Begin typing your search above and press return to search.

ఆస్కార్ 2026: తెలుగు చిత్రాలకు తప్పని నిరాశ.. కానీ?

ఇందులో కథ నటన మాత్రమే కాకుండా ప్రపంచ స్థాయి ప్రేక్షకులను మెప్పించేలా, సాంకేతిక విలువలతో చాలా అద్భుతంగా ఈ సినిమాను తీర్చిదిద్దారు.

By:  Madhu Reddy   |   17 Dec 2025 1:14 PM IST
ఆస్కార్ 2026: తెలుగు చిత్రాలకు తప్పని నిరాశ.. కానీ?
X

2026వ సంవత్సరానికి సంబంధించి ఆస్కార్ కోసం ఎన్నో చిత్రాలు పోటీపడ్డాయి. అందులో భాగంగానే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ మంగళవారం రోజు 12 విభాగాలలో షార్ట్ లిస్ట్ చేసిన సినిమాలను, కళాకారులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటించింది. ముఖ్యంగా అంతర్జాతీయ ఫీచర్ ఫిలిం విభాగంలో ఏకంగా 15 సినిమాలు షార్ట్ లిస్ట్ చెయ్యగా.. అందులో చివరికి 5 ఫీచర్ ఫిలిమ్ లను మాత్రమే ఎంపిక చేస్తారు. వచ్చే ఏడాది జనవరి 22న తుది జాబితాను ప్రకటిస్తారు. ఇకపోతే మార్చి 15వ తేదీన ఈ ఐదు ఫీచర్ ఫిలిమ్స్ లలో ఏదో ఒక చిత్రానికి మాత్రమే ఆస్కార్ ను అందిస్తారు.

ఇదిలా ఉండగా ఈ ఆస్కార్ అవార్డుల కోసం భారత్ నుంచి అధికారికంగా ఏ సినిమాకు ఎంట్రీ లభిస్తుంది అనే విషయంలో టాలీవుడ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూడగా.. నిరాశే ఎదురయింది అని చెప్పాలి. చివరికి హిందీ చిత్రమైన "హోం బౌండ్" ఈ అవకాశాన్ని దక్కించుకోవడం గమనార్హం. ముఖ్యంగా ఈసారి ఆస్కార్ బరిలో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్నో సినిమాలు పోటీపడ్డాయి. దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన కుబేర సినిమాతో పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప2, అనిల్ రావిపూడి - వెంకటేష్ కాంబినేషన్లో సంక్రాంతికి వస్తున్నాం అలాగే మంచు విష్ణు ప్రెస్టేజియస్ మూవీ కన్నప్పతో పాటు సుకుమార్ కూతురు నటించిన గాంధీతాత చెట్టు వంటి ఎన్నో సినిమాలు ఆస్కార్ ఎంట్రీ కోసం ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పరిశీలనలోకి వచ్చాయి .

కానీ అనూహ్యంగా ఏ ఒక్క చిత్రం కూడా షార్ట్ లిస్ట్ లో స్థానం సంపాదించుకోకపోవడం గమనార్హం. ముఖ్యంగా నటన, కథాంశం, సాంకేతిక అంశాలతో ప్రశంసలు అందుకొని జాతీయస్థాయిలో పోటీ పడడం అనేది టాలీవుడ్ కి ఒక గొప్ప గౌరవంగా భావించవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాల్లో ఏదో ఒక సినిమాకి ఆస్కార్ ఎంట్రీ లభిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఎవరు ఊహించని విధంగా హిందీ చిత్రం హోం బౌండ్ ఆస్కార్ షార్ట్ లిస్ట్ చేయబడింది. ముఖ్యంగా అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకట్టుకునే కథా నేపథ్యం కలిగి ఉందని.. ఎంపిక కమిటీ భావించినట్లు సమాచారం.

ఇందులో కథ నటన మాత్రమే కాకుండా ప్రపంచ స్థాయి ప్రేక్షకులను మెప్పించేలా, సాంకేతిక విలువలతో చాలా అద్భుతంగా ఈ సినిమాను తీర్చిదిద్దారు. ఏది ఏమైనా ఆస్కార్ బరిలో తెలుగు చిత్రాలు షార్ట్ లిస్ట్ లో స్థానం సంపాదించుకోలేకపోయినా.. ఆస్కార్ కోసం పోటీ పడగలిగే స్థాయికి తెలుగు సినిమాలు ఎదిగాయని విశ్లేషకులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా భవిష్యత్తులో కచ్చితంగా తెలుగు సినిమాలు ఆస్కార్ అందుకుంటాయి అని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం.

ఇకపోతే అంతర్జాతీయ ఫీచర్ ఫిలిమ్స్ విభాగంలో షార్ట్ లిస్ట్ చేయబడిన సినిమాల విషయానికొస్తే.. బ్రెజిల్ నుండి ది సీక్రెట్ ఏజెంట్, అర్జెంటీనా నుండి బెలీన్, ఫ్రాన్స్ నుండి ఇట్ వాజ్ జస్ట్ యాన్ యాక్సిడెంట్ , జర్మనీ నుండి సౌండ్ ఆఫ్ ఫాలింగ్, ఇరాక్ నుండి ది ప్రెసిడెంట్స్ కేక్, జపాన్ నుండి కొకుహో, జోర్డాన్ నుండి ఆల్ దట్స్ లెఫ్ట్ ఆఫ్ యు, నార్వే నుండి సెంటిమెంటల్ వ్యాల్యూ, దక్షిణ కొరియా నుండి నో అదర్ ఛాయిస్, పాలస్తీనా నుండి పాలస్తీనా 36, స్పెయిన్ నుండి సిరాత్, స్విజర్లాండ్ నుండి లేట్ షిఫ్ట్, తైవాన్ నుండి లెఫ్ట్ హ్యాండెడ్ గర్ల్, ట్యూనిషియా ది వాయిస్ ఆఫ్ హింద్ రజబ్ వంటి చిత్రాలు షార్ట్ లిస్ట్ చేయబడ్డాయి. ఇందులో 5 ఫైనల్ కాగా.. ఆ ఐదు లో ఒక చిత్రానికి మాత్రమే ఆస్కార్ లభించనుంది.