Begin typing your search above and press return to search.

2026లో వెలుగులోకి వచ్చిన యువ నటులు!

ఓటీటీ రంగం గత దశాబ్ద కాలంగా అనేక మార్పులకు లోనవుతూ వస్తోంది. ఒకప్పుడు స్టార్ నటుల హవా నడిచిన డిజిటల్ వేదికలపై 2026 మొదటి అర్ధభాగం మాత్రం సరికొత్త యువ ప్రతిభను వెలుగులోకి తెచ్చింది.

By:  Srikanth Kontham   |   3 Aug 2026 8:00 AM IST
2026లో వెలుగులోకి వచ్చిన యువ నటులు!
X

ఓటీటీ రంగం గత దశాబ్ద కాలంగా అనేక మార్పులకు లోనవుతూ వస్తోంది. ఒకప్పుడు స్టార్ నటుల హవా నడిచిన డిజిటల్ వేదికలపై 2026 మొదటి అర్ధభాగం మాత్రం సరికొత్త యువ ప్రతిభను వెలుగులోకి తెచ్చింది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కేవలం నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న కొత్త నటులు ఇండస్ట్రీలో సుదీర్ఘ ప్రయాణం చేసేలా అడుగులు వేస్తున్నారు. ప్రసన్నా బిష్త్, సమరా తిజోరి, ఆకాశ్ మఖీజా వంటి నటులు ఈ ఏడాది ఓటీటీ స్క్రీన్‌ను శాసించారన‌డంలో అతిశయోక్తి లేదు.

ప్రస్తుత కాలంలో థియేట్రికల్ సినిమాల్లో అగ్ర హీరోలనే విలన్‌లుగా చూపించే ట్రెండ్ నడుస్తుండగా ఓటీటీ మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన మార్గాన్ని ఎంచుకుంది. పెద్దగా పరిచయం లేని కొత్తవారే అత్యంత క్రూరమైన విలన్ పాత్రల్లో జీవిస్తూ ప్రేక్షకులను ఆశ్చ‌ర్యప‌రుస్తున్నారు. ప్రైమ్ వీడియోలో వచ్చిన `రాఖ్` సిరీస్‌లో ఆకాశ్ మఖీజా, రన్‌దీప్ యాదవ్ లు సీరియల్ కిల్లర్ల పాత్రల్లో నటించి భయపెట్టారు. 1970 నాటి రంగ-బిల్లా ఉదంతం ఆధారంగా తెరకెక్కిన చిత్రంలో వారిద్దరి అభినయం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచింది.

మరోవైపు థ్రిల్లర్ జోనర్‌లలో వ‌స్తోన్న‌ కథలు కూడా యువ నటీమణులకు ప్రయోగాత్మక పాత్రలు చేసే అవకాశాన్ని ఇస్తున్నాయి. `దల్దల్` చిత్రంలో సమరా తిజోరి హంతకురాలి పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. కెరీర్ ప్రారంభ దశలోనే ఇలాంటి డిఫరెంట్, డేరింగ్ రోల్స్ చేయడానికి యువ నటీమణులు ముందుకు రావడం ఓటీటీ పరిశ్రమకు మంచి పరిణామం. నెట్‌ఫ్లిక్స్ `గ్లోరీ` చిత్రంలో కాశ్మీరా పరదేశి కూడా గృహిణి నుంచి అండర్‌వరల్డ్ కింగ్‌పిన్‌గా మారే పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించారు.

కేవలం భయానక హత్యలే కాకుండా చుట్టూ సమాజంలో కనిపించే సాధారణ రూపంలోని క్రూరత్వాన్ని కూడా యువ నటులు అద్దం పడుతున్నారు. జియోహాట్‌స్టార్‌లో ప్రసారమైన `చిరైయాల` సిరీస్‌లో సిద్ధార్థ్ షా సాధారణ గృహ స్థుడిగా కనిపిస్తూనే మరోవైపు భార్యను వేధించే క్రూరుడిగా నటించి దిగ్భ్రాంతికి గురిచేశారు. బాయ్-నెక్స్ట్-డోర్ ఇమేజ్ ఉన్న నటులు కూడా ఇలాంటి సంక్లిష్టమైన షేడ్స్ ఉన్న పాత్రలు చేయడం ఓటీటీ కంటెంట్ స్థాయిని మరింత పెంచింది.

ఈ ఏడాది వైవిధ్యభరితమైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించిన మరో ముఖ్యమైన పేరు ప్రసన్నా బిష్త్. `చిరైయాల` చిత్రంలో వైవాహిక అత్యాచార బాధితురాలిగా ఆమె ప్రదర్శించిన నటన దేశవ్యాప్తంగా చర్చనీ యాంశమైంది. ఆ తీవ్రతను ప్రదర్శించిన కొన్ని వారాలకే, ప్రైమ్ వీడియోలో వచ్చిన `ఆదర్శ్ బాల్ విద్యాలయ` అనే సెటైరికల్ కామెడీ సిరీస్‌లో తనలోని హాస్య చతురతను కూడా బయటపెట్టి తాను ఏ పాత్రనైనా చేయగలనని నిరూపించుకున్నారు.

ఇలా పలు రకాల జోనర్లలో కొత్త నటులు పుట్టుకొస్తుండటం డిజిటల్ కంటెంట్ భవిష్యత్తుకు శుభసూచకం. రానున్న రోజుల్లో మరిన్ని కొత్త కథలతో యువ తారలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. స్టార్ డమ్‌తో సంబంధం లేకుండా బలమైన కథలు, నటన మాత్రమే ఓటీటీలో విజయాన్ని నిర్ణయిస్తాయని ఈ ఏడాది స్పష్టం చేసింది.