ఓటీటీ రేట్లు.. ఇప్పటికైనా ప్లాన్ మార్చడమే మంచిదా?
ఒకప్పుడు సినిమా నిర్మాణంలో ఓటీటీ డీల్స్.. నిర్మాతలకు పెద్ద రిలీఫ్ ఇచ్చేవి. సినిమా విడుదలకు ముందే డిజిటల్ రైట్స్ ద్వారా భారీ మొత్తాలు రావడంతో బడ్జెట్ లో ఎక్కువ భాగం తిరిగి వచ్చేది.
By: M Prashanth | 15 Jun 2026 9:00 PM ISTఒకప్పుడు సినిమా నిర్మాణంలో ఓటీటీ డీల్స్.. నిర్మాతలకు పెద్ద రిలీఫ్ ఇచ్చేవి. సినిమా విడుదలకు ముందే డిజిటల్ రైట్స్ ద్వారా భారీ మొత్తాలు రావడంతో బడ్జెట్ లో ఎక్కువ భాగం తిరిగి వచ్చేది. దీంతో పెద్ద బడ్జెట్ చిత్రాల నిర్మాణానికి కూడా ప్రొడ్యూసర్లు ధైర్యంగా ముందుకు అడుగు వేయగలిగారు. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందనే చర్చ కొన్ని రోజులుగా సాగుతోంది.
ఇటీవలి కాలంలో ఓటీటీ సంస్థలు డిజిటల్ హక్కుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయని తెలుస్తోంది. గతంలో నిర్మాతలు ఆశించిన స్థాయిలో డబ్బులు చెల్లించిన సంస్థలు.. ఇప్పుడు మాత్రం భారీగా తగ్గిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. నిర్మాతలు కోరుతున్న మొత్తాలకు చాలా తక్కువ రేట్లు ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో సినిమా బడ్జెట్ లెక్కలు మొత్తం మారుతున్నాయని వినికిడి.
ముఖ్యంగా భారీ బడ్జెట్ చిత్రాలు రూపొందిస్తున్న నిర్మాతలకు ఇది పెద్ద సవాలుగా మారుతోంది. క్యాస్టింగ్ రెమ్యూనరేషన్లు, ప్రొడక్షన్ కాస్ట్, టెక్నికల్ ఖర్చులు ఇప్పటికే భారీగా పెరిగిపోయాయి. ఇలాంటి సమయంలో డిజిటల్ రైట్స్ ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోవడంతో బడ్జెట్ తిరిగి రాబట్టే మార్గాలు బాగా తగ్గుతున్నాయనే చెప్పాలి. దీంతో థియేటర్లలో సినిమా సాధించే వసూళ్లపైనే ఎక్కువగా ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
గతంలో థియేటర్లలో రిజల్ట్ ఎలా ఉన్నా.. ఓటీటీ, శాటిలైట్ రైట్స్ రూపంలో నిర్మాతలకు కొంత రిలీఫ్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ భరోసా తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. కొన్ని డిజిటల్ ప్లాట్ ఫామ్స్ తమ బడ్జెట్ కేటాయింపులు పూర్తయ్యాయని చెబుతూ కొత్త ఒప్పందాల విషయంలో వెనుకంజ వేస్తున్నాయనే ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో నిర్మాతలు సినిమాల ఫైనాన్సియల్ ప్లాన్ ను మళ్లీ అబ్జర్వ్ చేయాల్సిన అవసరం కనిపిస్తోంది.
ఇలాంటి పరిస్థితుల్లో మేకర్స్ భారీ బడ్జెట్ లతో రిస్క్ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. స్టోరీకి అవసరమైన రేంజ్ లోనే ఖర్చు చేయడం, ఎక్స్ ట్రా బడ్జెచ్ ను తగ్గించడం, రెమ్యూనరేషన్ల విషయంలో బ్యాలెన్స్ పాటించడం వంటి విషయాలపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందని అనేక మంది మూవీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. కేవలం ఓటీటీ డీల్స్ వస్తాయనే అంచనాలతో బడ్జెట్ లను పెంచడం ఇకపై సేఫ్ ప్లాన్ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అంతేకాదు, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే స్ట్రాంగ్ కంటెంట్ పైనే మెయిన్ ఫోకస్ పెట్టాల్సిన సమయం వచ్చిందని కూడా చెబుతున్నారు. ఎందుకంటే సినిమా విజయంలో థియేట్రికల్ కలెక్షన్ల ఇంపార్టెన్స్ మరోసారి పెరుగుతున్నట్లు సిగ్నల్స్ కనిపిస్తున్నాయి. మంచి కథ, సరైన ప్లాన్, కంట్రోల్డ్ బడ్జెట్ తో ముందుకెళ్తేనే నిర్మాతలు ఆర్థిక ఒత్తిడిని అధిగమించగలరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఏదేమైనా ఒకప్పుడు నిర్మాతలకు వరంగా మారిన ఓటీటీ ఒప్పందాలు ఇప్పుడు అంతగా డిపెండ్ అయ్యే అంశంగా కనిపించడం లేదు. మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ప్లాన్లు మార్చుకోవడం, బడ్జెట్ లను మళ్లీ రివ్యూ చేసుకోవడం, థియేట్రికల్ ఆదాయంపై మూవీ రేంజ్ కు తగ్గట్టు అంచనాలు పెట్టుకోవడం.. ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మాతలకు సేఫ్ ప్లాన్ గా మారిందని చెప్పాలి.
