'ఆస్కార్స్ -2026' లైవ్ భారత్‌లో డిలేకు కారణం?
ప్రపంచ సినీ యవనికపై అత్యంత ప్రతిష్టాత్మకమైన 98వ అకాడమీ అవార్డుల (ఆస్కార్స్ 2026) వేడుకకు రంగం సిద్ధమైంది.
By: Sivaji Kontham | 15 March 2026 8:21 PM ISTప్రపంచ సినీ యవనికపై అత్యంత ప్రతిష్టాత్మకమైన 98వ అకాడమీ అవార్డుల (ఆస్కార్స్ 2026) వేడుకకు రంగం సిద్ధమైంది. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ నిర్వహిస్తున్న ఈ గ్రాండ్ వేడుక అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఉన్న ఐకానిక్ డాల్బీ థియేటర్‌లో అత్యంత వైభవంగా జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణుల అత్యుత్తమ ప్రతిభను గుర్తించి గౌరవించే ఈ వేడుక కోసం కోట్లాది మంది సినీ ప్రియులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
సమయ వ్యత్యాసం కారణంగా.. అమెరికాలో మార్చి 15న జరిగే ఈ వేడుకను భారతీయ ప్రేక్షకులు 16 మార్చి సోమవారం నాడు వీక్షించవచ్చు. భారతీయ కాలమానం ప్రకారం మార్చి 16 తెల్లవారుజామున 4:30 గంటలకే ప్రత్యక్ష ప్రసారం ప్రారంభమవుతుంది. గ్లామర్ - తారల మెరుపులతో నిండిపోయే రెడ్ కార్పెట్ ప్రదర్శనతో ఈ వేడుక అట్టహాసంగా మొదలవుతుంది. సినిమా రంగంలో అత్యున్నత పురస్కారంగా భావించే ఆస్కార్ వేదికపై ఈసారి ఎవరు మెరుస్తారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
ఈ వేడుకను భారత్‌లో ప్రత్యక్షంగా వీక్షించేందుకు రెండు ప్రధాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి. టీవీ ప్రేక్షకులు స్టార్ మూవీస్ ఛానెల్ ద్వారా ఈవెంట్‌ను లైవ్‌లో చూడవచ్చు. ఇక డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను ఇష్టపడే వారు జియో హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ చూడొచ్చు. ఒకవేళ తెల్లవారుజామున ప్రత్యక్ష ప్రసారాన్ని మిస్ అయినట్లయితే అదే రోజు రాత్రి 9 గంటలకు స్టార్ మూవీస్‌లో రిపీటవుతుంది.. లేదా జియో హాట్ స్టార్‌లో ఎప్పుడైనా వీక్షించవచ్చు.
ఈ ఏడాది నామినేషన్ల రేసులో హారర్-యాక్షన్ చిత్రం `సిన్నర్స్` ఏకంగా 16 నామినేషన్లతో రికార్డు సృష్టించి చరిత్రకెక్కింది. దీని వెనుకే 13 నామినేషన్లతో `వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్` చిత్రం గట్టి పోటీనిస్తోంది. ఈ భారీ చిత్రాలతో పాటు మార్టీ సుప్రీం, ఫ్రాంకెన్‌స్టైయిన్, సెంటిమెంటల్ వాల్యూ వంటి చిత్రాలు కూడా పలు విభాగాల్లో నామినేట్ అయ్యి ఆస్కార్ బరిలో నిలిచాయి. ఈ చిత్రాల మధ్య పోటీ హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కూడా వేడిని పెంచింది.
నటన విభాగాల విషయానికొస్తే.. ఉత్తమ నటుడి కేటగిరీలో మైఖేల్ బి జోర్డాన్ (సిన్నర్స్) , తిమోతీ చలమెట్ (మార్టీ సుప్రీం) మధ్య ప్రధాన పోటీ నెలకొంది. వీరితో పాటు దిగ్గజ నటుడు లియోనార్డో డికాప్రియో కూడా రేసులో ఉన్నారు. ఇక ఉత్తమ నటి విభాగంలో జెస్సీ బక్లీ (హామ్నెట్) ఫేవరెట్‌గా కనిపిస్తుండగా, ఎమ్మా స్టోన్ , రెనేట్ రీన్స్వే వంటి ప్రతిభావంతులైన నటీమణులు ఈ నటికి సవాల్ విసురుతున్నారు. ఈసారి అవార్డుల ప్రదానం ఉత్కంఠభరితంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ ప్రతిష్టాత్మక వేడుకను ప్రముఖ హాస్యనటుడు, టెలివిజన్ హోస్ట్ కోనన్ ఓబ్రియన్ తనదైన శైలిలో హోస్ట్ చేయబోతున్నారు. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఈ వేడుకలో ప్రెజెంటర్‌గా లేదా ప్రత్యేక అతిథిగా మెరిసే అవకాశం ఉంది. నటన, దర్శకత్వం, రచన , సాంకేతిక విభాగాలలో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన విజేతలకు ఈ వేదికపై బంగారు విగ్రహాలను అందజేస్తారు. మార్చి 16 తెల్లవారుజామున ప్రారంభమయ్యే ఈ దృశ్యకావ్యం సినీ చరిత్రలో మరో మరపురాని అధ్యాయంగా మిగిలిపోనుంది.
