Begin typing your search above and press return to search.

మిడ్-రేంజ్ హీరోల ఆలస్యమే టాలీవుడ్‌కు శాపమా?

సరికొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వేగంగా రావాల్సిన తెలుగు మిడ్-రేంజ్ హీరోలు ప్రస్తుతం ఒక్కో సినిమాకు రెండేళ్ల నుంచి మూడేళ్ల సుదీర్ఘ సమయాన్ని వెచ్చిస్తున్నారు.

By:  Srikanth Kontham   |   4 Sept 2026 7:00 PM IST
మిడ్-రేంజ్ హీరోల ఆలస్యమే టాలీవుడ్‌కు శాపమా?
X

ప్రస్తుతం టాలీవుడ్ విచిత్రమైన పరిణామాన్ని ఎదుర్కొంటోంది. ఒకవైపు పాన్-ఇండియా స్థాయి విజయాభ్యాసాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తుంటే? మరొకవైపు స్థానిక థియేట్రికల్ మార్కెట్‌లో పరభాషా కథానాయకుల డామినేషన్ అంత‌కంత‌కు పెరుగుతోంది. తమిళ, మలయాళ, హిందీ నటులు తెలుగు మార్కెట్‌లో నేరుగా సినిమాలు చేయ‌డం లేదా? డబ్బింగ్ చిత్రాలతో కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నారు. టాలీవుడ్ పరిశ్రమలో తలెత్తిన అనూహ్య మార్పు వెనుక ప్రధానంగా తెలుగు మిడ్-రేంజ్ హీరోల కాలయాపన వ్యూహాలే కారణమనే విమర్శలు తెర‌పైకి వ‌స్తున్నాయి.

సరికొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వేగంగా రావాల్సిన తెలుగు మిడ్-రేంజ్ హీరోలు ప్రస్తుతం ఒక్కో సినిమాకు రెండేళ్ల నుంచి మూడేళ్ల సుదీర్ఘ సమయాన్ని వెచ్చిస్తున్నారు. ప్రొడక్షన్ ఆలస్యం, కథల ఎంపికలో గందరగోళం, = పాన్-ఇండియా ఆర్భాటాల వల్ల ఒక్కో ప్రాజెక్ట్ కు ఏళ్లు ప‌డుతోంది. దీంతో థియేటర్ల వద్ద, పంపిణీదారుల వద్ద ఒక రకమైన స్పేస్ ర్పడుతోంది. నిరంతరం కొత్త కంటెంట్‌ను కోరుకునే తెలుగు ప్రేక్షకులకు సుదీర్ఘ నిరీక్షణ నిరాశనే మిగుల్చుతోంది.

తెలుగు హీరోల నుంచి తగినన్ని డేట్స్ లభించకపోవడంతో పాటు ఏడాదికి కనీసం ఒక సినిమా కూడా బయటకు రాకపోవడంతో టాలీవుడ్ దర్శకులు ప్రత్యామ్నాయాల వైపు చూడక తప్పడం లేదు. తమ వద్ద ఉన్న కథలను పట్టాలెక్కించేందుకు తమిళ, మలయాళ , హిందీ పరిశ్రమలకు చెందిన హీరోలను సంప్రదిస్తున్నారు. విజయ్ సేతుపతి, దుల్కర్ సల్మాన్, ధనుష్, శివకార్తికేయ వంటి నటులు తెలుగు దర్శకులతో పనిచేయడానికి సిద్ధంగా ఉండటమే కాకుండా తక్కువ సమయంలోనే ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తుండటం నిర్మాతలకు కూడా కలిసొస్తుంది.

మరొకవైపు పరభాషా హీరోలకు టాలీవుడ్ విపరీతమైన ఆదరణ , మార్కెట్ పరిధిని అందిస్తోంది. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ మంచి కంటెంట్‌ను, నటనను భాషతో సంబంధం లేకుండా ఆదరిస్తారు. ఈ నేప‌థ్యంలో ఇతర భాషల నటులు తెలుగులో సినిమాలు చేస్తూ ఇక్కడి మార్కెట్‌పై పట్టు సాధిస్తున్నారు. ఇది నిర్మాతలు, పంపిణీదారులకు వ్యాపారపరంగా లాభదాయకంగానే ఉన్నా? సుదీర్ఘకాలంలో స్థానిక యువ హీరోల అవకాశాలను, మార్కెట్ స్థిరత్వాన్ని దెబ్బతీసే ప్రమాదం లేకపోలేదు.

అలాగే ప్రాజెక్ట్ ఆలస్యం కావడం వల్ల సినిమా బడ్జెట్‌లు పెరిగిపోవడమే కాకుండా ట్రెండ్స్ మారిపోయి చివరకు ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోతున్నాయి. కొన్నేళ్ల పాటు ఒకే సినిమాపై దృష్టి పెట్టడం వల్ల నటులు కూడా విభిన్నమైన పాత్రలను ప్రయత్నించే అవకాశాన్ని కోల్పోతున్నారు. వేగంగా సినిమాలు పూర్తి చేస్తూ ఏడాదికి రెండు మూడు చిత్రాలతో ప్రేక్షకులను పలకరించే తమిళ, మలయాళ పరిశ్రమల పని సంస్కృతిని తెలుగు మిడ్-రేంజ్ హీరోలు అలవర్చుకోవాల్సిన అవసరం ఉంద‌నే వాద‌న బ‌లంగా వ్య‌క్త‌మ‌వుతోంద‌తి.

టాలీవుడ్ మార్కెట్ పెరగడం ఆహ్వానించదగిన పరిణామమే అయినా? స్థానిక హీరోలు ప్రాధాన్యతలను పునసమీక్షించుకోవాలి. కంటెంట్ కాన్సెప్ట్‌ల వేగం, పక్కా ప్రణాళికతో తక్కువ సమయంలో సినిమాలు పూర్తి చేసే సంస్కృతి పెరిగినప్పుడే ఖాళీలు భర్తీ అవుతాయి. లేని పక్షంలో పరభాషా హీరోల హవా మరింత పెరిగి తెలుగు మిడ్-రేంజ్ హీరోలు సొంత మార్కెట్‌లోనే తీవ్రమైన పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంద‌న్న‌ది కాద‌న‌లేని నిజం.