కలాం బయోపిక్ తోనైనా చెక్ పెడతాడా?
'ఆదిపురుష్' తో బాలీవుడ్ దర్శకుడు ఓ రౌంత్ ఎంత ఫేమస్ అయ్యాడో తెలిసిందే. ప్రభాస్ కి బాలీవుడ్ లో ఓ సూపర్ ప్లాప్ చిత్రాన్ని ఇచ్చి నెట్టింట నెటి జనులకు టార్గెట్ అయ్యాడు.
By: Srikanth Kontham | 24 Sept 2025 11:04 AM IST'ఆదిపురుష్' తో బాలీవుడ్ దర్శకుడు ఓ రౌంత్ ఎంత ఫేమస్ అయ్యాడో తెలిసిందే. ప్రభాస్ కి బాలీవుడ్ లో ఓ సూపర్ ప్లాప్ చిత్రాన్ని ఇచ్చి నెట్టింట నెటి జనులకు టార్గెట్ అయ్యాడు. సినిమాలో గ్రాఫిక్స్ చూసి స్టన్ అయిన అభిమానుల దెబ్బకి ఓం రౌత్ కి ఊపిరి ఆడనంత పనైంది. సోషల్ మీడియా వేదికగా అతడి పనితనాన్ని ప్రశ్నించడం.. సినిమాలో గ్రాఫిక్స్ తీరును ఉద్దేశించి విశ్లేషించడం వంటి చర్యలతో ఓం రౌత్ ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. దర్శకుడిపై దూషణలతో విరుచుకు పడ్డారు. అంత వరకూ బాలీవుడ్ లో ఏ డైరెక్టర్ కూడా అంతగా ట్రోలింగ్ కి గురి కాలేదు.
తొలిసారి ఓం రౌత్ పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. అయితే ఈ ఘటన తర్వాత ఓం రౌత్ సైలెంట్ అయిపోయాడు. ట్రోలింగ్ పై ఎలాంటి స్పందన లేదు. తాజాగా ట్రోలింగ్ పై తానెంత కృంగిపోయాడు అన్నది వివరించారు. `విజయం సంతోసాన్నిస్తుంది. అపజయం బాధను కలిగిస్తుంది. కానీ `అదిపురుష్` పై వచ్చిన విమర్శలకు మానసిక ఒత్తిడికి గురయ్యాన`న్నారు. తన టీమ్ తో పాటు, ఆ ప్రభావం తనపై కూడా తీవ్రంగా పడిందన్నారు. అంత వరకూ ఏ సినిమా విషయంలో అలాంటి పరిస్థితులు చూడలేదన్నారు. తొలిసారి అలాంటి దాడిని చూసే సరికి ఎలా స్పందించాలో తెలియక మౌనంగా ఉన్నట్లు తెలిపారు.
ఆ సమయంలో కుటుంబం, స్నేహితులు అండంగా ఉండటంతో మానసిక ఒత్తిడి నుంచి త్వరగా బయట పడగలిగానన్నారు. ఒకసారి ప్రేక్షకుల నమ్మకం కోల్పోతే తిరిగి పొందడం అంత సులభం కాదని..కానీ తాను చేయాల్సిందల్లా చేస్తానన్నారు. ఈ పరాజయం తర్వాత బాలీవుడ్ లో అవకాశాలు కూడా తగ్గాయి. వాస్తావానికి ఆదిపురుష్ సమయంలోనే మరో ఇద్దరు దర్శకులతో సినిమాలు చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. కానీ 'ఆదిపురుష్' ప్లాప్ తర్వాత మళ్లీ ఆ కాంబినేషన్లు తెరపైకి రాలేదు.
ప్రస్తుతం మాజీ రాష్ట్రపతి, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దు ల్ కలాం జీవిత కథను తెరకెక్కిస్తున్నారు. ఇందులో కలాం పాత్రలో ధనుష్ నటిస్తున్నాడు. ఈ సినిమాపై ఓం రౌత్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా విజయంతో తనపై తలెత్తిన నెగివిటీ, ట్రోలింగ్స్ కు గట్టి సమాధానం చెప్పాలని కసిగా పని చేస్తున్నాడు. కథని వీలైనంత వాస్తవ కథగానే మలిచేందుకు ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ లో ఉంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
