అలాంటి వాటికి ఫుల్‌స్టాప్ పెట్టాల్సిందే!
కరోనా ఎఫెక్ట్ తో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఎన్నో మార్పులొచ్చాయి. మరీ ముఖ్యంగా ఓటీటీ ద్వారా అయితే చాలా మార్పొచ్చింది.
By: Sravani Lakshmi Srungarapu | 25 Aug 2025 2:00 AM ISTకరోనా ఎఫెక్ట్ తో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఎన్నో మార్పులొచ్చాయి. మరీ ముఖ్యంగా ఓటీటీ ద్వారా అయితే చాలా మార్పొచ్చింది. అప్పటివరకు థియేటర్లలో మాత్రమే కొత్త సినిమాలు చూసే ఆడియన్స్ కు ఓటీటీలో కూడా కొత్త సినిమాలు చూడటం అలవాటైంది. తర్వాత్తర్వాత ఆ అలవాటు విపరీతంగా పెరిగిపోయింది. అప్పటివరకు ఇండియన్ ఆడియన్స్ కు అలవాటు లేని వెబ్‌సిరీస్ కల్చర్ అప్పట్నుంచే మొదలైంది.
క్రైమ్, హార్రర్, వయొలెన్స్, సైకో కిల్లింగ్ లాంటి ఎన్నో జానర్లలో గత కొన్నాళ్లుగా ఎన్ని సినిమాలొచ్చాయో లెక్క కూడా లేదు. ఓటీటీలో రిలీజ్ చేస్తే సెన్సార్ చేసే పనుండదు. ఈ కారణంతో మేకర్స్ తమకు నచ్చింది తీసేయొచ్చు. నెట్‌ఫ్లిక్స్ లాంటి ఓటీటీలైతే బోల్డ్‌నెస్ ఉంటేనే ఆడియన్స్ ఎట్రాక్ట్ అవుతారనే కండిషన్ తో ఎంతోమంది డైరెక్టర్లను ఆ విధమైన అడల్ట్ కంటెంట్ సినిమాలను తీసేలా ప్రేరేపించాయి.
పిల్లలపై దారుణమైన ఎఫెక్ట్
అయితే ఇదంతా ఇప్పుడెందుకనుకోవచ్చు. దానికి రీజన్ రీసెంట్ గా హైదరాబాద్ లో జరుగుతున్న మర్డర్లు. కూకట్‌పల్లిలో ఓ టెన్త్ క్లాస్ కుర్రాడు చిన్న అమ్మాయిని కత్తితో మర్డర్ చేయడం అందరినీ కలవరపెడుతోంది. అసలు టెన్త్ క్లాసబ్బాయి ఇలా ఎలా చేయగలిగాడు అంటే ఓటీటీలోని క్రైమ్ థ్రిలర్లు చూసే తాను ఇలా చేశానని చెప్పడం పోలీసులను సైతం ఆశ్చర్యపరిచింది.
ఇలాంటి ఇన్సిడెంట్స్ గతంలో కూడా జరిగాయి కానీ వాటిని పిల్లలు చేయలేదు. ఇప్పుడు జరిగిన విషయం చాలా సెన్సిటివ్. ఈ సంఘటన చూసి తల్లిదండ్రులు సైతం భయపడుతున్నారు. అలాంటి వెబ్‌సిరీస్‌లు, కంటెంట్ కు అడ్డు లేకపోవడంతోనే పిల్లలు ఇలా తయారవుతున్నారని, సైకో కిల్లర్ సినిమాలంటూ మరీ క్రూరమైన కంటెంట్ ను చూపిస్తూ డైరెక్టర్లు తమకు తెలియకుండానే తప్పులు చేస్తున్నారు. కమర్షియల్ గా వర్కవుట్ అవుతూ వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ వాటి ఎఫెక్ట్ సమాజంపై, పిల్లలపై ఎలా ఉంటుందనేది డైరెక్టర్లు కనీస ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇలాంటి వాటిపై ప్రభుత్వాలు సీరియస్ గా ఆలోచించి వాటిని ఎలా నియంత్రించాలనే దానిపై ఓ కార్యాచరణ రూపొందిస్తే బెటర్.
