ఆస్కార్ రెడ్ కార్పెట్ పై డ్రెస్సింగ్ స్టైల్ తో విమర్శలు ఎదుర్కొన్న సెలబ్రిటీస్ వీరే!
ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డుల వేడుక అంటే కేవలం సినిమాల గురించే కాదు, రెడ్ కార్పెట్ మీద తారలు ఒలికించే మెరుపులు కూడా ఎంతో ప్రత్యేకం.
By: Madhu Reddy | 17 March 2026 10:38 PM ISTప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డుల వేడుక అంటే కేవలం సినిమాల గురించే కాదు, రెడ్ కార్పెట్ మీద తారలు ఒలికించే మెరుపులు కూడా ఎంతో ప్రత్యేకం. అయితే, 2026 ఆస్కార్ వేడుకల్లో కొందరు సెలబ్రిటీలు తమ వింత డ్రెస్సింగ్ స్టైల్‌తో ఫ్యాషన్ విమర్శకుల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. అతిగా ప్రయోగాలు చేయడం లేదా సందర్భానికి తగని దుస్తులు ధరించడం వల్ల వీరు 'వర్స్ట్ డ్రెస్సెడ్' జాబితాలో చేరిపోయారు. మరి ఆ తారలు ఎవరో, వారి లుక్ ఎందుకు ఫెయిల్ అయిందో ఇప్పుడు చూద్దాం.
ఆకట్టుకోలేకపోయిన గిన్నిఫర్ గుడ్విన్, తిమోతీ చాలమెట్:
నటి గిన్నిఫర్ గుడ్విన్ బ్లాక్ షీర్ ఆర్గాంజా డ్రెస్ ధరించి రెడ్ కార్పెట్ మీద కనిపించారు. అయితే, ఆ డ్రెస్ ఆమె శరీరానికి సరిగ్గా నప్పలేదని, లుక్ మొత్తం చాలా డల్ గా ఉందనే విమర్శలు వచ్చాయి. ఇక ఉత్తమ నటుడు కేటగిరీలో నామినీగా ఉన్న తిమోతీ చాలమెట్ వైట్ టక్సేడోలో మెరిసినప్పటికీ, ఆయన పెట్టుకున్న నల్ల అద్దాలు మరియు ఇతర యాక్సెసరీస్ లుక్‌ను పాడుచేశాయని ఫ్యాషన్ ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక ఒక పెద్ద ఈవెంట్‌కు రావాల్సిన హుందాతనం ఆ డ్రెస్సింగ్‌లో లేదని నెటిజన్లు కూడా కామెంట్ చేస్తున్నారు.
ఓవర్ గా ట్రై చేసి దెబ్బతిన్న క్రిస్టన్ విగ్:
ఇక క్రిస్టన్ విగ్ తన గౌను విషయంలో చాలా భారీ ప్రయోగం చేశారు. బ్లాక్ పర్ల్స్ మరియు రఫుల్స్ ఉన్న ఆ డ్రెస్ ఆస్కార్ వేదికకు అసలు సెట్ కాలేదని విమర్శలు వచ్చాయి. అతిగా ఉన్న ఆ డిజైన్ ఆమెను ఇబ్బంది పెడుతున్నట్లుగా అనిపించింది. ఇక అలాగే కెల్టీ నైట్ ఎంచుకున్న నియాన్ యెల్లో డ్రెస్ కూడా విమర్శల పాలైంది. ఆమె డ్రెస్ ఆస్కార్ వేడుక కంటే కూడా సమ్మర్ వెకేషన్ కు వెళ్లే వారి డ్రెస్ లా ఉందని, ఆస్కార్స్ వంటి గ్రాండ్ ఈవెంట్ కు ఇది ఏమాత్రం సరిపోదని ఫ్యాషన్ పండితులు పెదవి విరిచారు.
వింతైన డిజైన్లతో షాకిచ్చిన స్టార్స్:
ప్రముఖ రచయిత్రి మాగీ ఓఫారెల్ ధరించిన 1980ల నాటి హాట్ పింక్ సాటిన్ గౌన్ మరో చర్చనీయాంశంగా మారింది. పింక్ డ్రెస్ కు బ్లాక్ బెల్ట్, బ్లాక్ గ్లోవ్స్ మరియు ఫేస్ మీద నెట్ వాడటం కొంచెం వింతగా అనిపించింది. ఇక బ్రిటనీ హోవార్డ్ వేసుకున్న బ్లాక్ ట్రెంచ్ కోట్ మరియు వింతైన డెకరేషన్స్ కూడా అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఆస్కార్ రెడ్ కార్పెట్ మీద ఉండే అల్ట్రా గ్లామరస్ లుక్ కు బదులు ఇవి చాలా అన్ కన్వెన్షనల్ గా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తాయి.
ఆస్కార్ వేదికపై తారలు ఎప్పుడూ ట్రెండ్ సెట్ చేయాలని చూస్తుంటారు, కానీ కొన్నిసార్లు ఆ ప్రయత్నాలు ఇలా బెడిసికొడుతుంటాయి. డ్రెస్సింగ్ విషయంలో చేసే అతి ప్రయోగాలు ఫ్యాషన్ ప్రపంచంలో నవ్వుల పాలు చేస్తాయని ఈ తారల లుక్స్ నిరూపించాయి. ఇక ఏదేమైనా ఆస్కార్స్ అంటేనే గ్లామర్ మరియు వివాదాల కలయిక కాబట్టి, ఈ 'వర్స్ట్ డ్రెస్సెడ్' జాబితా కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
