Begin typing your search above and press return to search.

డిజిటల్ డెడ్‌లైన్‌ల దెబ్బకు డైరెక్ట‌ర్ల విజన్ దెబ్బతింటుందా?

గత కొన్నేళ్లుగా పెద్ద సినిమాల వ్యాపారంలో ఓటీటీ రైట్స్ కీలక ఆదాయ వనరుగా మారాయి.

By:  Sravani Lakshmi Srungarapu   |   4 Aug 2026 6:11 PM IST
డిజిటల్ డెడ్‌లైన్‌ల దెబ్బకు డైరెక్ట‌ర్ల విజన్ దెబ్బతింటుందా?
X

ఓటీటీ డెడ్‌లైన్లు ఇప్పుడు టాలీవుడ్ లో కొత్త డిస్క‌ష‌న్ కు కారణమవుతున్నాయి. ఒకప్పుడు సినిమా నిర్మాణంలో మెయిన్ ప్రెజ‌ర్ రిలీజ్ డేట్‌కే పరిమితమైతే, ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ డీల్స్ కూడా నిర్మాణ ప్రక్రియపై గణనీయమైన ప్రభావం చూపుతున్నాయనే అభిప్రాయం బలపడుతోంది. ముఖ్యంగా పోస్ట్ ప్రొడక్షన్ దశలో టైమ్ తగ్గిపోవడం సినిమాల ఫైన‌ల్ క్వాలిటీపై ప్రభావం చూపుతోందా అనే ప్రశ్న ఇండ‌స్ట్రీలో మళ్లీ చర్చనీయాంశంగా మారింది.

గత కొన్నేళ్లుగా పెద్ద సినిమాల వ్యాపారంలో ఓటీటీ రైట్స్ కీలక ఆదాయ వనరుగా మారాయి. దీంతో థియేట్రికల్ రిలీజ్ తర్వాత డిజిటల్ రిలీజ్‌కు సంబంధించిన టైమ్‌లైన్లు ముందుగానే ఫిక్స్ అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎడిటింగ్, సౌండ్ డిజైన్, కలర్ గ్రేడింగ్, విజువల్ ఎఫెక్ట్స్ వంటి కీలక పనులకు అవసరమైన టైమ్ దొరకడం లేదని పలువురు టెక్నీషియన్లు అనఫీషియ‌ల్ గా చెప్తున్న ప‌రిస్థితి నెల‌కొంది. ఆడియ‌న్స్ కూడా ఇటీవల కొన్ని సినిమాల విషయంలో ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. మంచి కథ ఉన్నప్పటికీ విజువల్ ఫినిషింగ్, వీఎఫ్ఎక్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ లేదా ఎడిటింగ్‌లో లోపాలు కనిపిస్తున్నాయనే విమర్శలు సోషల్ మీడియాలో రెగ్యుల‌ర్ గా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాల్లో పోస్ట్ ప్రొడక్షన్ వ‌ర్క్స్ క్వాలిటీపై ఆడియ‌న్స్ అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం ప్రకారం సమస్య ఓటీటీ ఒక్కటే కాదు. భారీ రిలీజుల పోటీ, ఫెస్టివ‌ల్ డేట్స్ కోసం జరిగే రేసు, ఫైనాన్షియల్ కమిట్‌మెంట్స్, మార్కెటింగ్ షెడ్యూల్స్ అన్నీ కలిపి పోస్ట్ ప్రొడక్షన్ టైమ్ ను కుదిస్తున్నాయి. అయితే ఓటీటీ డెలివరీ కమిట్‌మెంట్స్ ఈ ప్రెజర్ ను మరింత పెంచుతున్నాయనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. మ‌రో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, సినిమా నుంచి ట్రైలర్ రిలీజ‌య్యే వరకు కూడా కొన్ని సినిమాల్లో వీఎఫ్ఎక్స్ వ‌ర్క్స్ జ‌రుగుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. అంటే సినిమా పూర్తిగా రెడీ కాకముందే ప్రమోషన్లు ప్రారంభమవుతున్నాయన్న మాట. ఇది లాస్ట్ మినిట్ లో మార్పులు, సవరణలు చేయాల్సిన పరిస్థితులను సృష్టిస్తోందని కొందరు దర్శక‌నిర్మాత‌లు భావిస్తున్నారు.

అయితే మరోవైపు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు నిర్మాతలకు ఆర్థిక భద్రతను కల్పిస్తున్నాయనే వాదన కూడా ఉంది. ఓటీటీ డీల్స్ వల్ల పెట్టుబడిలో కొంత భాగం ముందుగానే రికవరీ అవుతుంది. అందువల్ల అసలు సమస్య డెడ్‌లైన్లలో కాదు, ప్రాజెక్ట్ ప్లానింగ్‌లో ఉందని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. థియేటర్ ఎక్స్‌పీరియెన్స్, డిజిటల్ డెలివరీ, కమర్షియల్ ఒత్తిళ్ల మధ్య సమతుల్యత సాధించడమే ఇప్పుడు దర్శ‌క‌నిర్మాత‌ల ముందున్న అసలైన‌ సవాలుగా కనిపిస్తోంది.