డిజిటల్ విప్లవంలో సరికొత్త స్టార్‌డమ్!
ఈ సరికొత్త డిజిటల్ సంస్కృతి యువతకు సరికొత్త ఉపాధి మార్గాలను చూపించడమే కాకుండా ఊహించని రీతిలో ఆదాయాన్ని ఆర్జించే వేదికగా మారుతోంది.
By: Srikanth Kontham | 18 Jun 2026 8:15 AM ISTడిజిటల్ యుగంలో సెలబ్రిటీ అనే పదానికి సరికొత్త అర్థం లభిస్తోంది. ఒకప్పుడు కేవలం సినిమా నటులు, క్రీడాకారులు మాత్రమే ప్రజాదరణ పొందితే.. నేడు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు సరికొత్త తారలను సృష్టిస్తున్నాయి. తమ ప్రత్యేకమైన శైలి, వ్యక్తిత్వంతో మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను సంపాదించుకునే ఇన్‌ఫ్లుయెన్సర్లు నేడు గ్లోబల్ బ్రాండ్‌లుగా ఎదుగుతున్నారు. ఈ సరికొత్త డిజిటల్ సంస్కృతి యువతకు సరికొత్త ఉపాధి మార్గాలను చూపించడమే కాకుండా ఊహించని రీతిలో ఆదాయాన్ని ఆర్జించే వేదికగా మారుతోంది.
ఈ కోవకు చెందినవారే సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్ ఓరి (ఓర్హాన్ అవత్రామణి). బాలీవుడ్ ప్రముఖులతో పాటు దేశంలోని అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తల కుటుంబాలతో సన్నిహితంగా ఉండే ఓరి అసలు ఏం చేస్తుంటారనే ప్రశ్న చాలా కాలంగా అందరిలోనూ ఉంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన తన సంపాదన మార్గాల గురించి చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. తన వ్యక్తిగత బ్రాండ్‌ను ఒక లాభదాయకమైన వ్యాపారంగా ఎలా మార్చుకున్నారో? ఆయన వివరించిన తీరు నెటిజన్లను ఆశ్చర్యపరిచింది.
డిజిటల్ కంటెంట్ క్రియేషన్ రంగంలో బ్రాండ్ భాగస్వామ్యాల ద్వారా వచ్చే ఆదాయం ఎంత భారీగా ఉంటుందో ఓరి వెల్లడించిన వివరాలు స్పష్టం చేస్తున్నాయి. సోషల్ మీడియాలో కేవలం ఒకే ఒక్క చిన్న వీడియో లేదా రీల్ పోస్ట్ చేయడం ద్వారా ఆయన ఏకంగా 76 లక్షల వరకు సంపాదిస్తున్నట్లు పేర్కొన్నారు. తమ ఫాలోయింగ్ ఆధారంగా బ్రాండ్‌లు ఇచ్చే ప్రచారాలు ఈ స్థాయి ఆదాయాన్ని సమకూరుస్తున్నాయంటే మార్కెటింగ్ రంగంలో ఇన్‌ఫ్లుయెన్సర్ల ప్రాధాన్యత ఎంతగా పెరిగిందో? అర్థం చేసుకోవచ్చు.
ఆన్‌లైన్ కంటెంట్‌కే పరిమితం కాకుండా వ్యక్తిగత హాజరు (సెలబ్రిటీ అప్పీయరెన్స్) ద్వారా కూడా భారీగా ఆర్జించే సరికొత్త వ్యాపార నమూనాను అందిపుచ్చుకుంటున్నారు. ప్రైవేట్ వేడుకలు, వివాహాలు, పుట్టినరోజు పార్టీలు , విందులకు హాజరయ్యేందుకు ఓరి సుమారు 15 లక్షల నుండి 25 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. ఒక బాల్య స్నేహితుడిలా ఆయా వేడుకలలో కలిసిపోతూ అతిథులతో ముచ్చటించడం వారితో సమయం గడపడం వంటి విలక్షణమైన అనుభవాన్ని డబ్బుతో కొనుగోలు చేసే ట్రెండ్‌కు ఇది అద్దం పడుతోంది.
భారతదేశంలో ఇద్దరికే ప్రత్యేకమైన ఫోటో పోజ్ గుర్తింపు ఉందంటూ షారుఖ్ ఖాన్‌తో తనను తాను పోల్చుకున్న ఓరి కార్పొరేట్ రంగంలోనూ రిలయన్స్ వంటి పెద్ద సంస్థలో ప్రత్యేక ప్రాజెక్ట్ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అక్కడా భారీగా ఆదాయం సమకూరుతుంది. అయినా? ఆదాయాన్ని నిర్వహించే బాధ్యతను మాత్రం సాంప్రదాయ పద్ధతిలోనే తన తల్లిదండ్రులకు అప్పగించడం విశేషం. ఆధునిక సమాజంలో పాపులారిటీని.. క్రేజ్‌ను ఎలా మోనిటైజ్ చేసుకోవాలో ప్రస్తుత తరం ఇన్‌ఫ్లుయెన్సర్లు నిరూపిస్తున్నారు. సాంప్రదాయ వృత్తులకు భిన్నంగ కేవలం తమ వ్యక్తిగత అస్తిత్వాన్ని, ప్రజాకర్షణను ఒక వ్యాపార పెట్టుబడిగా మార్చుకుని కోట్లాది రూపాయలు సంపాది స్తున్నారు. భవిష్యత్తులో ఈ డిజిటల్ కెరియర్ మార్కెట్ మరింతగా విస్తరించనుంది. యువతలో ఇంకా సరికొత్త వ్యాపార ఆలోచనలకు పునాది కానుంది.
