినిమాలను నిర్మించారు. రెండు మూడు ఏళ్లు నిర్మాతలు పూర్తిగా ఓటీటీలపై ఆధారపడి సినిమాలు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. ఓటీటీ బబుల్‌ బ్లాస్ట్‌ అయింది.

ఓటీటీ సంస్థల కండీషన్స్‌...

స్టార్ హీరోల సినిమాల నుంచి చిన్న హీరోల సినిమాల వరకు ఓటీటీ సంస్థలు కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నాయి. కానీ వారు ఇచ్చే అమౌంట్‌ విషయంలో చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. వందల కోట్ల రూపాయల నుంచి పదుల కోట్లకు తగ్గి పోయింది. భారీ క్రేజ్ ఉన్న స్టార్‌ హీరోల సినిమాలకు ఇప్పటికి కూడా ప్రముఖ ఓటీటీలు వంద కోట్లు, అంతకు మించి ఇచ్చేందుకు రెడీగా ఉన్నాయి. అందుకు చాలా కండీషన్స్ పెడుతున్నారు. ముఖ్యంగా విడుదల తేదీ విషయంలో తాము చెప్పినట్లు వినాల్సిందే అని ఓటీటీ సంస్థలు కండీషన్స్‌లో పేర్కొంటున్నారు. ఒప్పందం సమయంలో చెప్పిన డేట్‌కి సినిమాను విడుదల చేయలేకుంటే ఆ ఒప్పందం క్యాన్సల్‌ కావడం లేదా, అమౌంట్‌ చాలా తగ్గించడం వంటివి చేస్తున్నారు. దాంతో సినిమాను ఓటీటీ డీల్ కు అనుగుణంగా రిలీజ్ చేయడం కోసం చివరి నిమిషంలో మేకర్స్ హడావిడి చేస్తున్నారు. దాంతో సినిమా ఫైనల్‌ ఔట్‌పుట్‌ పై తీవ్రమైన ప్రభావం పడుతుందని చాలా మంది అంటున్నారు.

భారీ బడ్జెట్‌ సినిమాలతో థియేటర్లలో...

ఒక స్టార్‌ హీరో సినిమా లేదా ఒక మీడియం రేంజ్ హీరో సినిమా మొదలు కాగానే నిర్మాతలు ఓటీటీ డీల్‌ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఓటీటీ సంస్థ వారు కథ విని, కాంబినేషన్‌ వర్కౌట్‌ అవుతుందా అనేది చూసి, అన్ని విధాలుగా చర్చలు జరిపి రేటును నిర్ణయించడం జరుగుతుంది. ఒక వేళ ఓటీటీ డీల్‌ సెట్‌ అయ్యి, భారీ అమౌంట్‌ ను సదరు సంస్థ ఆఫర్‌ చేస్తే నిర్మాత ఫ్రీ హ్యాండ్ దక్కినట్టుగా విచ్చలవిడిగా ఖర్చు చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఓటీటీ ద్వారా వచ్చే అమౌంట్‌ కు తన వద్ద ఉన్న అమౌంట్‌ కలిపి బడ్జెట్‌ పరిమితి లేకుండా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అంతే కాకుండా ప్రమోషన్స్‌ సైతం భారీగా ఖర్చు చేసి చేయడం జరుగుతుంది. ఓటీటీ డీల్‌ ముందే సెట్‌ కావడం, భారీ అమౌంట్‌ ఆఫర్‌ రావడంతో దర్శక నిర్మాతలు మొత్తం ఫిల్మ్‌ మేకింగ్‌ను మార్చేస్తున్నారు. చిన్న సినిమాలకు ఓటీటీ డీల్‌ కాకుంటే లో బడ్జెట్‌లో చేసుకుంటున్నారు.

రూ.150 కోట్ల ఓటీటీ డీల్‌ క్యాన్సల్‌..

మొత్తానికి ప్రస్తుతం ఓటీటీ సంస్థలు సినిమాల మేకింగ్‌ స్టైల్‌ను సైతం మార్చేస్తున్నాయి. ఇప్పటికే సినిమా రిలీజ్ తేదీలను ఖరారు చేస్తున్న ఓటీటీ సంస్థలు ముందు ముందు ఇంకా ఎలాంటి కండీషన్స్ పెడుతాయో చూడాలి. ఓటీటీ అమౌంట్‌కి అలవాటు పడ్డ నిర్మాతలు ఇప్పుడు వారి నుంచి బయట పడలేని పరిస్థితి. అంతే కాకుండా పెంచిన పారితోషికం ను హీరోలు తగ్గించలేని పరిస్థితి నెలకొంది. సినిమాలు విడుదల కాకముందే ఓటీటీ డీల్స్ చేయకుంటే పెద్ద నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. ఇటీవల వచ్చిన ఒక సినిమాకు ఏకంగా రూ.150 కోట్లను ఓటీటీ సంస్థ ఆఫర్‌ చేసింది, కాని కొన్ని కారణాల వల్ల విడుదలకు ముందు ఆ డీల్‌ సెట్‌ కాలేదు. ఫలితం తారుమారు కావడంతో ఇప్పుడు అదే సినిమాకు సదరు ఓటీటీ కేవలం రూ.30 కోట్లు మాత్రమే ఇస్తానంటుందని తెలుస్తోంది. అది కూడా ఇప్పటి వరకు కన్ఫర్మ్‌ కాలేదు. అందుకే ఓటీటీల కోసం సినిమాలు తీసే పరిస్థితి నెలకొందని ఇండస్ట్రీ వర్గాల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.