ఓర్మాక్స్ సర్వేలు మనకు అవసరమా! ఈ నంబర్ గేమ్ ప్రయోజనమేంటి?
చిత్ర పరిశ్రమలో ఏ హీరో క్రేజ్ ఎలా ఉంది? ప్రస్తుత నంబర్ వన్ స్టార్ ఎవరు? అనే విషయాలపై సోషల్ మీడియాలో నిత్యం ఫ్యాన్ వార్స్ నడుస్తూనే ఉంటాయి.
By: Sivaji Kontham | 12 Jun 2026 6:00 AM ISTచిత్ర పరిశ్రమలో ఏ హీరో క్రేజ్ ఎలా ఉంది? ప్రస్తుత నంబర్ వన్ స్టార్ ఎవరు? అనే విషయాలపై సోషల్ మీడియాలో నిత్యం ఫ్యాన్ వార్స్ నడుస్తూనే ఉంటాయి. ఇలాంటి తరుణంలో `ఓర్మాక్స్ మీడియా` వంటి సంస్థలు ఇచ్చే స్టార్ ర్యాంకింగ్ రిపోర్టులు సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తుంటాయి. అయితే అసలు ఈ ఓర్మాక్స్ రిపోర్టులను ఏఏ కారకాలతో తయారు చేస్తారు? స్టార్లకు ర్యాంకింగ్‌లు ఇవ్వడానికి వీరు పాటించే ప్రామాణికత ఏమిటి? ప్రజల ఓటింగ్ విధానం లేదా వారి సర్వే పద్ధతి ఎంతవరకు సరైనది? ఈ నంబర్ గేమ్ వల్ల పరిశ్రమకు నిజంగా ఒరిగేదేంటి? అనే ప్రశ్నలు తలెత్తడం సహజం.
సాధారణంగా ఈ సర్వేలలో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న స్టార్లు, వారు నటిస్తున్న క్రేజీ సినిమాలు, నిరంతర సోషల్ మీడియా ప్రమోషన్లతో లైమ్‌లైట్‌లో ఉండే నటుల పేర్లు ఎక్కువగా వినిపిస్తుంటాయి. బాక్సాఫీస్ వద్ద ఇటీవల భారీ సక్సెస్ సాధించిన స్టార్ల పేర్లు సహజంగానే ఈ చార్టులలో టాప్ పొజిషన్లను ఆక్రమిస్తాయి. అయితే ఈరోజు సక్సెస్‌తో లైమ్‌లైట్‌లో ఉన్న స్టార్ రేపు ఉండకపోవచ్చు.. లేదా వారికి వరుసగా విజయాలు దక్కకపోవచ్చు. కానీ పరిశ్రమలోని అగ్ర హీరోలు నిత్యం ఏదో ఒక కారణంతో వార్తల్లో హైలైట్ అవుతుంటారు కాబట్టి నిరంతర సర్వేలలో ఎప్పుడూ ఆ స్టార్ల పేర్లే టాప్ ర్యాంకింగ్స్‌లో కనిపిస్తుంటాయి. మరి ప్రజలకు స్పష్టంగా తెలిసిన ఈ క్రేజీ విషయాలపై ప్రత్యేకించి సర్వేలు ఎందుకనే అనుమానం రావచ్చు. కానీ గూగుల్ శోధన (సెర్చ్ డేటా) .. శాస్త్రీయ విశ్లేషణల ఆధారంగా చేసే ఈ సర్వేలు, ప్రేక్షకులు - ట్రేడ్ వర్గాల కన్ఫ్యూజన్ నుంచి బయటపడటానికి కొంతవరకు ఉపయోగపడతాయనేది వాస్తవం.
