ఆస్కార్ అవార్డును అమ్ముకోవచ్చా?
అయితే, అపురూపంగా భావించే ఈ ఆస్కార్ ట్రోఫీని ఎవరైనా అమ్ముకోవచ్చా? ఒకవేళ అమ్మితే ఎన్ని కోట్లు వస్తాయి? అసలు ఆ విగ్రహం తయారీకి ఎంత ఖర్చవుతుంది? ఇలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
By: Madhu Reddy | 16 March 2026 12:00 PM ISTసినిమా రంగంలో అత్యున్నత పురస్కారంగా భావించే ఆస్కార్‌ను అందుకోవడం ప్రతి కళాకారుడి కల. ఓ సినిమా అందరి ప్రశంసలు అందుకొని సూపర్ హిట్ అయ్యింది అంటే, వెంటనే ఆస్కార్ నామినేషన్ కు వెలుతుందేమో అని అనుకుంటారు. కోట్లాది రూపాయల బడ్జెట్‌తో సినిమాలు తీసేది, ప్రాణం పెట్టి నటించేది ఆ ఒక్క బంగారు పురస్కారం కోసమే. అయితే, అపురూపంగా భావించే ఈ ఆస్కార్ ట్రోఫీని ఎవరైనా అమ్ముకోవచ్చా? ఒకవేళ అమ్మితే ఎన్ని కోట్లు వస్తాయి? అసలు ఆ విగ్రహం తయారీకి ఎంత ఖర్చవుతుంది? ఇలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బంగారు విగ్రహం వెనుక ఉన్న అసలు రహస్యం:
చూడటానికి మెరిసిపోతూ అచ్చం బంగారు విగ్రహంలా కనిపించే ఆస్కార్ ట్రోఫీని చూసి కొందరు అది ఒరిజినల్ గోల్డ్ అనుకుంటారు. కానీ నిజానికి పూర్తిగా బంగారంతో చేసింది కాదు. 13.5 అంగుళాల ఎత్తు, దాదాపు 4 కేజీల బరువుండే ఈ విగ్రహాన్ని మొదట్లో రాగి (కాపర్)తో తయారు చేసి, దానిపై బంగారు కోటింగ్ పూసేవారు. కానీ ప్రస్తుతం దీనిని ఒక ప్రత్యేకమైన మిశ్రమ లోహంతో తయారు చేసి, పైన 24 క్యారెట్ల బంగారు పూతను వేస్తున్నారు. ఇక ఒక్కో ఆస్కార్ ట్రోఫీని తయారు చేయడానికి అకాడమీకి సుమారు 400 డాలర్లు ఖర్చవుతుంది. అంటే మన భారతీయ కరెన్సీలో దాదాపు 33 వేల రూపాయల పైమాటే. అంతర్జాతీయ స్థాయిలో ఇంతటి క్రేజ్ ఉన్న అవార్డు తయారీకి అయ్యే ఖర్చు ఇది.
అమ్మితే వచ్చేది కేవలం ఒక్క డాలరే!:
పొరపాటున ఎవరైనా ఈ అవార్డును అమ్మాలనుకుంటే, వారికి వచ్చేది కేవలం ఒకే ఒక్క డాలర్ అంటే మన కరెన్సీ లో సుమారు 83 రూపాయలు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. దీనికి కారణం అకాడమీ పెట్టిన కఠినమైన నిబంధన. 1950 తర్వాత ఆస్కార్ అందుకున్న ఎవరైనా, తమ అవార్డును ఇతరులకు విక్రయించకూడదు. ఒకవేళ వద్దనుకుంటే, దాన్ని తిరిగి అకాడమీకే ఇచ్చేయాలి. అలా ఇచ్చినందుకు అకాడమీ వారికి కేవలం ఒక డాలర్ మాత్రమే చెల్లిస్తుంది. ఇక అయితే 1950 కంటే ముందు వచ్చిన అవార్డులకు ఈ రూల్ వర్తించదు. అందుకే పాత కాలపు కొన్ని ఆస్కార్ అవార్డులు వేలంలో లక్షల డాలర్లకు అమ్ముడైన సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకు, మైఖేల్ జాక్సన్ 1999లో 'గాన్ విత్ ద విండ్' చిత్రానికి వచ్చిన ఆస్కార్‌ను ఏకంగా 1.5 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు.
విలువ కట్టలేని గౌరవం:
నిజానికి ఆస్కార్ అవార్డును గెలుచుకున్న వారికి అకాడమీ నగదు రూపంలో ఒక్క రూపాయి కూడా ఇవ్వదు. కానీ, ఆ అవార్డు తెచ్చిపెట్టే క్రేజ్, గౌరవం ముందు ఎన్ని కోట్లు ఇచ్చినా సరిపోవు. ఆస్కార్ గెలిచిన నటీనటులకు, దర్శకులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడమే కాకుండా, వారి రెమ్యూనరేషన్ కూడా ఊహించని స్థాయిలో పెరిగిపోతుంది. ఇక అందుకే, ఆ విగ్రహం భౌతిక విలువ కేవలం ఒక డాలరే కావొచ్చు, కానీ సినిమా ప్రపంచంలో దానికున్న బ్రాండ్ ఇమేజ్ మాత్రం వెలకట్టలేనిది. ఈ అవార్డును అమ్ముకోవడం కంటే, దాన్ని షెల్ఫ్‌లో పెట్టుకుని చూసుకోవడమే ఏ కళాకారుడికైనా అసలైన ఆనందం.
