Begin typing your search above and press return to search.

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

నటనలో ఒకరితో ఒకరు పోటీపడే ఇద్దరు జాతీయ అవార్డ్ విజేత‌ల‌ కాంబినేషన్ తో ఎలాంటి అద్భుతాలు ఆవిష్కృత‌మ‌వుతాయోన‌ని సినీ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

By:  Sivaji Kontham   |   5 Nov 2026 9:46 AM IST
ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!
X

భారతీయ చలనచిత్ర రంగంలో ద‌శాబ్ధాలుగా ఎంద‌రో దిగ్గ‌జ న‌టుల‌ను చూసాం. వారి న‌ట‌విశ్వ‌రూపం తెర‌పై ఆవిష్కృత‌మైంది. అయితే ఆ స్థాయిలో గొప్ప ప్ర‌ద‌ర్శ‌న‌ల‌ను ఇవ్వ‌గ‌ల స‌మ‌ర్థులుగా ధ‌నుష్, సీనియ‌ర్ న‌టుడు మ‌మ్ముట్టి గురించి చాలా చ‌ర్చ జ‌రుగుతుంది. త‌మ కెరీర్ జ‌ర్నీలో ఇప్ప‌టికే ప‌లు చిత్రాల ద్వారా నట విశ్వరూపాన్ని ప్రదర్శించిన ఈ ఇద్దరు దిగ్గజాలు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పక్కర్లేదు. నాలుగు జాతీయ అవార్డులు అందుకున్న‌ మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి.. రెండుసార్లు జాతీయ ఉత్తమ నటుడిగా నిలిచిన కోలీవుడ్ వర్సటైల్ స్టార్ ధనుష్ కలసి నటిస్తున్న తొలి చిత్రం `ఓమ్ చాప్టర్ 1 - ఉధిరం: ది బ్లడ్ వుడ్` ఇండ‌స్ట్రీలో ప్ర‌ధానంగా చ‌ర్చ‌ల్లో నిలుస్తోంది. నటనలో ఒకరితో ఒకరు పోటీపడే ఇద్దరు జాతీయ అవార్డ్ విజేత‌ల‌ కాంబినేషన్ తో ఎలాంటి అద్భుతాలు ఆవిష్కృత‌మ‌వుతాయోన‌ని సినీ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

నటుడిగా ధనుష్ ప్రయాణంలో `ఆడుకళ‌మ్`లోని పోరాట పటిమ, `అసురన్`లో వయసుకు మించిన పాత్రలో ఒలికించిన రౌద్రం, ఆవేదన అత‌డికి రెండు జాతీయ అవార్డులను అందించాయి. కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగానూ జాతీయ పురస్కారాన్ని అందుకున్న ధనుష్.. ప్రతి పాత్రలోనూ జీవించే తీరు అపూర్వం. అలాంటి ధనుష్‌కి జోడీగా లేదా ఎదురునిలిచే శక్తిగా నటనా రంగానికి నిలువెత్తు నిదర్శనమైన మమ్ముట్టి తోడవుతున్నారు. `ఒరు వడక్కన్ వీరగాథ`, `మతిలుకల్`,`పొంతన్ మాడ`, `విధేయన్`, `డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్` చిత్రాల ద్వారా ఏకంగా మూడుసార్లు జాతీయ అవార్డులు పొందిన మమ్ముట్టి `భ్రమయుగం` చిత్రంలో కనబరిచిన అద్భుత నటనకుగానూ 2026లో నాల్గవసారి జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని కైవసం చేసుకున్నారు. ఈ ఇద్దరు నట దిగ్గజాల సుదీర్ఘ అనుభవం, ప్రతిభ ఒకే సినిమాలో తోడవడం భారతీయ సినిమాలో అరుదైన ఘట్టం.

సుమారు ఎనిమిదేళ్ల విరామం తర్వాత మమ్ముట్టి నటిస్తున్న ప్రత్యక్ష తమిళ చిత్రం ఇదే కావడం విశేషం. ఈ అటవీ ఆధారిత యాక్షన్ డ్రామాలో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో కథ సాగనుంది. ఇందులో మమ్ముట్టి `బర్మా కార్తికేయన్` అనే అత్యంత శక్తివంతమైన స్మగ్లర్ పాత్రలో కనిపించనున్నారు. `అమరన్` చిత్రంతో బాక్సాఫీస్ వద్ద రికార్డు విజయాన్ని అందించిన‌ దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటంతో ధనుష్-మమ్ముట్టి ల ఇంటెన్స్ పెర్ఫామెన్సెస్ ని స్క్రీన్‌పై ఏ రేంజ్‌లో ఆవిష్కరిస్తారోననే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

ఈ చిత్రంలో నటీనటుల ఎంపిక కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగింది. ధనుష్, మమ్ముట్టిలతో పాటు సాయి పల్లవి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తుండగా.. బాలీవుడ్ దిగ్గజ నటుడు నసీరుద్దీన్ షా, ఇంద్రన్స్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. యువ సంచలనం సాయి అభ్యంగ్కర్ సంగీతం అందిస్తుండగా.. బిను జార్జ్ అలెక్సాండర్ ప్రొడక్షన్స్, డ్రీమ్ బిగ్ ఫిల్మ్స్ ద్వారా కేరళలో గ్రాండ్‌గా విడుదలవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున థియేటర్లలోకి తీసుకువస్తుండటం విశేషం.

పాన్-ఇండియా స్థాయిలో ఎంతో ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మొదట అక్టోబర్‌లో విడుదల కావాల్సి ఉన్నా.. ఫైన‌ల్ వెర్ష‌న్‌ను మ‌రింత గ్రాండ్‌గా తీర్చిదిద్ది నవంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకువస్తున్నామ‌ని మేక‌ర్స్ తెలిపారు. రెండు వేర్వేరు తరాలకు చెందిన జాతీయ ఉత్తమ నటులు ధనుష్, మమ్ముట్టిలు ఎదురెదురుగా తలపడే సన్నివేశాలు, వారి నటనలోని ఇంటెన్సిటీ వెండితెరపై ఎలాంటి సంచలనాలకు తెర తీస్తుందో వేచి చూడాలి.