ఈ నంబర్ గేమ్ - స్టార్ల హవాను టాలీవుడ్ (తెలుగు చలనచిత్ర పరిశ్రమ) పరంగా పరిశీలిస్తే ఇక్కడ నెక్స్ట్ జనరేషన్ లైనప్ ఎంతో బలంగా కనిపిస్తోంది. టాలీవుడ్‌లో క్రేజీ యంగ్ హీరోలుగా ఇప్పటికే నాని, విజయ్ దేవరకొండ, నిఖిల్, విశ్వక్ సేన్ వంటి వారు తమకంటూ ప్రత్యేక మార్కెట్ సృష్టించుకున్నారు. వీరితో పాటు నేటి తరం హీరోలలో నాగచైతన్య, అడివి శేష్, తేజ సజ్జా, సిద్ధు జొన్నలగడ్డ, నవీన్ పొలిశెట్టి.. ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు ఒక డజను మంది నటులు వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నారు. వైవిధ్యమైన కథలతో టాలీవుడ్‌లో నిలకడగా సక్సెస్ అందుకుంటున్న హీరోల జాబితా ఇక్కడ చాలా పెద్దగానే ఉంది.
కానీ దురదృష్టవశాత్తూ బాలీవుడ్ (హిందీ పరిశ్రమ) లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. అక్కడ సక్సెస్ అందుకుంటున్న ద్వితీయ శ్రేణి (టైర్-2) హీరోలు చాలా తక్కువగా కనిపిస్తున్నారు. నేటి తరంలో కార్తీక్ ఆర్యన్, ఆయుష్మాన్ ఖురానా లాంటి కొద్దిమంది హీరోలు మాత్రమే సక్సెస్‌తో పాటు వైవిధ్యమైన స్క్రిప్టుల ఎంపికతో నిరంతరం చర్చల్లో నిలుస్తున్నారు. మరోవైపు సిద్ధార్థ్ మల్హోత్రా, వరుణ్ ధావన్ లాంటి స్టార్లు ఎక్కువ కాలంగా వరుస వైఫల్యాలతో సతమతమవుతున్నారు. ఇక యువ నటులైన సిద్ధాంత్ చతుర్వేది, ఇషాన్ ఖట్టర్, లక్ష్య, అహాన్ పాండే వంటి వారి పేర్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నా.. ఆశించిన విజయాలు లేకపోవడం మైనస్ గా మారుతోంది.
బాలీవుడ్‌లో కొత్త తరం హీరోల పేర్లు డజనుకు పైగా ఉన్నా.. సినీ వినీలాకాశంలో వారు స్టార్‌లుగా మెరిసే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. హిందీ సినిమా భవిష్యత్తు బాగుండాలంటే ఈ కొత్త తరం యువ హీరోలు వేగంగా సక్సెస్ ట్రాక్ ఎక్కి షైన్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీటన్నింటికీ మించి... ఇటీవలి కాలంలో బాలీవుడ్ వెండితెరకు పరిచయమైన అరడజను మంది స్టార్ కిడ్స్ (నటవారసులు) బాక్సాఫీస్ వద్ద పూర్తిగా ఫెయిల్యూర్ మోడ్‌లో ఉన్నారు. ప్రేక్షకులను మెప్పించడంలో ఘోరంగా విఫలమవడంతో వారిని ఎవరూ గుర్తుంచుకునే పరిస్థితి కూడా లేదు. బాలీవుడ్ లో అగ్ర హీరోలుగా చెలమాణి అవుతున్న అమీర్ ఖాన్, సైఫ్ ఖాన్ ల వారసులు సైతం ఆశించిన సక్సెస్ లు లేక గుర్తింపుకు నోచుకోకపోవడం ఆశ్చర్యపరుస్తోంది. ఈ క్రమంలోనే ఇండస్ట్రీ ట్రెండ్స్ .. స్టార్ల అసలు స్థాయిని అంచనా వేయడానికి ఓర్మాక్స్ వంటి సర్వేలు బాలీవుడ్ లాంటి పరిశ్రమలకు మరింత అవసరంగా మారుతున్నాయి.
