గ్యాప్ తర్వాత సిద్ధార్థ్ అదిరిపోయే ఎంట్రీ.. కార్గిల్ సైనికుడిగా..
బహుభాషా నటుడు సిద్ధార్థ్ చాలా కాలం తర్వాత ఒక పవర్‌ఫుల్ పాత్రతో డిజిటల్ స్క్రీన్‌పై అదిరిపోయే ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
By: Sivaji Kontham | 12 July 2026 12:14 AM ISTబహుభాషా నటుడు సిద్ధార్థ్ చాలా కాలం తర్వాత ఒక పవర్‌ఫుల్ పాత్రతో డిజిటల్ స్క్రీన్‌పై అదిరిపోయే ఎంట్రీ ఇవ్వబోతున్నారు. నెట్‌ఫ్లిక్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సరికొత్త కార్గిల్ వార్ డ్రామా `ఆపరేషన్ సఫేద్ సాగర్` ఓటీటీ ప్రీమియర్ డేట్ అధికారికంగా ఖరారైంది. 1999 కార్గిల్ యుద్ధ నేపథ్యంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) శౌర్యపరాక్రమాలను ఆవిష్కరిస్తూ తెరకెక్కిన ఈ భారీ వెబ్ సిరీస్ ఆగస్టు 7 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించిన ఫస్ట్ టీజర్‌ను శనివారం మేకర్స్ గ్రాండ్‌గా విడుదల చేశారు.
ఈ సిరీస్ కేవలం యుద్ధరంగంలో జరిగే పోరాటాన్నే కాకుండా... భారత వైమానిక దళ చరిత్రలో నిలిచిపోయిన `గోల్డెన్ యారోస్ స్క్వాడ్రన్` పైలట్ల నిజ జీవితాలను కళ్లకు కట్టినట్లు చూపించబోతోంది. దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని ఆ వీర జవాన్ల త్యాగాలు, వారి కుటుంబాల గాథలు, యుద్ధ సమయంలో వారు తీసుకున్న అత్యంత క్లిష్టమైన నిర్ణయాల చుట్టూ ఈ కథ నడుస్తుంది. ఈ సిరీస్‌లో సిద్ధార్థ్ ఎయిర్‌ఫోర్స్ పైలట్‌గా ఒక విలక్షణమైన, లీడ్ రోల్‌లో కనిపించి మెప్పించబోతున్నారు.
నటీనటుల విషయానికి వస్తే..సిద్ధార్థ్‌తో పాటు బాలీవుడ్ ప్రముఖ నటుడు జిమ్మీ షెర్గిల్, అభయ్ వర్మ, దియా మీర్జా, ప్రాజక్తా కోలి, ఆదిల్ హుస్సేన్, మిహిర్ అహుజా వంటి భారీ తారాగణం ఈ సిరీస్‌లో కీలక పాత్రలు పోషించారు. ప్రతిభావంతుడైన దర్శకుడు ఓని సేన్ దీనిని డైరెక్ట్ చేయగా.. అభిజీత్ సింగ్ పర్మార్ - కుశాల్ శ్రీవాస్తవ ఈ సిరీస్‌ను క్రియేట్ చేశారు. మ్యాచ్‌బాక్స్ షాట్స్ - ఫీల్ గుడ్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించాయి.
ఈ వెబ్ సిరీస్‌ను ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచేలా అత్యంత రియలిస్టిక్‌గా తెరకెక్కించారు. సముద్ర మట్టానికి దాదాపు 16000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో... 100కు పైగా వాస్తవ లొకేషన్లలో ఈ హై-ఆల్టిట్యూడ్ ఎయిర్ వార్ డ్రామాను షూట్ చేయడం విశేషం. అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్ (వీఎఫ్ఎక్స్) సహాయంతో ఆనాటి కార్గిల్ వాతావరణాన్ని, గగనతలంలో జరిగే యుద్ధ సన్నివేశాలను కళ్లముందు ఉంచేలా ఒక విజువల్ వండర్‌గా దీనిని రీక్రియేట్ చేశారు.
భారతీయ డిజిటల్ స్క్రీన్‌పై ఎయిర్‌ఫోర్స్ పైలట్ల ప్రపంచాన్ని... వారి సాహసాలను ఇంత భారీ ఎత్తున చూపించడం ఇదే మొదటిసారి అని నెట్‌ఫ్లిక్స్ ఇండియా సిరీస్ హెడ్ తాన్యా బామి సగర్వంగా పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో, హృదయాలను కదిలించే ఎమోషన్స్‌తో తెరకెక్కిన ఈ `ఆపరేషన్ సఫేద్ సాగర్` సిద్ధార్థ్ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్‌గా నిలిచిపోతుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశభక్తిని రగిలించే ఈ సిరీస్ కోసం వచ్చే ఆగస్టు 7 వరకు వేచి చూడాల్సిందే.
